చిన్నారి జ్ఞానశ్రీకి పుట్టిన రోజు వేడుకలు
సాక్షి, అమరావతి: పేదింటి పిల్లలకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఆ అంగన్‌వాడీ స్కూల్లో పదేళ్లుగా కొనసాగుతోంది. టీచర్లు, తల్లిదండ్రులు ఆశీర్వదిస్తుంటే.. సహచర పిల్లలు శుభాకాంక్షలు చెబుతుంటే.. పుట్టిన రోజు జరుపుకొంటున్న ఆ చిన్నారి కళ్లల్లో వెలుగులు విరజిమ్మాల్సిందే కదా. అనకాపల్లి నూతన జిల్లా నాతవరం మండలం చినగొలుగొండపేట అంగన్‌వాడీ కేంద్రం–1కి రోజూ మాదిరిగానే 31 మంది పిల్లలు బుధవారం ఉదయాన్నే చేరుకున్నారు. వారితో పాటే జ్ఞానశ్రీ అనే విద్యార్థిని కూడా వచ్చింది.
నూతన డ్రెస్‌తో వచ్చిన ఆ చిన్నారి పుట్టిన రోజు అని తెలుసుకున్న టీచర్ సత్యవేణి.. వెంటనే ఆయా శ్రీదేవితో కలిసి కేక్ కటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. తోటి చిన్నారుల సమక్షంలోనే చిన్నారి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత పదేళ్లుగా అక్కడ ఈ ఆనవాయితీ కొనసాగిస్తూ పుట్టిన రోజు నాడు పేదింటి బిడ్డలకు మధురానుభూతిని అందిస్తున్నారు. ఏర్పాట్లకు అయ్యే ఖర్చులతో పాటు పిల్లలందరికీ పెన్నులు, పెన్సిళ్లు, పుస్తకాలు కూడా అంగన్‌వాడీ టీచరే సొంతంగా సమకూర్చుతున్నారు. పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నప్పుడు కపటం లేని ఆ చిన్నారుల కళ్లల్లో కనిపించే చిరునవ్వులను చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని అంగన్‌వాడీ టీచర్ సత్యవేణి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment