ఫలితాలు విడుదల చేస్తున్న మంత్రి మేకపాటి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల ఉమ్మడి ప్రవేశపరీక్ష (పాలిసెట్)–2021లో రికార్డుస్థాయి ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 68, 137 మంది పరీక్షలు రాయగా 64,187 మంది (94.20 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధిశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలిసెట్–2021 ఫలితాలను ఆయ న విడుదల చేశారు. 120 మార్కులతో విశాఖకు చెందిన కల్లూరి రోషన్‌లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొమ్మరాపు వివేక్‌వర్థన్ మొదటి ర్యాంకు సాధించారు. 119 మార్కులతో 9 మందికి రెండో ర్యాంకు లభించింది. శ్రీకాకుళం జిల్లా 95.52 శాతం ఉత్తీర్ణతతో ముందంజలో నిలిచింది. బాలికల ఉత్తీర్ణత శాతం నెల్లూరు జిల్లాలో, బాలుర ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఉంది.
ఈ ఏడాది కొత్తగా 5 కోర్సులు
ఫలితాలు విడుదల చేసిన అనంతరం మంత్రి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మిడ్‌లెవెల్ ఉద్యోగాలకు బాగా డిమాండ్ ఉందని, పాలిటెక్నిక్ పూర్తికాగానే ఉపాధి లభించే విధంగా కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి ఐటీ, రోబోటిక్స్, కోడింగ్ వంటి 5 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. వారంలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇందుకు అవసరమైతే ప్రైవేటు కాలేజీలను ప్రభుత్వ కాలేజీలుగా మార్చి మౌలిక వసతులు పెంచే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. గతేడాది పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు 81 వేలమందికి జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.128 కోట్లు, వసతిదీవెన ద్వారా రూ.54 కోట్లు అందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంకేతికవిద్య కమిషనర్ పోలా భాస్కర్, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారురాజు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల విద్యార్థికి పాలిసెట్ ఫస్ట్ ర్యాంక్
పాలిసెట్‌లో మొదటి ర్యాంకు సాధించిన విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఏపీ గురుకుల పాఠశాల పదోతరగతి విద్యార్థి కల్లూరి రోషన్‌లాల్‌ను ఏపీ గురుకుల విద్యాలయాలసంస్థ కార్యదర్శి కల్నల్ వి.రాములు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment