సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరానికి తొలి విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు 203 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 1,18,654 సీట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జీవో 130 విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ఆధ్వర్యంలోని 20 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు, 183 ప్రైవేటు అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రభుత్వం తొలి విడత కౌన్సెలింగ్‌కి అనుమతించింది. యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో 5,875 సీట్లు ఉన్నాయి. వీటిలో 840 సెల్ఫ్ ఫైనాన్సు సీట్లు. ప్రైవేటు కాలేజీల్లో 1,12,779 సీట్లు ఉన్నాయి.
తొలి విడత అనుమతించిన సీట్లలో అత్యధిక శాతం కంప్యూటర్ సైన్సు విభాగంలోనే ఉన్నాయి. తదుపరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయో లేదో యూనివర్సిటీలు తనిఖీ చేసి అఫిలియేషన్ మంజూరు చేయాల్సి ఉంది. యూనివర్సిటీలకు ఫీజులు బకాయి ఉండడంతో 37 కాలేజీలకు ప్రస్తుత కౌన్సెలింగ్‌కు అనుమతి లభించలేదు.
వీటికి కూడా అనుమతులు వస్తే సీట్ల సంఖ్య పెరుగుతుంది. కొన్ని ప్రైవేటు వర్సిటీల్లోని ఇంజనీరింగ్ సీట్లలో 35 శాతం కోటాను కన్వీనర్ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలివిడతలో ఎస్‌ఆర్‌ఎం, విట్–అమరావతి, సెంచురియన్ వర్సిటీలలోని సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాయి. అలాగే మోహన్‌బాబు వర్సిటీ, అపోలో వర్సిటీల సీట్లపై త్వరలో ఉత్తర్వులు వస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి.
వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు త్వరలో శ్రీకారం
ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 1,94,752 మంది హాజరు కాగా, 1,73,572 మంది అర్హత సాధించారు. ఇటీవల ఇంటర్మీడియెట్ అర్హత మార్కులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో వీరి సంఖ్య మరికొంత పెరుగుతోంది. వాస్తవానికి తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 6న సీట్లు కేటాయించవలసి ఉంది.
అయితే, ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించేందుకు వెబ్ ఆప్షన్లను వాయిదా వేసి, ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ను ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం కాలేజీలు, సీట్లు ఖరారు కావడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించి సవరించిన తేదీలను అడ్మిషన్ల కమిటీ త్వరలో ప్రకటించనుంది.
ప్రమాణాలు లేని కాలేజీలకు కోత
రాష్ట్రంలోని మొత్తం 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 1,50,837 సీట్లు ఉన్నాయి. ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఆ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, బోధన, సిబ్బంది ఉండడంతోపాటు నిర్ణీత ఫీజు లను పూర్తిగా చెల్లించారా.. లేదా.. అన్నది పరిశీలించిన తర్వాతే వాటికి యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇస్తాయి. అఫిలియేషన్ ఉన్న కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతిస్తుంది.
వీటిలో ఫీజులు చెల్లించకపోవడం, నిర్ణీత ప్రమాణాలు లేకపోవడంతో 203 కాలేజీలకు మాత్రమే తొలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం దక్కింది. మిగతా కాలేజీలకు కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు.
తొలి విడత కౌన్సెలింగ్‌కు 1.18 లక్షల సీట్లు
Published Fri, Sep 9 2022 4:55 AM | Last Updated on Fri, Sep 9 2022 2:51 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment