సాక్షి, అమరావతి: ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు షేక్ నాజిమ్మ. ఈమె బీఏ వరకు చదువుకుంది. తొలుత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేసింది. ఆ తర్వాత కొన్నాళ్లు ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్ చెప్పింది. ఆదాయం సరిపోక జీవనం కష్టంగా ఉండటంతో కుటుంబ పోషణ కోసం చిరు వ్యాపారం ప్రారంభించింది. ఇంటి వద్ద పూర్ణాలు, బజ్జీలు, పునుగులు, వడలు తయారు చేయడం నేర్చుకుంది.
ఆ తర్వాత వాటన్నింటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని వీధి వీధి తిరుగుతూ అమ్ముతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో నుంచి బయలు దేరి వన్‌టౌన్ రాజీవ్ గాంధీ పూలమార్కెట్ తదితర ప్రాంతాల్లో రాత్రి ఎనిమిది గంటల వరకు నడుస్తూనే సరుకు విక్రయిస్తుంది. ఈ విధంగా ఆమె 17 సంవత్సరాలుగా చేస్తుంది. సరుకు తయారీ రూ.2 వేలు ఖర్చు అవుతుందని లాభాం మాత్రం రూ.500 నుంచి 700 వరకు ఉంటుందని చెప్పింది.
తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒకరికి పెళ్లి చేయగా మరొకరిని ప్రభుత్వ కాళాశాలలో డిగ్రీ చదివిస్తున్నానని తెలిపింది. వయసు పెరిగి ఆరోగ్యం సహకరించడం లేదని, అయినా కుటుంబ పోషణ కోసం వీధి వీధి తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా దాతలు ఒక తోపుడు బండి అందిస్తే దాన్ని ఒకే ప్రదేశంలో పెట్టుకుని తాను తయారు చేసిన పదార్థాలు అమ్ముకుంటానని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment