సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణలో ఏ మాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కోవిడ్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పింది. రాష్ట్రంలో అన్ని మత పరమైన వేడుకలకు కోవిడ్ మార్గదర్శకాలను వర్తింప చేస్తున్నామని తెలిపింది. అందులో భాగంగా గణేష్ ఉత్సవాల విషయంలో కూడా పలు ఆంక్షలు విధించామని వివరించింది. బహిరంగంగా వినాయక విగ్రహాలను, మండపాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు లేవని తెలిపింది.
వినాయక విగ్రహాలను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలియచేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులకు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి సైతం అనుమతులు లేవంది. ఈ విషయంలో ఇప్పటికే డీజీపీ రాష్ట్రంలోని అన్ని యూనిట్ ఆఫీసులకు మార్గదర్శకాలను పంపారని వివరించింది. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, అన్ని ఆస్పత్రుల్లో వైద్య పరమైన మౌలిక సదుపాయాలను పెంచామంది. కోవిడ్ విషయానికి సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై ధర్మాసనం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ మెమో దాఖలు చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.10.32 లక్షల జరిమానా
► మాస్క్ ధరించకుండా రోడ్లపై తిరిగే వారికి రూ.100 జరిమానా విధిస్తున్నాం. మాస్క్ లేని వ్యక్తులను అనుమతించే షాపులకు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు జరిమానా విధిస్తున్నాం.
► మార్కెట్, వాణిజ్య సంస్థల్లో కోవిడ్ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగితే ఆయా సంస్థలను ఒకటి, రెండు రోజుల పాటు మూసివేయిస్తున్నాం. కేసులు నమోదు చేయిస్తున్నాం.
► రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 10,197 మంది నుంచి రూ.10.32 లక్షల జరిమానా వసూలు చేశాం.
ఆక్సిజన్, ఐసీయూ బెడ్లుగా సాధారణ బెడ్లు
► థర్డ్‌వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని అన్ని ఆస్పత్రుల్లో వైద్య పరమైన మౌలిక సదుపాయాలను పెంచాం. 3,493 సాధారణ బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చాం. 521 సాధారణ బెడ్లను ఐసీయూ బెడ్లుగా, 276 ఆక్సిజన్ బెడ్లను ఐసీయూ బెడ్లుగా మార్చాం. 439 బెడ్లకు వెంటిలేటర్లను చేర్చాం.
► ప్రస్తుతం చిన్న పిల్లల వైద్యులు 769 మంది అందుబాటులో ఉన్నారు. ఇప్పటి వరకు 422 మందిని నియమించుకున్నాం. 878 మందిని నియమించుకోవాలన్నది లక్ష్యం. ప్రస్తుతం 8,278 మంది నర్సులు అందుబాటులో ఉన్నారు. 1,512 మందిని నియమించుకున్నాం.
► కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పాఠశాలలను పునఃప్రారంభించాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల రక్షణ కోసం పాటించాల్సిన విధి విధానాలను విద్యా శాఖ జారీ చేసింది. 10 శాతం కన్నా తక్కువ పాజిటివ్ రేటు ఉన్న ప్రాంతాల్లోనే పాఠశాలలు తెరవాలని ఆదేశించాం. ఒక్కో సెక్షన్‌ను 20 మంది విద్యార్థులతో విభజించాలని చెప్పాం. తగినంత స్థలం లేని చోట 6, 7, 8, 9 తరగతులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా ఆదేశాలిచ్చాం.
28 ఆక్సిజన్ ప్లాంట్లలో 18 పనిచేస్తున్నాయి...
► రాష్ట్రానికి ప్రధాన మంత్రి కేర్స్ కింద కేంద్ర ప్రభుత్వం 28 ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయించింది. ఇందులో 18 ప్లాంట్లు ఇప్పటికే సిద్ధమై పని చేస్తున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
► గత 24 గంటల్లో రాష్ట్రంలో కేవలం 6 బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 3వ తేదీ నాటికి 424 క్రియాశీలక కేసులున్నాయి. 3వ తేదీ నాటికి మొత్తం 4,897 కేసులు నమోదయ్యాయి.
► బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమైన యాంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ల నిల్వలు తగినన్ని ఉన్నాయి. 5.12 లక్షల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల నిల్వలున్నాయి.
చురుగ్గా వ్యాక్సినేషన్
► ప్రభుత్వ విద్యా సంస్థల్లో 2.31 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. 18–45 ఏళ్ల మధ్య 99 వేల మంది టీచర్లు, సిబ్బంది మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన 87,736 మంది టీచర్లు, సిబ్బంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 18–45 ఏళ్ల మధ్య ఉన్న టీచర్లు, సిబ్బందిలో 45,193 మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన టీచర్లు, సిబ్బందిలో 67,450 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.
► ప్రైవేటు విద్యా సంస్థల్లో 1.95 లక్షల మంది టీచర్లు, సిబ్బంది ఉన్నారు. 18–45 ఏళ్ల మధ్య ఉన్న 1.05 లక్షల మంది మొదటి డోసు, 25,292 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏళ్ల పైబడిన 65 వేల మంది మొదటి డోసు, 29,794 మంది రెండు డోసులు తీసుకున్నారు.
► ఈ నెల 4వ తేదీ నాటికి వ్యాక్సినేషన్ కోసం 45 ఏళ్లకు పైబడిన వారిలో 1.33 కోట్ల మంది, 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారు 1.93 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 96.70 శాతం, 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 38.30 శాతం మంది మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. 45 ఏళ్లు పైబడిన వారిలో 50.17 శాతం, 18–45 ఏళ్ల మధ్య ఉన్న వారిలో 3.68 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment