సాక్షి, అమరావతి: ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండాగా నేటి నుంచి బడ్జెట్ సమావేశాలకు అధికార పక్షం సిద్ధం కాగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. తాను మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని పది రోజుల క్రితమే నిర్ణయించిన చంద్రబాబు శనివారం వరకూ తర్జనభర్జన పడినట్లుగా వ్యవహరించడం గమనార్హం.
నిర్వహణ తేదీలపై బీఏసీలో నిర్ణయం
శాసన మండలితోపాటు శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు బిల్లులపై చర్చ
బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తరువాత అనుసరించే సంప్రదాయాన్ని పాటిస్తూ అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం, గురువారం శాసనసభలో చర్చించడంతోపాటు సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇవ్వనున్నారు. శుక్రవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
ప్రజాభ్యుదయమే అధికారపక్షం అజెండా..
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలపై ఉభయ సభల్లో అధికారపక్షం చర్చించనుంది. రెండేళ్లుగా కరోనా వల్ల ఆదాయం తగ్గినా సంక్షేమాభివృద్ధి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రజలకు దన్నుగా నిలిచిన వైనాన్ని సభలో వివరించనుంది. రాజధాని వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల అధికారాలు, పరిమితులు ఏమిటో శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ సీఎం జగన్‌కు సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉభయ సభల్లోనూ చర్చించే అవకాశం ఉంది.
చర్చించే ఇతర అంశాలివీ..
– జిల్లాల విభజన– పరిపాలనా వికేంద్రీకరణ
– విద్యారంగ సంస్కరణలు, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులు
– వైద్య, ఆరోగ్య రంగం–ఆరోగ్యశ్రీ, నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన
– కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు
– ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కొత్త పీఆర్సీ ఆమలు, ఉద్యోగాల భర్తీ
– పెన్షన్ల పెంపు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య, వితంతువులకు పెన్షన్ రూ.2,500
– ఉపాధి హామీ పథకం అమలు, మౌలిక వసతుల కల్పన.
– శాంతి భద్రతలు
– ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం
– వెనుకబడిన వర్గాల సంక్షేమం
– ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం
– వ్యవసాయ రంగం, ఇన్‌పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర కల్పన, వైఎస్సార్ జలకళ
– మహిళా సాధికారత, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, నామినేటెడ్ పదవులు
– గ్రామ సచివాలయాలు– ప్రజలకు జరుగుతున్న మేలు
– పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
– వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్– విద్యుత్ రంగంలో సంస్కరణలు, గత సర్కారు నిర్వాకాలు, బకాయిలు
– అమూల్ ప్రాజెక్టుతో పాడి రైతులకు మేలు
– ప్రభుత్వ హామీలు– అమలు తీరు
– పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు
వ్యక్తిగత లబ్ధి లక్ష్యంగా విపక్షం..
శాసనసభ గత సమావేశాల్లో అధికారపక్ష సభ్యులు ఎవరూ ప్రతిపక్ష నేత చంద్రబాబునుగానీ ఆయన కుటుంబ సభ్యులనుగానీ పల్లెత్తు మాట అనలేదు. అయితే తన కుటుంబ సభ్యులను అధికారపక్ష సభ్యులు దూషించినట్లు ఆరోపిస్తూ తిరిగి సీఎంగానే శాసనసభలో అడుగుపెడతామంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి సభ నుంచి నిష్క్రమించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరు కావడంపై నెలరోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. పదిరోజుల క్రితమే వ్యక్తిగత, రాజకీయ లబ్ధే అజెండాగా సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. తాను మాత్రం హాజరు కారాదని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment