సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాష్ట్రంలో భారీ ఎత్తున నిధులు దోపిడీ చేసిన రెండు కుంభకోణాలపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. నాటి ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సన్నిహితులు, బినామీలకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టి రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన అవినీతిపై చర్యలకు ఉపక్రమించింది. రాష్ట్ర ఫైబర్ నెట్ కాంట్రాక్టుల్లో దాదాపు రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణం జరిగింది.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన కంపెనీ టెరాసాఫ్ట్‌కు ఈ కాంట్రాక్టును నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరిట రూ.241.78 కోట్లను దారి మళ్లించారు. సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో షెల్ కంపెనీలకు అడ్డగోలుగా నిధులు దోచిపెట్టారు. ఈ 2 కుంభకోణాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పట్లోనే జాతీయ స్థాయిలో దుమారం
ఫైబర్ నెట్ టెండర్ల అక్రమాలపై కేసు విచారణకు తగిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. చంద్రబాబు హయాంలో ‘ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ లిమిటెడ్’ చేపట్టిన ఫైబర్ నెట్ ప్రాజెక్టు టెండర్లలో అడ్డగోలు అవినీతికి పాల్పడిన వైనంపై అప్పట్లోనే జాతీయ స్థాయిలో దుమారం చెలరేగింది.
కేంద్ర ప్రభుత్వ నిధులతో భారత్ నెట్ ప్రాజెక్టు కింద రాష్ట్ర ప్రభుత్వం 2014–19లో ఫైబర్ నెట్ రెండో దశ పనులు చేపట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీ వేమూరి హరికృష్ణకు అనుకూలంగా ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ సలహాదారు కూడా అయిన వేమూరి హరికృష్ణ ఈ ఫైబర్ నెట్ టెండర్ల కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తనకు చెందిన టెరా సాఫ్ట్ కంపెనీకే టెండర్లు ఖరారు చేశారు.
ఈ టెండర్లను అత్యధిక రేట్లకు అంటే అంచనా విలువ కంటే ఏకంగా 11.26 శాతం అధికానికి కట్టబెట్టేశారు. టెండర్లలో ఎల్–1గా వచ్చిన సంస్థను కాదని ఎల్–3గా నిలిచిన టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు అప్పగించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు విరుద్ధంగా భూగర్భ ఇంటర్నెట్ కేబుళ్లు కాకుండా ఓపెన్ కేబుళ్లకు కూడా అనుమతి ఇచ్చేశారు. వేమూరి హరికృష్ణకు అయాచితంగా లబ్ధి చేకూర్చేందుకు సెట్‌టాప్ బాక్సుల సరఫరా కాంట్రాక్టును కూడా నాలుగు ప్యాకేజీల కింద విభజించి మరీ టెరా సాఫ్ట్‌కంపెనీకి కట్టబెట్టారు. 13 జిల్లాల్లో ఫైబర్ నెట్ నిర్వహణ కాంట్రాక్టు కూడా అదే రీతిలో ఆ సంస్థకే ఏకపక్షంగా అప్పగించారు. భారత్ నెట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఎక్కువ రేట్లకు టెండర్లను ఆమోదించడం గమనార్హం.
టెలికం శాఖ అభ్యంతరాలూ బేఖాతరు
కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ ఓసారి అభ్యంతరాలు వ్యక్తం చేసి టెండర్లను ఆమోదించలేదు. దాంతో ఓ బినామీ సంస్థతో జాయింట్ వెంచర్ ముసుగులో మళ్లీ అదే రీతిలో టెరాసాఫ్ట్ సంస్థకే ఫైబర్ నెట్ టెండర్లను అడ్డగోలుగా అప్పగించేశారు. టెండర్లలో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా పక్కనపెట్టేసి టెరా సాఫ్ట్ కంపెనీకి అనుకూలంగా టీడీపీ ప్రభుత్వం అడ్డగోలుగా టెండర్లను ఖరారు చేసింది. ఈ కుంభకోణంపై అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, అంతర్జాతీయ టెలికాం సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర టెలీ కమ్యూనికేషన్ల శాఖకు ఫిర్యాదు చేశాయి.
షెల్ కంపెనీలకు రూ.241.78 కోట్లు మళ్లింపు
కాగా, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మరో కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. జర్మనీకి చెందిన సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని అక్రమంగా బినామీ కంపెనీలకు తరలించినట్టు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. సీమెన్స్ ప్రాజెక్టు పేరుతో సుమారు రూ.241.78 కోట్లు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని తరలించినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లెక్క తేల్చింది. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ సంస్థతో కలిసి సీమెన్స్ సంస్థ విద్యార్థులకు నైపుణ్యం పేరుతో భారీ ప్రాజెక్టును చేపట్టింది.
సుమారు రూ.37 వేల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 10 శాతం వాటా రూ.370.78 కోట్లను ప్రభుత్వం భరించేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శిక్షణ పేరుతో రికార్డుల్లో భారీగా వ్యయం చేసినట్టు చూపించి రూ.241.78 కోట్లను బినామీ కంపెనీల ద్వారా అక్రమంగా తరలించినట్టు తేలింది. సీమెన్స్, డిజైన్ టెక్‌ల ద్వారా జరిగిన అక్రమ నగదు తరలింపు లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్‌ఎస్‌డీసీని ఆదేశించింది.
ఈ మేరకు కేసు విచారణను సీఐడీకి ఇస్తూ రాష్ట్ర ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ కార్యదర్శి జి.జయలక్ష్మి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం దర్యాప్తును పూర్తి చేసి త్వరితగతిన నివేదిక అందించాల్సిందిగా సీఐడీ అదనపు డీజీని ప్రభుత్వం ఆదేశించింది.
కేసుపై సమగ్ర దర్యాప్తు
ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఫైబర్ నెట్ కాంట్రాక్ట్‌లో భారీ అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. అందులో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలతోపాటు కొందరు అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. అందుకే సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీఐడీకి ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment