యాంటీబయోటిక్స్‌కు చికిత్స | Andhra Govt Thwarted Massive Exploitation In Procurement Of Antibiotics | Sakshi
Sakshi News home page

యాంటీబయోటిక్స్‌కు చికిత్స

Published Sun, Jun 20 2021 4:02 AM | Last Updated on Sun, Jun 20 2021 4:28 AM

Andhra Govt Thwarted Massive Exploitation In Procurement Of Antibiotics - Sakshi

సాక్షి, అమరావతి: ప్రాణాధార మందులు (యాంటీబయోటిక్స్‌) కొనుగోళ్లలో భారీ దోపిడీకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీంతో గత పదేళ్లుగా సీపీఎస్‌యూ (సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌)ల పేరుతో అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్న దుస్థితి నుంచి రాష్ట్రానికి విముక్తి లభించింది. రాష్ట్రానికి వచ్చే చాలా రకాల యాంటీబయోటిక్స్‌.. సీపీఎస్‌యూలు మాత్రమే సరఫరా చేసేలా రిజర్వుడు ఐటెమ్స్‌గా ఉండేవి. సీపీఎస్‌యూలు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే కొనాల్సి వచ్చేది. ఎలాంటి టెండరూ ఉండేది కాదు. ఈ విధానానికి ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం చెక్‌ పెట్టింది. రిజర్వుడు కేటగిరీలో ఉన్న యాంటీబయోటిక్స్‌ మందులను డీరిజర్వు చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇప్పుడు యాంటీబయోటిక్స్‌ రేట్లు 50 శాతానికి పైగానే తగ్గాయి. 

పదేళ్లలో రూ.200 కోట్లు నష్టం
రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువ చేసే యాంటీబయోటిక్స్‌ మందులను సీపీఎస్‌యూల నుంచి కొనుగోలు చేస్తోంది. అధిక ధరల కారణంగా ఏటా రూ.20 కోట్ల వరకు రాష్ట్రానికి అదనపు భారం పడేది. ఇలా గత పదేళ్లలో ఒక్క యాంటీబయోటిక్స్‌ మందుల కారణంగానే రూ.200 కోట్ల వరకు ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చింది. వీటిని డీరిజర్వు చేయడం ద్వారా ఇప్పుడు ఏటా రూ.20 కోట్లు ఆదా అవుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రాణాధార మందులను డీరిజర్వు చేయకుండా గత ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి కాంట్రాక్టర్లు భారీ లబ్ధి పొందారు. వీళ్లకు కొంతమంది నేతలు అండగా ఉండటంతో దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. ఇప్పుడు కూడా అదే రీతిలో యత్నించిన కాంట్రాక్టర్ల పాచికలు పారలేదు. 

ఇక ఎవరైనా టెండర్లలో పాల్గొనే అవకాశం..
యాంటీబయోటిక్స్‌ డీరిజర్వు నోటిఫికేషన్‌ ఇచ్చి ప్రభుత్వం టెండర్లకు వెళ్లింది. ఈ టెండరు చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. గతంలో కొనుగోలు చేసిన వాటికంటే కొన్ని మందులు వంద శాతం తక్కువ ధరకు లభించాయి. కొన్నిటిని 50 శాతం, మరికొన్నింటిని 40 శాతం తక్కువ ధరకే సరఫరా చేయడానికి ముందుకొచ్చారు. దీన్నిబట్టి ఇన్నాళ్లూ రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో తెలుస్తోంది. మన రాష్ట్రంలో లేని సీపీఎస్‌యూల కోసం ఎంత అదనంగా చెల్లింపులు చేశారో అర్థమవుతోంది. కరోనా కారణంగా కొన్ని కంపెనీలు టెండరుకు రాలేకపోయాయని, భవిష్యత్‌లో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. ఓపెన్‌ మార్కెట్‌కు వెళ్లినందువల్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)/గుడ్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్రాక్టీస్‌ (జీఎంపీ) గుర్తింపు ఉన్న ఎవరైనా ఇకపై టెండర్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.


అజిత్రోమైసిన్‌ కొనుగోళ్లలోనే రూ.1.28 కోట్లు మిగులు
కరోనా సమయంలో ఏపీలో 40 లక్షల అజిత్రోమైసిన్‌ మాత్రలు కొన్నారు. ఒక్కో మాత్ర విలువ రూ.9.20. అదే మాత్ర ఇప్పుడు కొత్త రేట్ల ప్రకారం.. రూ.6కు దిగివచ్చింది. ఇంతకుముందు ఒక్కో మాత్రపైన రూ.3.20పైనే చెల్లించాల్సి వచ్చింది. అంటే.. రూ.1.28 కోట్లు అదనంగా చెల్లించారు. ఇప్పుడు ఇదంతా మిగిలినట్టే.


భారీగా రేట్లు తగ్గాయి.. 
గతంలో సీపీఎస్‌యూల దగ్గర కొనుగోళ్ల వల్ల ఎక్కువ ధరలు చెల్లించాల్సి వచ్చేది. అందుకే ఆ విధానానికి స్వస్తి పలికాం. కొత్త విధానం ప్రకారం.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఏ కంపెనీ అయినా టెండర్లలో పాల్గొనవచ్చు. తాజాగా టెండర్లకు వెళితే భారీగా రేట్లు తగ్గాయి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చౌకగా యాంటీబయోటిక్స్‌ లభిస్తున్నాయి.
– అనిల్‌కుమార్‌ సింఘాల్, ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement