టీడీపీ నేత అత్తార్ వర్గీయుడిపై కందికుంట అనుచరుల దాడి దృశ్యం
కదిరిలో అతుకులబొంతగా మారిన టీడీపీలో.. ఇప్పుడు ఆధిపత్యపోరు మొదలైంది. ఓ వైపు కందికుంట.. మరోవైపు అత్తార్ వర్గాలు కత్తులు దూస్తున్నాయి. ఇప్పటి నుంచే అసెంబ్లీ టికెట్ కోసం బాహాబాహీకి సిద్ధమయ్యాయి. తాజాగా చాంద్ అనుచరుడిపై కందికుంట వర్గం దాడి చేయడంతో కదిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
సాక్షి,కదిరి(అనంతపురం): ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నప్పటికీ కదిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య అప్పుడే టికెట్ లొల్లి మొదలైంది. ఈసారి టీడీపీ టికెట్ తమ నేతకేనని కందికుంట వెంకట ప్రసాద్ వర్గం చెబుతుండగా, కాదు కాదు.. కచ్చితంతా మా నాయకుడికే అని అత్తార్ చాంద్‌బాషా వర్గం వాదిస్తోంది. ఈ విషయంపై కొన్ని రోజులుగా ఇరు వర్గాల మధ్య ఫేస్‌బుక్ వార్ నడుస్తోంది. ఇది కాస్త శ్రుతిమించి భౌతిక దాడుల వరకూ వెళ్లింది.
పోస్టులు పెడితే చంపేస్తాం
‘కదిరి టీడీపీ టికెట్ అత్తార్‌కే..’ అని బీసీ (పట్ర) సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులు నాయుడు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టడంతో కందికుంట వర్గానికి కోపం వచ్చింది. సుమారు 10 మంది శుక్రవారం(10వ తేదీన) కదిరి మండలం కుమ్మర వాండ్లపల్లిలో కాపురం ఉంటున్న శ్రీనివాసులు నాయుడు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతను ఇంట్లో లేకపోవడంతో అతని తల్లితో.. ‘నీ కొడుకు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఈసారి కందికుంట అన్నకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వాన్ని చంపడం ఖాయం. ఈ మాట నీ కొడుక్కు చెప్పు’ అని బెదిరించి వచ్చారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
అందరూ చూస్తుండగానే దాడి..
చాంద్ వర్గీయుడైన శ్రీనివాసులు నాయుడు శనివారం పట్టణంలోని అత్తార్ లాడ్జి వద్ద ఉన్నాడని తెలుసుకున్న కందికుంట అనుచరులు పట్టపగలే అతనిపై దాడికి దిగారు. అందరూ చూస్తుండగానే దాడి చేసి అంతమొందించేందుకు యత్నించారు. తర్వాత బలవంతంగా ఆటోలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లి మరోసారి అతనిపై దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. శ్రీనివాసులునాయుడు పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నంతో పాటు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు సీఐ రియాజ్ తెలిపారు.
ఆయన గెలిస్తే బతకనిస్తారా..?
‘కందికుంట వెంకట ప్రసాద్ ప్రతిపక్షంలో ఉండగానే ఆయన అనుచరులు ఇంతటి దౌర్జన్యానికి పాల్పడుతున్నారే.. ఇక ఆయన గెలిస్తే సామాన్యులను బతకనిస్తారా?’’ అని ‘పట్ర’ సామాజిక వర్గానికి చెందిన కొందరు మీడియా ముందు వాపోయారు. ‘ఈసారి టీడీపీ టికెట్ చాంద్‌కే’ అని పోస్టు పెట్టినంత మాత్రాన చంపడానికి ప్రయత్నిస్తారా..? అని వారు మండిపడ్డారు. ఒకవేళ కందికుంటకే టికెట్ ఇస్తే ఆయన ఓటమే ధ్యేయంగా తామంతా పనిచేస్తామని వారు తేల్చిచెబుతున్నారు.
కందికుంట బాటలోనే అనుచరులు..
మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలింగ్‌బూత్‌లోకి దూసుకెళ్తున్న తనను అడ్డుకున్న సీఐ మధుతో కందికుంట గొడవ పడ్డారు. ఇంకోసారి టౌన్‌ప్లానింగ్ అధికారి రహిమాన్‌పై దాడికి దిగారు. మరోసారి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్‌ఐ మున్వర్‌పై దాడి చేశారు. తాను చెప్పినట్లు వినడం లేదన్న కారణంతో మహిళ అని కూడా చూడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రమీళను రాయలేని భాషలో దూషించారు. ఇలాంటి సంఘటనలు ఈ మూడేళ్లలోనే కోకొల్లలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా.. అన్న చందంగా కందికుంట అనుచరులు వైఎస్సార్‌సీపీ నాయకులు, పాత్రికేయులు, అత్తార్ చాంద్‌బాషా వర్గీయులపై భౌతిక దాడులకు దిగారు. వ్యక్తిగతంగా దూషిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే వారిపై పలు కేసులు నమోదు చేసినప్పటికీ.. ప్రవర్తనలో మార్పు రాలేదు. పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.
కఠినంగా శిక్షించాలి
కదిరి టౌన్: ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టినంత మాత్రానికే శ్రీనివాసులునాయుడుపై దాడికి పాల్పడడం అమానుషమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని అత్తార్ రెసిడెన్షియల్‌లో ఆ పార్టీ నాయకులు సోమ్లా నాయక్, అబ్దుల్ ఖాదర్, బయప్ప తదితరులు శనివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కందికుంట వెంకటప్రసాద్ వర్గీయులు పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇంకోసారి చాంద్‌బాషా వర్గంపైకి వస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఏమైనా ఇబ్బంది అయితే పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయాలి కానీ, హత్య చేయాలను కోవడం దారుణమన్నారు. దాడి చేసిన కందికుంట వర్గీయులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమల్, శ్రీకాంత్ చౌదరి, చంద్రశేఖర్, షామీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment