సాక్షి, అమరావతి: నివర్ తుపాన్‌తో నష్టపోయిన రైతులను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పరామర్శించలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పంట నష్టంపై సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కరోనాకు భయపడి చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో మాత్రం ఎల్లో మీడియా కవరేజ్ కోసం డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని విమర్శించారు. సభలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో అర్థం కావడం లేదని అన్నారు. తాను అయిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా ఏనాడూ పోడియం వద్దకు రాలేదని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తూ ఆయన వ్యవహారశైలిపై రూల్ 77 ప్రకారం.. చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభా సమావేశాలను స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారానికి వాయిదా వేశారు.
మండలి సమావేశాలు రేపటికి వాయిదా
శాసన మండలి సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. అంతకు ముందు మండలిలో తుపాను నష్టంపై జరిగిన చర్చ సందర్బంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీలకు గతంలో చంద్రబాబు నాయుడి ‘మనసులో మాట’ పుస్తకంలోని వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టాయి. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల తమకు ప్రేమ వున్నట్లు మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీలకు తమ నాయకుడు చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యలు ఇరుకున పెట్టాయి. తుపాను నష్టం విషయంలో రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బిటీ నాయుడు చేసిన ఆరోపణలపై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాద్‌లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
చంద్రబాబు సహా టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్
సభా కార్యక్రమాలకు అంతరాయం కలగించిన టీడీపీ సభ్యులను స్పీకర్ అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, బాల వీరాంజనేయులు, నిమ్మల రామానాయుడు, సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని, గద్దె రామ్మోహన్, మంతెన రామరాజు, అచ్చెన్నాయుడు, బీ అశోక్, పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణ బాబు, బుచ‍్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, సత్యప్రసాద్ సస్పెండ్ అయ్యారు. సభ నుంచి బైటకు వచ్చి అసెంబ్లీ ప్రధాన ద్వారం ముందు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
ఆవేశంతో ఊగిపోయిన చంద్రబాబు
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభలో ఆవేశంతో ఊగిపోయారు. అధికార పక్షంవైపు వేలు చూపిస్తూ వాగ్యుద్దానికి దిగారు. టీడీపీ సభ్యులు అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిమ్మల రామానాయుడికి మాట్లాడే అవకాశం ఇచ్చినా వినియోగించుకోకుండా టీడీపీ సభ్యులు గలాటా సృష్టించడంపై అధికార పార్టీ సభ్యులు మండిపడ్డారు. తన తప్పులను కప్పిపుచ్చకునేందుకు చంద్రబాబు సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
టీడీపీ సభ్యుల రభస
వ్యవసాయరంగంపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సభ ముందు పూర్తి వివరాలు ఉంచారు. మంత్రి ప్రసంగం ముగిసిన తర్వాత మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి స్పీకర్‌అవకాశం ఇచ్చారు. అయితే టీడీపీకే చెందిన పయ్యావుల కేశవ్.. రామానాయుడు మాట్లాడకుండా అడ్డుపడ్డారు. మీ పార్టీకి చెందిన సభ్యుడిని మాట్లాడకుండా అడ్డుకోవడం సబబు కాదని కేశవ్‌కు స్పీకర్‌నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. టీడీపీ సభ్యులు అవగాహన లేకండా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. తర్వాత కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు.
అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్
శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చించకుండా ఆమోదించినందుకు నిరసనగా వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. వ్యవసాయం రంగంపై చర్చ కావాలని వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. అదే అంశంపై చర్చ జరుగుతుంటే వాకౌట్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే అంశంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. టీడీపీకి అమరావతి రైతులే తప్ప మిగతా రైతులు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబులా నటించడం తమ ముఖ్యమంత్రికి రాదని టీడీపీకి చురక అంటించారు. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారని చెప్పారు.
పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు ఆమోదం
బీఏసీ సమావేశం తర్వాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీనిపై విపక్ష టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లుపై మళ్లీ చర్చించాలని డిమాండ్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు. ఈ బిల్లుపై ఇంతకుముందే అసెంబ్లీ సమగ్ర చర్చ జరిగిందని, ఇక్కడ నుంచి శాసనమండలికి పంపించారని సీఎం తెలిపారు. వినూత్నమైన పద్ధతిలో పంచాయతీరాజ్ చట్టసవరణ బిల్లు తీసుకొచ్చామని వివరించారు. వ్యవస్థలో మార్పు తీసుకురావాలన్న ఆరాటంతో ఈ బిల్లు తెచ్చామన్నారు. [చదవండి: ఏపీ అసెంబ్లీ: లైవ్ అప్‌డేట్స్ 2 వ రోజు ]
లోకేష్‌కు కొడాలి నాని కౌంటర్
అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులు సరిపోకపోతే చంద్రబాబు, లోకేష్.. జూమ్ మీటింగ్ పెట్టుకోవాలని కొడాలి నాని అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ‘మా భద్రత కన్నా ప్రజల భద్రతే మాకు ముఖ్యం. పేర్ని నాని ఎన్నడూ ప్రజల్లోనే, ప్రజల మనిషిగా తిరుగుతున్నార’ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
పోతుల సునీత రాజీనామా ఆమోదం
ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామాను మండలి ఛైర్మన్ షరీఫ్ ఆమోదించారు. శాసన మండలి సభ్యత్వానికి గత నెలలో సునీత తెలిపారు. రాజీనామా చేసి, లేఖను చైర్మన్‌కు పంపించారు. టీడీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు ఆమె అప్పట్లో తెలిపారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు విఫలం అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని, అందుకే ఆయనకు మద్దతు ఇస్తున్నట్లు సునీత చెప్పారు.
ముగిసిన బీఏసీ సమావేశం
ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్ 4 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 19 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీఏసీ సమావేశంలో 21 ఎజెండా అంశాలను ప్రతిపాదించిన వైఎస్‌ఆర్ సీపీ ప్రతిపాదించింది.
1. పోలవరం ప్రాజెక్ట్ పురోగతి
2. గత ప్రభుత్వ తప్పిదాలు
3. ఇళ్లపట్టాల పంపిణీ- ప్రతిపక్షాల కుట్ర
4. టిడ్కో గృహాలు-వాస్తవాలు
5. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీ కరణ- ప్రతిపక్షాల కుట్ర
6. వెనుకబడిన వర్గాల సంక్షేమం, కార్పొరేషన్లు ఏర్పాటు,
7. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం
8. కరోనా నియంత్రణ- ప్రభుత్వ చర్యలు
9. వైద్య, ఆరోగ్య రంగం- ఆరోగ్యశ్రీ
10. వ్యవసాయం ఇన్‌పుట్‌సబ్సిడీ, ఆర్‌బీకేలు, సున్నావడ్డీ రుణాలు, మద్దతు ధర, వైఎస్‌ఆర్ జలసిరి
11. గ్రామసచివాలయ, మైరుగైన పనితీరు
12. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ
13. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు తీరు
14. మహిళా సాధికారికత, వైఎస్‌ఆర్ చేయూత, ఆసరా, సున్నావడ్డీ
15. మద్యం నియంత్రణ, ప్రభుత్వ సంస్కరణలు
16. సాగునీటి ప్రాజెక్ట్‌లు, రివర్స్ టెండరింగ్
18. అవినీతి నిర్మూలన, పారదర్శక పాలన
19. పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ చర్యలు
20. 9 గంటల ఉచిత విద్యుత్, ప్రభుత్వ సంస్కరణలు
21. నూతన ఇసుక విధానం
చంద్రబాబు డ్రామాలు ఆపాలి: మద్దాల గిరి
చంద్రబాబు రైతులను ఏనాడు ఆదుకోలేదని, తుపాను బాధిత రైతులకు పరిహారం సక్రమంగా ఇవ్వలేదని ఎమ్మెల్యే మద్దాల గిరి విమర్శించారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ ఎగవేసిన ఘనత చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్ చెల్లించారని, ఇప్పటికే తుపాను బాధితులకు పరిహారం ప్రకటించారని తెలిపారు. తుపాను వల్ల చనిపోయినవారికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని హితవు పలికారు.
అసెంబ్లీ వాయిదా
సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత శాసనసభను స్పీకర్ స్పీకర్ తమ్మినేని సీతారాం కొద్దిసేపు వాయిదా వేశారు. టీ విరామం తర్వాత స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం వైఎస్ జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి.. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హాజరుకాలేదు. నివర్ తుపాను నష్టంపై చర్చించాలని యనమల రామకృష్ణుడు కోరగా... చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బీఏసీలో నిర్ణయం తీసుకుని సభలో చర్చిందామని సూచించారు.
మండలి సమావేశాలు ప్రారంభం
ఈ ఉదయం 10 గంటల సమయంలో శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో కూడా ప్రణబ్ ముఖర్జీ, ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాప తీర్మానాలను ఆమోదించారు. కొత్తగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు జకీయా ఖానుమ్, పందుల రవీంద్ర, డొక్కా మాణిక్య వరప్రసాద్ సమావేశాలకు హాజరయ్యారు. సంతాప తీర్మానాలు ఆమోదించిన తర్వాత మండలి చైర్మన్‌ను సభను అరగంట పాటు వాయిదా వేశారు. నివర్ తుపాను నష్టంపై చర్చకు అంతకుముందు టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా మండలి చైర్మన్ షరీఫ్ తిరస్కరించారు.
ఎస్సీ బాలు మృతికి సంతాపం
ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం పట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. తన సుమధుర గానంతో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారని కొనియాడారు. ఆయన గౌరవార్థం నెల్లూరులోని మ్యూజిక్, డాన్స్ ప్రభుత్వ పాఠశాలను డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్, డాన్స్ పాఠశాలగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పీకర్ ఈ సందర్భంగా తెలిపారు.
మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం
మాజీ ఎమ్మెల్యేలు జనార్దన్, డాక్టర్ రవీంద్ర రాజు, కె. చంద్రమోహన్, పైడికొండల మాణిక్యాలరావు, పి. అమ్మిరాజు, భమిడి నారాయణస్వామి, కూనపరెడ్డి వీర రాఘవేంద్రరావు, బల్లి దుర్గాప్రసాదరావు, మంగపతిరావు, ద్రోణంరాజు శ్రీనివాస్, మోచర్ల జోహార్, కందుల శివానందరెడ్డి, వైటీ రాజా, డీకే సత్యప్రభలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఆయా నియోజవర్గాలకు వీరంతా అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ప్రారంభమయ్యాయి. మొదటి అంశంగా సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కుమార్ ముఖర్జీ మృతికి ముందుగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఐదు దశాబ్దాల పాటు దేశానికి ఆదర్శవంతమై సేవలను ప్రణబ్ ముఖర్జీ అందించారని స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా పేర్కొన్నారు. వివిధ హోదాల్లో పనిచేసిన ప్రణబ్ పదవులకు వన్నె తెచ్చారని.. రాష్ట్రపతిగా స్వతంత్రంగా వ్యవహరించి తనదైన ముద్ర వేశారని ప్రశంసించారు.
టీడీపీ ర్యాలీ.. పాల్గొన్న చంద్రబాబు
వర్షాలు, వరదల్లో నష్టపోయిన రైతులు, పేదలను ఆదుకోవాలని టీడీపీ శాసనసభ పక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి పక్షనేత చంద్రబాబు, ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీలు నారా లోకేష్, ఆశోక్ బాబు, సత్యనారాయణ రాజు, శ్రీనివాస్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. తడిచిన వరి పనలు, ప్లకార్డ్ లతో టీడీపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment