ఏమైందమ్మా నాకు.. భయమేస్తోందమ్మా.. | Amritavarshini Suffering From Heart Disease In Guntur District | Sakshi
Sakshi News home page

చిట్టి గుండెకు కష్టమొచ్చింది

Published Mon, Mar 15 2021 10:22 AM | Last Updated on Mon, Mar 15 2021 10:22 AM

Amritavarshini Suffering From Heart Disease In Guntur District - Sakshi

అమృతవర్షిణితో తల్లి స్వర్ణకుమారి

తెనాలి: ‘అమ్మా! ఇక నేను స్కూలుకు వెళ్లలేనా? ఏమైందమ్మా నాకు.. ఎందుకొస్తోందీ నొప్పి..? భయమేస్తోందమ్మా..’అంటూ బేలగా అడుగుతున్న పదేళ్ల కన్నబిడ్డకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక ఆ తల్లి గుండె తల్లడిల్లుతోంది. ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున ఆపుకొని.. ‘లేదు బుజ్జీ... నువ్వు కోలుకుంటావ్‌.. నీ ఫ్రెండ్స్‌తో కలిసి ఆడుకుంటావు.. బడికి వెళ్తావు... సరేనా!’అంటూ ఊరడిస్తున్న ఆ తల్లి బిడ్డ ప్రాణాలకు ఊపిరిలూదేందుకు బతుకుపోరాటం చేస్తోంది.

గుండె మార్పిడే చికిత్స 
తెనాలికి చెందిన పిన్నెల స్వర్ణకుమారి కుమార్తె పదేళ్ల అమృతవర్షిణి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గత ఏడాది పాప అనారోగ్యానికి గురవడంతో ఆస్పత్రిలో చేర్చారు. ఊపిరితిత్తుల దగ్గర నెమ్ము చేరిందని, గుండెల్లో సమస్య ఉంది... నెమ్ము తగ్గాక గుండె డాక్టరుకు చూపించండి అని వైద్యులు సలహా ఇచ్చారు. డిశ్చార్జయి ఇంటికొచ్చాక, గుండె డాక్టరు దగ్గరికి తీసుకెళామనుకుకుంది స్వర్ణకుమారి. అంతలోనే కరోనా లాక్‌డౌన్‌తో బస్సులు నిలిచిపోవడం, బిడ్డకు ఆరోగ్యం బాగానే ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లలేదు.

మూడు నెలల క్రితం ఓ రోజు అర్ధరాత్రి నిద్రపోతున్న అమృతవర్షిణి, పెద్దగా కేకలు వేస్తూ మంచంపై నుంచి కింద పడిపోయింది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ బతుకు పోరాటం మళ్లీ మొదలైంది. గుంటూరు, విజయవాడ నగరాల్లోని పలు ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. గుండె పెద్దదైందని, చుట్టూ కండ చేరిందని వైద్యులు చెప్పారు. దీనికి చికిత్స లేదని, జీవితాంతం మందులు వాడాల్సిందేనని పేర్కొన్నారు. చివరకు డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలేకు అమృతవర్షిణిని చూపించారు. ఆయన సూచనపై మరికొన్ని పరీక్షలు చేయించాక, గుండె మార్పిడే చికిత్సగా తేల్చారని స్వర్ణకుమారి కన్నీటిపర్యంతమయ్యారు.

ఆ తల్లికి జీవితమంతా కష్టాలే.. 
స్వర్ణకుమారి జీవితమంతా కష్టాలే. కార్మికులైన తల్లిదండ్రులు సంపాదన సరిపోక బిడ్డల్ని చదివించలేదు. 13 ఏళ్ల వయసులో వస్త్రదుకాణంలో చేరింది. ప్రేమించానంటూ ఓ యువకుడు వెంటబడటంతో నిజమేనని నిమ్మింది. కులాలు వేరైనా ఐదేళ్ల తర్వాత 2009లో ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు స్వర్ణకుమారి ఎనిమిది నెలల గర్భంతో ఉండగా పెద్దాపరేషను చేసి బిడ్డను తీయాల్సి వచ్చింది. 15 రోజులకు పైగా ఆ బిడ్డను బాక్సులో పెట్టారు. ఆ బిడ్డకు అమృతవర్షిణిగా పేరుపెట్టుకుని మురిసిపోయారు. ప్రసవం తర్వాత స్వర్ణకుమారికి ఒంట్లో నీరు చేరింది. పనులు చేసుకోలేని స్థితిలో ఉండగా, భర్త ఆమెను ఆస్పత్రిలో చేర్చి ఎటో వెళ్లిపోయాడు.

అప్పటికే స్వర్ణకుమారి తండ్రి చనిపోయాడు. స్టీలు కంపెనీలో పనికెళ్లే తల్లి పని మానుకుని, తనను కనిపెట్టుకుని ఉండిపోయింది. భర్తకు గతంలోనే మరొకామెతో వివాహమైందని తెలిశాక స్వర్ణకుమారి మౌనంగా ఉండిపోయింది. పాపకు నాలుగేళ్లు వచ్చాక, బిడ్డతో కలిసి తను బట్టల షాపునకు, తల్లి డాల్‌ మిల్లు పనికి వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు.  ఇటీవల బిడ్డ దుస్థితి తెలిస్తే తండ్రిగా ఆదుకుంటాడేమోనని స్వర్ణకుమారి భర్తకు ఫోన్‌ చేయగా ‘నువ్వెవరో నాకు తెలీదు.నాకేం సంబంధం లేదు’ అంటూ తేల్చేయడంతో చిన్నబుచ్చుకుంది.

తాము రూ.32 లక్షలు చూసుకుంటే, గుండె దాతను, ఆపరేషన్‌ను తాను చూసుకుంటానని డాక్టర్‌ గోఖలే సార్‌ చెప్పారని పేర్కొంది. ఆ డబ్బుల కోసమే తెలిసిన దేవతలనే కాకుండా తెలియని దాతలను వేడుకుంటున్నానని గద్గద స్వరంతో చెబుతోంది. దాతలు తెనాలి గాందీచౌక్‌లోని సిండికేట్‌ బ్యాంక్‌లో ఉన్న ఖాతా నంబరు 32722010025070 (ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌: ఎస్‌వైఎన్‌బీ0003272)లో సాయం జమచేసి ఆదుకోవాలని వేడుకుంటోంది. దాతలు సంప్రదించాల్సిన స్వర్ణకుమారి సెల్‌ నంబరు 79956 71750
చదవండి:
నే గెలిచా... లేవండీ!   
లిఫ్ట్‌ అడిగి దాడి చేసి.. చివరికి..

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement