సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చదువుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తే బాగుండేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయిందని, తిరిగి ఆ ప్రక్రియను ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయాలను తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. మంగళవారం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. బుధవారం జరగబోయే ఎస్‌ఈసీ సమావేశానికి వెల్లడంలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ముందు రాజకీయ పార్టీలను పిలవటంలో ఎస్‌ఈసీకి వేరే ఉద్దేశాలున్నాయని స్పష్టమవుతుందన్నారు. అందుకే ఎస్‌ఈసీ సమావేశానికి వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఏ సీజన్ పంట నష్ట పరిహారం ఆ సీజన్‌లోనే
రాష్ట్రంలో మూడు కోవిడ్ కేసులు కూడా లేని రోజుల్లో ఏ రాజకీయ పార్టీలను అడిగి ఎన్నికలను వాయిదా వేశారో నిమ్మగడ్డ చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చ అంటూ నిమ్మగడ్డ రమేష్ మరో రాజకీయానికి తెర తీశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా? లేదా? అనేది రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా రాజకీయ పార్టీలను పిలవడం కచ్చితంగా నిమ్మగడ్డ-చంద్రబాబు రాజకీయంలో భాగమే అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment