
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నియామకం విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును తప్పుగా అర్థం చేసుకున్న పిటిషనర్, నీలంసాహ్ని నియామకంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్న వారిని ఎన్నికల కమిషనర్‌గా నియమించరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యే నాటికి నీలంసాహ్ని ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేరని, ప్రభుత్వ సలహాదారు పదవికి ఆమె రాజీనామా సమర్పించారని, ఆ తరువాతే గవర్నర్ ఆమెను ఎన్నికల కమిషనర్‌గా నియమించారని వివరించారు. ఎస్‌ఈసీ నియామకం రాజ్యాంగంలోని అధికరణ 243కే ప్రకారం గవర్నర్ విచక్షణాధికారం మేరకే జరిగిందన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్
ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలంసాహ్నిని వివరణ కోరడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు మహేశ్వరరావు హైకోర్టులో కో–వారెంటో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ఎస్‌ఈసీ నీలం సాహ్నిని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోపాలకృష్ణ ద్వివేది కౌంటర్ దాఖలు చేశారు.ఓ న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ బాధ్యతలను అప్పగించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టిందన్నారు. ప్రభుత్వాధికారులుగా కొనసాగుతున్న వారిని కాకుండా స్వతంత్రంగా ఉన్న వ్యక్తులను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని చెప్పిందన్నారు. పిటిషనర్ మాత్రం నీలంసాహ్ని నియామకాన్ని సుప్రీం తీర్పులోని విషయాలతో పోలుస్తూ ఈ పిటిషన్ వేశారని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment