BAC conference
-
ఏపీ బడ్జెట్ సమావేశాలు షురూ
సాక్షి, అమరావతి: ప్రజాభ్యుదయం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే అజెండాగా నేటి నుంచి బడ్జెట్ సమావేశాలకు అధికార పక్షం సిద్ధం కాగా వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా ప్రతిపక్ష టీడీపీ పావులు కదుపుతోంది. తాను మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలంతా శాసనసభ సమావేశాలకు హాజరు కావాలని పది రోజుల క్రితమే నిర్ణయించిన చంద్రబాబు శనివారం వరకూ తర్జనభర్జన పడినట్లుగా వ్యవహరించడం గమనార్హం. నిర్వహణ తేదీలపై బీఏసీలో నిర్ణయం శాసన మండలితోపాటు శాసనసభ 2022–23 బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో ప్రారంభమవుతాయి. గవర్నర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించాక తొలిసారి నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభలో అడుగుపెడుతున్నారు. కరోనా కారణంగా 2020, 2021 బడ్జెట్ సమావేశాల సమయంలో వర్చువల్ విధానంలో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై బీఏసీ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు బిల్లులపై చర్చ బీఏసీ సమావేశం ముగిశాక వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతుంది. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులపై చర్చించి ఆమోదించనుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణతోపాటు పలు అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాపం తెలుపుతూ మంగళవారం ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు సంతాపం తెలిపిన తరువాత అనుసరించే సంప్రదాయాన్ని పాటిస్తూ అనంతరం ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడనున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం, గురువారం శాసనసభలో చర్చించడంతోపాటు సీఎం వైఎస్ జగన్ సమాధానం ఇవ్వనున్నారు. శుక్రవారం శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రజాభ్యుదయమే అధికారపక్షం అజెండా.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాలపై ఉభయ సభల్లో అధికారపక్షం చర్చించనుంది. రెండేళ్లుగా కరోనా వల్ల ఆదాయం తగ్గినా సంక్షేమాభివృద్ధి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా ప్రజలకు దన్నుగా నిలిచిన వైనాన్ని సభలో వివరించనుంది. రాజధాని వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల అధికారాలు, పరిమితులు ఏమిటో శాసనసభ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ సీఎం జగన్‌కు సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో దీనిపై ఉభయ సభల్లోనూ చర్చించే అవకాశం ఉంది. చర్చించే ఇతర అంశాలివీ.. – జిల్లాల విభజన– పరిపాలనా వికేంద్రీకరణ – విద్యారంగ సంస్కరణలు, నాడు–నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులు – వైద్య, ఆరోగ్య రంగం–ఆరోగ్యశ్రీ, నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన – కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు. వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు – ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కొత్త పీఆర్సీ ఆమలు, ఉద్యోగాల భర్తీ – పెన్షన్ల పెంపు. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య, వితంతువులకు పెన్షన్ రూ.2,500 – ఉపాధి హామీ పథకం అమలు, మౌలిక వసతుల కల్పన. – శాంతి భద్రతలు – ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం – వెనుకబడిన వర్గాల సంక్షేమం – ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం – వ్యవసాయ రంగం, ఇన్పుట్ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర కల్పన, వైఎస్సార్ జలకళ – మహిళా సాధికారత, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ, నామినేటెడ్ పదవులు – గ్రామ సచివాలయాలు– ప్రజలకు జరుగుతున్న మేలు – పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు – వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్– విద్యుత్ రంగంలో సంస్కరణలు, గత సర్కారు నిర్వాకాలు, బకాయిలు – అమూల్ ప్రాజెక్టుతో పాడి రైతులకు మేలు – ప్రభుత్వ హామీలు– అమలు తీరు – పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులు వ్యక్తిగత లబ్ధి లక్ష్యంగా విపక్షం.. శాసనసభ గత సమావేశాల్లో అధికారపక్ష సభ్యులు ఎవరూ ప్రతిపక్ష నేత చంద్రబాబునుగానీ ఆయన కుటుంబ సభ్యులనుగానీ పల్లెత్తు మాట అనలేదు. అయితే తన కుటుంబ సభ్యులను అధికారపక్ష సభ్యులు దూషించినట్లు ఆరోపిస్తూ తిరిగి సీఎంగానే శాసనసభలో అడుగుపెడతామంటూ చంద్రబాబు ప్రతిజ్ఞ చేసి సభ నుంచి నిష్క్రమించారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరు కావడంపై నెలరోజులుగా పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో చంద్రబాబు చర్చించారు. పదిరోజుల క్రితమే వ్యక్తిగత, రాజకీయ లబ్ధే అజెండాగా సమావేశాలకు టీడీపీ ఎమ్మెల్యేలు హాజరుకావాలని చంద్రబాబు ఆదేశించారు. తాను మాత్రం హాజరు కారాదని నిర్ణయించారు. -
ఎన్ని రోజులైనా రెడీ..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్న అంశంపై బీఏసీలో టీడీపీ డ్రామాలాడింది. వర్చువల్ సమావేశాలు నిర్వహించాలంటూ ఆచరణ సాధ్యంకాని ప్రతిపాదన చేసి చివరికి వెనక్కి తగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ సమావేశాలు క్లుప్తంగా రెండు రోజులు మాత్రమే నిర్వహించడానికి వీలవుతుందని బీఏసీలో అధికారపక్షం ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే టీడీపీ తరఫున హాజరైన నిమ్మల రామానాయుడు 15 రోజులు జరపాలంటూ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ప్రమాదం ఉన్న తరుణంలో రెండు రోజులకు మించి సభ నిర్వహించడం మంచిది కాదని తాము భావిస్తున్నామని ఒక వేళ టీడీపీ కనుక డిమాండ్ చేస్తే 40 కాదు, 50 రోజులైనా, ఎన్ని రోజులైనా అసెంబ్లీ నిర్వహణకు సిద్ధమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారని తెలిసింది. తాము ఈ ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేపట్టామని, 3.98 కోట్ల మందికి రూ. 42 వేల కోట్లు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదును బదిలీ చేశామని, అసెంబ్లీ ఎక్కువ రోజులు జరిగితే ప్రభుత్వం తరఫున తాము ఇవన్నీ చెప్పుకోవడానికి, ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికీ వీలవుతుందని సీఎం అన్నారు. అయినా సరే తాము రెండు రోజులే చాలని భావిస్తున్నామన్నారు. ‘టీడీపీ కోరితే ఎన్ని రోజులైనా నిర్వహిస్తాం. కానీ వర్చువల్ అసెంబ్లీ మాత్రం సాధ్యం కాదు, దీనిపై పార్లమెంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం మార్గదర్శకాలు ఉంటాయో కూడా తెలియదు..’ అని సీఎం చెప్పినట్లు తెలిసింది. ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వర్చువల్ అసెంబ్లీ నిర్వహణకు సౌకర్యాలు లేవని తెలిపారు. దాంతో రామానాయుడు ఏమీ మాట్లాడకుండా వెనక్కి తగ్గారు. మంత్రి కన్నబాబు జోక్యం చేసుకుంటూ టీడీపీ నేత జూమ్‌లో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఇక్కడా అలాగే జరగాలంటే కుదురుతుందా అని ఛలోక్తి విసిరారు. కాగా బయట మీడియాతో మాట్లాడిన రామానాయుడు.. తాము 15 రోజులు సమావేశాలు నిర్వహించాలంటే అధికారపక్షం అంగీకరించలేదని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండలి కూడా రెండు రోజులే.... శాసనమండలి చైర్మన్ ఎం.ఏ.షరీఫ్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కూడా మండలిని రెండు రోజుల పాటు నిర్వహించాలని ఖరారు చేశారు. ఎక్కువ రోజులు నిర్వహించాలని టీడీపీ ఇక్కడ కూడా కోరింది. బీజేపీ కూడా మరిన్ని రోజులు సమావేశం నిర్వహించాలని కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ వివరించారు. -
15న రాష్ట్ర బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను 12 రోజులు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. సోమవారం అసెంబ్లీ లో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత.. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన కార్యాలయంలో బీఏసీ సమావేశం జరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్, కడియం, ఈటల, పోచారం, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, భట్టివిక్రమార్క, ఎంఐఎం నేత అక్బరుద్దీన్, బీజేï ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీఎల్పీ నేత సండ్ర వెంకటవీరయ్య, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. మూడు రోజులు సెలవులు: గవర్నర్ ప్రసంగంతో సోమవారం ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు.. ఈ నెల 27 దాకా జరుగుతాయి. 13, 14వ తేదీల్లో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, ప్రభుత్వ వివరణ ఉంటాయి. 15న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 16, 17, 18 తేదీల్లో ఉగాది సెలవులు. 19న బడ్జెట్‌పై చర్చ, ఆర్థిక మంత్రి వివరణ, 20 నుంచి 25 వరకు డిమాండ్లు, పద్దుల మీద చర్చ, వివరణలు, ఓటింగ్ ఉంటాయి. 25న ఆదివారమైనా కూడా సభను నిర్వహించాలని నిర్ణయించారు. 26న శ్రీరామనవమి సందర్భంగా సెలవు. 27న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదిస్తారు. -
అసెంబ్లీ 14వ తేదీకి వాయిదా
⇒ 13న ఉభయ సభలు జరగవు... బడ్జెట్‌పై బీఏసీలో నిర్ణయం ⇒ భూమా మృతికి 14న శాసనసభ, మండలిలో సంతాప తీర్మానం సాక్షి, అమరావతి: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి మృతితో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14వ తేదీకి వాయిదా పడ్డాయి. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. భూమా మృతి కారణంగా 13వ తేదీన ఉభయ సభలు జరగవని అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమావేశమవుతాయని, భూమా మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతాయని పేర్కొన్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుందని, బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టాలనే అంశాన్ని నిర్ణయిస్తారని వెల్లడించారు. 13వ తేదీన ఉదయం జరగాల్సిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశం కూడా రద్దయింది.