మాట్లాడుతున్న మంత్రి పెద్దిరెడ్డి్డ, చిత్రంలో మంత్రులు బొత్స, కారుమూరి, సీదిరి
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రంగ బలోపేతం కోసమే ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) చట్టాన్ని ప్రభుత్వం తెచ్చింది. ఆక్వా రంగ కార్యకలాపాలన్నీ ఈ చట్టం పరిధిలోకే వస్తాయి. రొయ్యల ధరలు తగ్గించినా.. ఫీడ్ ధరలు పెంచినా అప్సడా చట్టం ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’ అని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారిత కమిటీ బుధవారం విజయవాడలో సమావేశమైంది.
తొలుత కమిటీ సభ్యుడైన అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ ఆక్వా రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తెచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌ను సాకుగా చూపి ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు, దళారులు ఇష్టానుసారంగా రొయ్యల కౌంట్ ధరలను తగ్గించేస్తున్నారన్నారు. మూడు నెలల క్రితం రూ.90 వేల నుంచి రూ.97 వేలున్న టన్ను సోయాబీన్ ప్రస్తుతం రూ.45 వేల–రూ.55 వేల మధ్య ఉందని చెప్పారు.
అలాగే గత ఆర్నెళ్లుగా ఫిష్ ఆయిల్, వీట్ ధరలు భారీగా తగ్గినప్పటికీ కంపెనీలు ఫీడ్ రేట్లును ఇష్టానుసారంగా పెంచేస్తున్నాయని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై చర్చించాక ఫీడ్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకుందామని గతంలో అంగీకరించినదానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయన్నారు.
రైతుకు అన్యాయం జరిగితే ఊరుకోం..
మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స మాట్లాడుతూ.. రొయ్యల కౌంట్ ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఫీడ్ ధరలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కొనుగోలుదారులు, తయారీదారులపై ఉందన్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం అండగా ఉందని, వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇష్టానుసారంగా ధరలు పెంచడం, తగ్గించడం చేస్తే చర్యలు తప్పవన్నారు.
రైతులతోపాటు ఫీడ్ తయారీదారులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో గురువారం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో ఫీడ్ ధరల నియంత్రణ, కౌంట్ ధరల పెంపుపై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నివేదిక రూపొందించాలని సూచించారు. ఈ నివేదికను కమిటీకి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతోపాటు కమిటీ సభ్యులైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇంధన, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment