సాక్షి, అమరావతి: ప్రభుత్వాలు సామాజిక దృక్పథంతో బాధ్యతగా వ్యవహరించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది! విద్య, వైద్యం, బడుగు–బలహీన వర్గాల సంక్షేమం కోసం వెచ్చించే వ్యయం ఈ కోవలోకే వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి పెద్దపీట వేస్తుంటే ఈనాడు రామోజీకి రుచించడం లేదు! కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లోనే ఈ వివరాలన్నీ ఉన్నా ఆ డబ్బంతా ఏమైందోనంటూ యథాప్రకారం మరో తప్పుడు కథనాన్ని భుజానికెత్తుకున్నారు!! అనుబంధ సంస్థల్లోకి మళ్లించేందుకు ప్రభుత్వమేమీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ కాదు కదా! కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ రంగానికి ఎంత వ్యయం చేసిందో స్పష్టంగా పేర్కొంది.
రైతులు, అక్క చెల్లెమ్మలు, విద్యార్ధులు, పెద్దలు, వితంతువులు, పౌష్టికాహార లోపం కలిగిన చిన్నారులు, బాలింతలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల ఖాతాల్లోకి రూ.రెండు లక్షల కోట్లకుపైగా ప్రభుత్వం జమ చేసినట్లు తెలుస్తున్నా కబోదుల్లా నటించే వారిని ఏమనుకోవాలి? కాగ్ ప్రొవిజనల్ గణాంకాల ప్రకారం ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో మూలధన వ్యయం రూ.7,581.58 కోట్లు కాగా రామోజీ మాత్రం రూ.6,916 కోట్లు అంటూ సొంత లెక్కలు చెప్పారు మరి!
సామాజిక వ్యయంలో సరితూగగలవా?
ఏ ప్రభుత్వానికైనా కొన్ని ప్రాధాన్యతలుంటాయి. వాటి మేరకు వ్యయం చేస్తాయి. మూలధన వ్యయానికి కూడా ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తాయి. అయితే ప్రభుత్వాలు తప్పసరిగా నెరవేర్చాల్సిన సామాజిక బాధ్యతలూ ఉంటాయి. వాటికి ఎక్కువ నిధులు అవసరమైనప్పుడు మూలధన వ్యయం తగ్గుతుందని, ఇందులో కొంపలు కొల్లేరయిపోయే ప్రమాదం ఏమీ లేదని ఆర్ధిక శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
17 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల అభివృద్ధి, స్కూళ్లు బాగు చేయడం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చిస్తున్న డబ్బు పెట్టుబడి వ్యయం కాదా? రాష్ట్ర ప్రభుత్వం సామాజిక రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో గత నాలుగేళ్లుగా ఆ వ్యయం పెరుగుతోంది. మిగతా రాష్ట్రాలేవీ సామాజిక రంగంపై మన రాష్ట్రం చేస్తున్నంత వ్యయం చేయడం లేదని ఆర్థిక శాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటప్పుడు మూలధన వ్యయంలో వెనుకబడ్డామంటూ ఈశాన్య రాష్ట్రాలతో మనకు పోలిక ఎందుకు?
► 2022–23కి సంబంధించి కాగ్ ప్రొవిజనల్ గణాంకాలను మాత్రమే వెల్లడించింది. సాధారణ, సామాజిక, ఆర్థిక రంగాల వారీగా ప్రభుత్వ వ్యయం ఉంటుంది. జీతాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లు, సబ్సిడీ కోసం చేసిన ఖర్చులుంటాయి. సమాచారాన్ని దాచి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమాత్రం లేదు.
► మూలధన వ్యయం తక్కువగా ఉందని, రాష్ట్రం పరిస్థితి అధ్వానంగా ఉందన్న రామోజీ రాతల్లో నిజం లేదు. ప్రభుత్వాలు తమ ప్రాథమిక బాధ్యతలో భాగంగా కొన్నింటికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వాటిని రెవెన్యూ వ్యయం కింద పరిగణిస్తారు. ఆరోగ్యం, విద్యలో అసమానతలు రూపుమాపడం, గ్రామీణ – పట్టణ అసమాన తలను తగ్గించడం తదితర లక్ష్యాల సాధనకు సహజంగానే అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ రెవెన్యూ వ్యయంగా వర్గీకరించడం వల్ల మూలధన వ్యయం తగ్గినట్లు కనిపిస్తుంది. నిజానికి మానవ వనరుల అభివృద్ధి, సామాజిక ఆస్తుల కల్పనకు ఈ వ్యయం ఎంతో అవసరం.
► గత సర్కారు 2014–19 మధ్య కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు పేదల అభ్యున్నతిని విస్మరించింది. వాటిని మెరుగుపరిచేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక విద్యలో స్థూల నమోదు (జీఈఆర్) జాతీయ సగటు 99 కాగా మన రాష్ట్రంలో దేశంలోనే అతి తక్కువగా 84.48 ఉంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ సంస్కరణల కోసం నాలుగేళ్లలో దాదాపు రూ.67 వేల కోట్లను వెచ్చించి చదువులను గాడిన పెట్టింది.
నాడు–నేడుతో సర్కారు స్కూళ్లను కార్పొరేట్‌కు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దింది. నిజానికి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్లే ప్రభుత్వ విద్యాసంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితికి వచ్చాయి. అమ్మ ఒడి నుంచి విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక, విదేశీ విద్యా దీవెన.. ఇలా ఎన్నో పథకాలను తీసుకొచ్చి పిల్లలు చదువుకునేలా ప్రభుత్వం అండగా నిలిచింది. ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ విధానంతోపాటు నాణ్యమైన విద్య అందించేలా బైజూస్ కంటెంట్‌ను సమకూర్చింది.
డిజిటల్ తరగతి గదులను ఆరు, ఆపై తరగతుల నుంచి అందుబాటులోకి తెచ్చింది. ఇలాంటి చర్యల వల్ల ప్రాథమిక విద్యలో జీఈఆర్ 2021–22లో జాతీయ స్థాయిని మించి ఏపీలో 100.7కు పెరిగింది. ఇది రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు దోహదం చేస్తుంది. ఇది రెవెన్యూ వ్యయం కిందకు వస్తుంది. మరి ఈ వ్యయాన్ని వృథా అని రామోజీ గగ్గోలు పెడుతుంటే ఏం చెప్పాలి?
► మూలధన వ్యయం చూసినా గతంలో కంటే ఇప్పుడే మెరుగ్గా ఉంది. టీడీపీ హయాంలో సగటున ఏడాదికి రూ.15,277.80 కోట్లు మూలధన వ్యయం కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సగటున ఏడాదికి రూ.16,095.90 కోట్లు మూలధన వ్యయం కింద వెచ్చించింది. రూ.15,000 కోట్లతో ఒకేసారి నాలుగు కొత్త పోర్టుల నిర్మాణాన్ని చేపడుతోంది. ఇది మూలధన వ్యయం కిందకే వస్తుంది. ‘ఎస్‌పీవీ’ ద్వారా చేపడుతున్నందున దీన్ని మూలధన వ్యయంగా గుర్తించకున్నా ఇది కచ్చితంగా ఆస్తుల కల్పన వ్యయమే.
► రాష్ట్రంలో 20 – 59 ఏళ్ల వయసున్న వారు ఉపాధి కోసం వలస వెళ్తున్నట్లు ఈనాడు అవాస్తవాలు ప్రచురించింది. రాష్ట్రంలో ఆ వయసు వారు 2014తో పోల్చితే పెరిగారే కానీ తగ్గలేదు. 0 – 14 ఏళ్ల లోపు జనాభా ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశమంతా తగ్గుతోంది. జననాలు తక్కువ ఉన్నప్పుడు యువత ఎలా వస్తారు? వలసలు ఎలా పెరిగాయో రామోజీకే తెలియాలి.
► ఐరాస నిర్దేశించిన సుస్థిర లక్ష్యాల సాధనకు సామాజిక రంగంపై వ్యయం పెరుగుదల సముచితమేనని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే కూడా చెబుతోంది. సామాజిక రంగంపై వ్యయం పెంచాలని రాష్ట్రాలకు సూచిస్తోంది. సామాజిక రంగంపై వెచ్చించే వ్యయం వ్యక్తులు, సమాజ అభివృద్ధికి దోహదం చేస్తుందని పేర్కొంది.
► పాఠశాలలు, ఆస్పత్రులు నిర్మించాలంటూ రిటైర్డ్ అధికారి పీవీ రమేష్ సూచించినట్లు ఈనాడు తన కథనంలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది కూడా అదే కదా?
సామాజిక రంగాలు అంటే?
విద్య, వైద్యం, కుటుంబ సంక్షేమం, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం, కార్మిక సంక్షేమం, పౌష్టికాహారం, విపత్తుల సహాయం తదితరాలు ఇందులోకి వస్తాయి.
సాధారణ రంగాలు..
జీతభత్యాలు, పెన్షన్లు, వడ్డీలు, అప్పులు, చెల్లింపులు, పరిపాలన, నిర్వహణకు వ్యయం తదితరాలు.
ఆర్థిక రంగాలు..
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఇరిగేషన్, విద్యుత్, పరిశ్రమలు, రవాణా వ్యయం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ రంగాలు.
అప్పులపై తప్పుడు రాతలు..
గత ఆర్థిక సంవత్సరంలో రూ.51,453.22 కోట్లు అప్పులు చేసినట్లు కాగ్ ప్రొవిజనల్ గణాంకాల్లో పేర్కొంది. ఈనాడు రామోజీ మాత్రం బడ్జెట్, బడ్జెట్ బయట రూ.90 వేల కోట్లు అప్పు చేసినట్లు పచ్చి అవాస్తవాలను ప్రచురించారు. అప్పులు ఎంత చేశారో కాగ్ నిర్థారిస్తుంది కానీ రామోజీ ఊహాగానాలు కాదు!
Comments
Please login to add a commentAdd a comment