
సాక్షి, అమరావతి: ఆంధ్రప‍్రదేశ్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా వైఎస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్టాడారు. ఈ సందర్బంగా ఆయన.. ‘‘బడ్జెట్ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. గతంలో కరోనా వలన అనుకున్నట్లుగా జరగలేదు. ఈసారి 12 రోజులు అనేక అంశాలపై చర్చ చేసి, నిర్ణయాలు తీసుకున్నాం.
అయితే, ప్రధాన ప్రతిపక్షం రెండు సభల్లోనూ దారుణంగా ప్రవర్తించింది. వారి తీరు రాజకీయ నాయకులు, ప్రజలు సిగ్గు పడేలా ఉంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి సభకి రానని భీష్మ ప్రతిజ్ఞ చేశారు. మరి వాళ్ల అబ్బాయి ఎందుకు వస్తున్నాడు? ఆ పార్టీ సభ్యులు ఎందుకు వస్తున్నట్టు? ఏంటి ఈ ద్వంద్వ వైఖరి? తొలురోజే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆరోజు నుంచి చివరి వరకు వారి డైలాగు ఒక్కటే.. అదే జంగారెడ్డిగూడెం మరణాల వ్యవహారం. మద్యం పాలసీ మీద ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకోవాలని చూశారు.
వాస్తవానికి జంగారెడ్డిగూడెంలో సహజ మరణాలే తప్ప మరేమీ లేదు. సహజ మరణాలను సారా మరణాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద‍్రబాబు బయట ఉండి వారి పార్టీ ఎమ్మెల్యేలను రెచ్చగొట్టారు. అందుకే వారు విజిల్స్ తెచ్చి సభని ఎగతాళి చేశారు. ఆ మరోసటి రోజు చిడతలు తెచ్చి వాయించారు. ఈరోజు మంగళ సూత్రాలు తెచ్చారు. మంగళగిరిలో ఓడిపోయాక లోకేశ్‌కి బుర్ర పోయింది. జనం అతన్ని దగ్గరకు రానీయొద్దు. సభలో అనేక అంశాలపై చర్చ జరిగింది. పెగాసెస్, పోలవరం సహా అనేక అంశాలపై చర్చ జరిగింది. కానీ, ప్రతిపక్ష నేతలు సభలో కాకుండా వాళ్ల పచ్చ మీడియాలో మాట్లాడుతారు. అసహనంతో ఉన్న చంద్రబాబు.. వ్యవస్థలను అగౌరపరిచేలా చేశారు’’ అని వ్యాఖ్యలు చేశారు.