
సాక్షి, అమరావతి: కరోనా వ్యాక్సినేషన్‌లో ఆంధ్ర ప్రదేశ్ మరో రికార్డు సొంతం చేసుకుంది. మూడు కోట్ల డోసుల మైలురాయిని అధిగమించి రికార్డు సృష్టించింది. ఆరు కోట్ల రాష్ట్ర జనాభాలో సగం మందికిపైగా వ్యాక్సిన్ వేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందింది. రాష్ట్రంలో మంగళవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 8.50 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 3,00,87,377 మందికి వ్యాక్సిన్ వేశామన్నారు. తొలి డోసును 2,16,64,834 మంది వేసుకోగా.. రెండు డోసులు వేసుకున్నవారు 84,22,543 మంది ఉన్నారని వివరించారు. కేంద్రం నుంచి మరిన్ని డోసులు వస్తే రాబోయే రెండు నెలల్లోనే మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. వలంటీర్, సచివాలయ వ్యవస్థల సహకారంతో రాష్ట్రంలో శరవేగంగా వ్యాక్సినేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు.
2 రోజుల్లో 13.80 లక్షల టీకా డోసులు రాక
గన్నవరం: గత రెండు రోజుల్లో రాష్ట్రానికి 13.80 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పుణెనుంచి ఢిల్లీకి.. అక్కడ నుంచి ఎయిరిండియా విమానాల్లో గన్నవరం విమానాశ్రయానికి తరలించారు. సోమవారం 81 బాక్స్‌ల్లో 9.72 లక్షలు, మంగళవారం ఉదయం 4.08 లక్షల డోసులు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment