సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత వ్యవహారం కీలక మలుపు తిరిగింది. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించిన యజమానులు చివరకు వాస్తవాన్ని హైకోర్టుకు నివేదించారు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఇళ్ల యజమానుల తరఫు న్యాయవాది హైకోర్టు ముందు అంగీకరించారు. దీంతో వారిపై హైకోర్టు మండిపడింది.
షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ, ఇవ్వలేదంటూ కోర్టుకొచ్చి, కూల్చివేతలపై స్టే పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించింది. పిటిషనర్లు స్వయంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతేకాక కూల్చివేతల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హారీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రోడ్డును ఆక్రమించుకున్న ఇప్పటంలోని ఇళ్ల యజమానులకు మే 21న నోటీసులు జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని వివరించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ తిల్హారీ కూల్చివేత నోటీసుల ఆధారంగా పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఈ వ్యాజ్యం మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు మలసాని మనోహర్‌రెడ్డి, జి.నరేష్ కుమార్‌లు వాదనలు వినిపించారు. పిటిషనర్లకు కొందరికి పోస్టు ద్వారా, మరికొందరికి వ్యక్తిగతంగా గతంలోనే నోటీసులు అందజేశామని చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఆధారాలన్నింటినీ అఫిడవిట్ రూపంలో కోర్టు ముందుంచారు. దీనిపై ఏమంటారని పిటిషనర్ల తరఫు న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో పిటిషనర్లు వాస్తవాన్ని అంగీకరించక తప్పలేదు. అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారంటూ పిటిషనర్ల న్యాయవాది టి.సాయిసూర్య అంగీకరించారు. ఆ విషయాన్ని పిటిషన్‌లో ఎందుకు ప్రస్తావించలేదని న్యాయమూర్తి నిలదీశారు.
ఉదయం కూల్చివేతలు మొదలుపెట్టడం, దానిపై హడావుడిగా లంచ్‌మోషన్ పిటిషన్ వేయడం, పిటిషనర్లు నిరక్షరాస్యులు కావడం తదితర కారణాలతో షోకాజ్ నోటీసుల విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించలేదని సాయిసూర్య చెప్పారు. ఈ వివరణతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టారని చెప్పడంవల్లే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని గుర్తు చేశారు. కోర్టు ముందు వాస్తవాలను తొక్కిపెట్టినందుకు క్రిమినల్ కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని పిటిషనర్లను ఆదేశించారు. పిటిషనర్లు కోర్టు ముందు హాజరయ్యేలా చూడాలని వారి తరఫు న్యాయవాదికి స్పష్టం చేశారు.
‘ఇప్పటం’ పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం
Published Wed, Nov 23 2022 4:37 AM | Last Updated on Wed, Nov 23 2022 4:37 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment