సాక్షి, అమరావతి: సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా నిర్వహించాలి. మొక్కుబడిగా కాకుండా ఎంత బాగా నెరవేరుస్తున్నారో చెప్పేందుకు సామాజిక రంగంపై వెచ్చించే వ్యయమే కొలమానం. సామాజిక రంగంపై వ్యయంలో దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం ప్రభుత్వ దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తోంది.
2022 –23 ఆర్థిక ఏడాదికి సంబంధించి జనవరి వరకు రాష్ట్రాల వారీగా సామాజిక రంగంలో వ్యయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలను రూపొందించింది. వాస్తవ వ్యయాలను కాగ్ ప్రతి నెలా గణాంకాల రూపంలో పొందుపరుస్తుంది. విద్య, వైద్యం, పట్టణ, గ్రామీణాభివృద్ధి, పౌష్టికాహారం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణకు చేసే ఖర్చును సామాజిక రంగాలపై వ్యయంగా పరిగణిస్తారు. ఆ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి వరకు సామాజిక రంగంపై రూ.82,229.70 కోట్లను ఏపీ ప్రభుత్వం వ్యయం చేసింది.
► ప్రజారోగ్యం, విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచడంతోపాటు రికార్డు స్థాయిలో వైద్య పోస్టులను భర్తీ చేసి ప్రజలకు మెరుగైన చికిత్సను అందిస్తున్న విషయం తెలిసిందే.
కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ప్రస్తుతం ఉన్న కాలేజీలు, ఆస్పత్రుల రూపు రేఖలు మార్చేందుకు రూ.16,222.85 కోట్లను వెచ్చిస్తోంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఖరీదైన చికిత్సలు ఉచితంగా అందించడంతోపాటు కొత్త వాహనాలను సమకూర్చడం ద్వారా 108, 104 వ్యవస్థను బలోపేతం చేసింది.
► ప్రాథమిక విద్యతో పాటు సెకండరీ, ఉన్నత విద్యకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. మన బడి నాడు–నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను మార్చేసి ఇంగ్లిష్ మీడియంలో చక్కగా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 11 రకాల వసతుల కల్పనకు రూ.16,450 కోట్లను వ్యయం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే తొలిదశ కింద 15,715 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పనను పూర్తి చేయడమే కాకుండా రెండో దశలో మరో 22,344 స్కూళ్లలో పనులను చేపట్టింది. మరోపక్క పిల్లలకు జగనన్న గోరుముద్ద కింద పౌష్టికాహారం అందిస్తున్న విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజనానికి గత టీడీపీ హయాంలో బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయిస్తే ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1908 కోట్లు వ్యయం చేస్తోంది.
గర్భిణులు, పిల్లలకు అంగన్ వాడీల్లో పౌష్టికాహారం సరఫరాకు ప్రాధాన్యం ఇస్తూ వ్యయాన్ని భారీగా పెంచింది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అమలు చేస్తోంది. పట్టణాలు, గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు సురక్షిత మంచినీటి సరఫరాకు పెద్ద ఎత్తున వ్యయం చేస్తోంది. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తోంది.
► వేతన సవరణను అమలు చేయడంతో పాటు అవసరమైన రంగాల్లో కొత్త పోస్టులను భర్తీ చేయడంతో ఉద్యోగుల జీతాల వ్యయం భారీగా పెరిగింది. గత ఆర్థిక ఏడాదిలో జనవరి వరకు ఉద్యోగుల వేతనాల రూపంలో రూ.34,593 కోట్లు చెల్లించగా ప్రస్తుత ఆర్థిక ఏడాది జనవరి వరకు రూ.41,270 కోట్లు వ్యయం చేసినట్లు కాగ్ గణాంకాలు వెల్లడించాయి.
సామాజిక రంగంపై వ్యయం.. అభివృద్ధికి సంకేతం
Published Sun, Mar 19 2023 2:08 AM | Last Updated on Sun, Mar 19 2023 7:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment