సాక్షి, అమరావతి: యువతకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు విస్తృతపరిచే దిశగా ఆంధ్రప్రదేశ్ వడివడిగా అడుగులు వేస్తోంది. లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఎన్ని డిగ్రీలున్నా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కష్టమే. ఇది గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగంలో కీలక సంస్కరణలు చేపట్టారు. పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. పేద పిల్లలకు పెద్ద చదువులు చదివే అవకాశం కల్పించారు. ఇదే తరుణంలో దేశ వ్యాప్తంగా విద్యా రంగంలో నూతన సంస్కరణలు మొదలయ్యాయి.
దేశంలో విద్యారంగం ముఖచిత్రం శరవేగంగా మారిపోతోంది. విద్యారంగ కార్యక్రమాల కోసం ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) ఇటీవల వెలువరించిన అధ్యయన నివేదిక ‘ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇండస్ట్రీ–ఇండియా’ దేశంలో చదువుల ముఖచిత్రం 2030 నాటికి కొత్త రూపు సంతరించుకోనుందని వెల్లడించింది. ఆన్‌లైన్ లెర్నింగ్ విభాగంలో వచ్చే 2 నుంచి నాలుగేళ్ల లో 38% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. కోవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్ బోధన బాట పట్టాయి. ప్రముఖ సంస్థలు సైతం ఆన్‌లైన్ ద్వారా కోర్సులను నేరుగా విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తున్నాయి. స్వయం, ఈ–పాఠశాల తదితరాల ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రొఫెషనల్, నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ, డిప్లొమో కోర్సులను విద్యార్థులకు అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రాష్ట్రంలో ఇప్పటికే విద్యా సంస్కరణలు మొదలైన సంగతి తెలిసిందే. నాడు – నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే మారిపోయింది. కనీస వసతులు కూడా లేని దుస్థితి నుంచి కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పించడంతో విద్యార్థుల చేరికలు పెద్ద ఎత్తున పెరిగాయి. అమ్మఒడి, విద్యా కానుక, పేద విద్యార్థులకు ఇంగ్లీషు మీడియం చదువులతో పాటు కరిక్యులమ్‌ను నేటి అవసరాలకు తగ్గట్లుగా ప్రభుత్వం తీర్చిదిద్దింది. బాలికా విద్యను ప్రోత్సహిస్తూ అండగా నిలుస్తోంది. ఉన్నత చదువులు అభ్యసించే వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ఫలితంగా చదువుల్లో నాణ్యత పెరిగింది. మరోవైపు యువతకు కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నైపుణ్యాలు పెరిగేలా శిక్షణ ఇస్తున్నారు.
మన ప్రతిభ విశ్వ వ్యాప్తం
రాష్ట్రాలవారీగా ఇప్పుడు ఉన్నత విద్యలో బాలబాలికలు, సామాజిక వర్గాల నిష్పత్తిలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఇది 5 శాతం కంటే తగ్గుతుందని సర్వే పేర్కొంది. ఉన్నత విద్యలో గరిష్ట చేరికల నిష్పత్తి 50కిపైగా చేరుకుంటుందని సర్వే అంచనా వేసింది. ప్రపంచంలో ప్రతిభావంతులైన ప్రతి నలుగురు గ్రాడ్యుయేట్లలో ఒకరు భారతీయ ఉన్నత విద్యావ్యవస్థ నుంచి వచ్చిన వారే ఉంటారని వివరించింది. విద్యారంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలపై 140 బిలియన్ డాలర్ల వ్యయంతో ప్రపంచంలో మొదటి ఐదు దేశాల సరసన భారత్ నిలుస్తుందని పేర్కొంది.
ఇక అంతర్జాతీయంగా టాప్ 200 యూనివర్సిటీల్లో 20కిపైగా భారతీయ విశ్వవిద్యాలయాలే ఉంటాయని తెలిపింది. ఈ–లెర్నింగ్, ఎం.లెర్నింగ్ (ఎలక్ట్రానిక్, మెషీన్ లెర్నింగ్) విద్యావిధానాలతో పాటు దూర విద్యా కార్యక్రమాలు కూడా పుంజుకోవడంతో దేశంలో ఉన్నత విద్యాధికులు పెరగనున్నారు. సంస్కరణలు, నిధుల వ్యయం కారణంగా దేశం నాలెడ్జ్ హబ్‌గా మారి విద్యా రంగంలో మౌలిక సదుపాయాలు విస్తృతం కానున్నాయని వివరించింది. ఐఐటీలు, ఐఐఎంల సంఖ్య పెంచడం, నాణ్యమైన పరిశోధనా కార్యక్రమాలకు నిధులు కేటాయించడం లాంటివి గణనీయమైన మార్పులు తెస్తాయని అంచనా వేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు
విద్యా రంగంలో విదేశీ పెట్టుబడులను వంద శాతం అనుమతించడం వల్ల 2025 నాటికి 750 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని సర్వే అంచనా వేసింది. 2000 నుంచి 2021 వరకు 6,154 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు దేశ విద్యా రంగంలోకి వచ్చినట్లు డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) ఇటీవల ప్రకటించింది. దేశంలో 39,931 కాలేజీలు, 981 యూనివర్సిటీలున్నాయి. ఇవి కాకుండా ఏఐసీటీఈ ఆమోదంతో 9,700 సాంకేతిక విద్యాసంస్థలు ఉన్నత విద్య అందిస్తున్నాయి. ఇందులో 4,100 యూజీ, 4,951 పీజీ, 4,514 డిప్లొమో కోర్సులు నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్కులో టాప్ పది సంస్థల్లో 7 ఐఐటీలు ఉండగా, క్యూఎస్ ఎంప్లాయిబులిటీ ర్యాంకింగ్‌లో టాప్ 500 యూనివర్సిటీలలో బెంగళూరు ఐఐఎస్‌సీ, ఆరు ఐఐటీలు చోటు దక్కించుకున్నాయి.
టాప్ 25 స్టార్టప్ కంపెనీల రాక
నైపుణ్యాభివృద్ధి కోసం ఎన్‌ఎస్‌డీసీ 14.4 మిలియన్ డాలర్ల వ్యయంతో 50 వేల మందికి శిక్షణ చేపట్టింది. అమెజాన్ సంస్థ లక్ష మందికి కంప్యూటర్ సైన్స్, మెషీన్ లెర్నింగ్ విద్యనందించేలా చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌గా బైజూస్ సంస్థ రూ.2,200 కోట్లతో విద్యా కార్యక్రమాలను విస్తరించింది. టాటా టెక్నాలజీస్ సంస్థ ఐటీఐలలో రూ.4,636 కోట్లతో సాంకేతిక పరి/ê్ఙనాన్ని సమకూర్చాలని నిర్ణయించింది. ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్న 25 టాప్ స్టార్టప్ కంపెనీలు దేశంలోకి అడుగిడబోతున్నాయి.
88 అకడమిక్స్, అకుడో, జాఫ్కో ఆసియా లాంటి టెక్ స్టార్టప్ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులతో రాబోతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్‌మెంట్ రూ.10 కోట్లతో నర్సింగ్ విద్యార్థినులకు స్కాలర్‌షిప్‌లు అందించాలని నిర్ణయించింది. గేట్‌వే టు గ్లోబల్ నర్సింగ్ ప్రోగ్రామ్’ కింద వీరు అంగీకారం తెలపాలి. బిట్స్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లండన్ బిజినెస్ స్కూలుతో భాగస్వామ్యం ద్వారా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. విరోహ హెల్త్ కెరీర్ ఎడ్‌టెక్ సంస్థ 3 మిలియన్ డాలర్లతో పారామెడిక్స్‌కు వొకేషనల్ శిక్షణ ఇవ్వనుంది.
ప్రభుత్వ కార్యక్రమాలు అనేకం
ప్రభుత్వ పరంగా చేపట్టిన విద్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఉన్నత విద్య కొత్త పుంతలు తొక్కనుందని నివేదిక వెల్లడించింది. బడ్జెట్‌లో విద్యకు నిధుల కేటాయింపు పెంచడాన్ని నివేదికలో ప్రస్తావించారు. కోవిడ్ నేపథ్యంలో డిజిటల్ బోధన పెంచేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందుకోసం నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ (ఎన్‌డీఈఏఆర్) ఏర్పాటు చేస్తున్నారు. 600 జిల్లాల్లో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద 300కిపైగా స్కిల్ కోర్సులకు ఏర్పాట్లు చేశారు. నీతి ఆయోగ్ ఇటీవల బైజూస్ సంస్థ సహకారంతో పాఠశాలల్లో క్వాలిటీ లెర్నింగ్‌కు శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొంది. నిష్టా కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం 5.6 మిలియన్ల టీచర్లకు శిక్షణ ఇచ్చింది. వీటన్నిటి ద్వారా 2030 నాటికి దేశంలో చదువుల ముఖచిత్రం సంపూర్ణంగా మారనుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) నివేదిక వెల్లడిస్తోంది.
నివేదికలో ఇతర అంశాలు
► దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో స్కూళ్లకు వెళ్లే 5–24 ఏళ్ల వయసు వారు అధికం. దేశంలో చదువుకునే వారు గతంతో పోలిస్తే 146 శాతం పెరిగారు.
ఆంగ్లంలో మాట్లాడే పరి/ê్ఙనం ఉన్న వారి సంఖ్య కూడా గణనీయమే. ఇంగ్లీషు ప్రొఫెషియన్సీ 2020 ఇండెక్స్ ప్రకారం వంద దేశాల్లో భారత్ 50 స్థానంలో ఉంది. దేశంలోని 12 ఉన్నత విద్యాసంస్థలు ప్రపంచవ్యాప్తంగా టాప్ 500లో ఉన్నాయి.
► 2025 నాటికి దేశంలో విద్యా సంబంధిత వ్యవహారాలు 225 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని అంచనా.
► ఏప్రిల్ 2000 నుంచి జూన్ 2021 వరకు దేశ విద్యా రంగంలోకి 6154.87 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
► దేశంలో 14 ఏళ్ల లోపు వయసు వారు 26.31 శాతం వరకు ఉన్నందున విద్యా వ్యవహారాలు విస్తృతం కానున్నాయి.
ఏపీలో ‘ఉన్నత’ నైపుణ్యాలు
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో కీలక సంస్కరణలు చేపట్టారు. బెంగళూరు ఐఐఎస్‌సీ ప్రొఫెసర్ బాలకృష్ణన్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని నియమించారు. కమిటీ సిఫార్సులతో పాటు ఇతర అంశాలనూ పరిగణలోకి తీసుకొని కాలేజీల్లో నిర్ణీత ప్రమాణాలు తప్పనిసరి చేశారు. లోపాలను సరిదిద్దుకునేందుకు కాలేజీలకు కొంత సమయం ఇచ్చి అప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అనుమతులు నిలిపివేశారు. కాలేజీలకు ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా పూర్తి ఫీజు రీయిబర్స్‌మెంట్ అమలు చేయడమే కాకుండా ప్రతి మూడునెలలకు ఒకసారి తప్పనిసరిగా విడుదల చేస్తున్నారు. సిలబస్, కరిక్యులమ్‌లో మార్పులు చేశారు. మూడేళ్లుగా ఉన్న డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల ఆనర్ కోర్సులుగా మార్పు చేశారు. తప్పనిసరిగా ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసి నైపుణ్యాలను, అనుభవాన్ని గడించేలా చేశారు. మూడేళ్ల డిగ్రీని పూర్తి చేసే వారికి కూడా 10 నెలల ఇంటర్న్‌షిప్, ప్రాజెక్టు వర్క్‌లతో నైపుణ్యాలకు పదును పెట్టారు.
పరిశ్రమలతో అనుసంధానం
విద్యార్థులు ఇంటర్న్ షిప్‌లను నిబద్ధతతో పూర్తిచేసేలా 27,119 పరిశ్రమలు, ఐటీ సంస్థలు, వాణిజ్య సంస్థలను కాలేజీలతో అనుసంధానించారు. కోర్సులతో సంబంధం లేకున్నా విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌కు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎల్‌ఎంఎస్) ఏర్పాటైంది. ఇందులో మైక్రో నుంచి మెగా స్థాయి వరకు మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీస్ విభాగాల కంపెనీలున్నాయి. నైపుణ్యాలను అనుసరించి ఆయా కంపెనీల్లోనే ఉద్యోగాలు దక్కనున్నాయి.
1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ
యువతకు నేటి అవసరాలకు తగ్గట్లుగా సాఫ్ట్ స్కిల్స్ అందించేందుకు రూ.30 కోట్లతో మైక్రోసాఫ్ట్ సంస్థ ద్వారా శిక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో రూ.వేలల్లో ఫీజులు వసూలు చేసే స్కిల్ కోర్సులను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రాష్ట్ర విద్యార్ధులకు మైక్రోసాప్ట్ సంస్థ ద్వారా సమకూరుస్తోంది. 1.62 లక్షల మందికి 42 రకాల స్కిల్ సర్టిఫికేషన్ కోర్సులను అందచేస్తోంది. విద్యార్ధులలో సామాజిక అవగాహన పెంచడంతో పాటు ప్రజల అవసరాలు గుర్తించేలా క్షేత్రస్థాయి అధ్యయనానికి ప్రాజెక్టులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా క్రెడిట్లు అందిస్తున్నారు.
విశాఖలో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు విశాఖపట్నంలో ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకర్గంలో ఒక స్కిల్ కాలేజీని కూడా అందుబాటులోకి తెస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది మంది విద్యార్ధుల నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు.
కొత్త విద్యకు నాంది
Published Mon, Jan 17 2022 3:04 AM | Last Updated on Mon, Jan 17 2022 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment