సాక్షి, అమరావతి: ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పటికే ఒకసారి తలంటిన హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. రుణం పొందకుండా ప్రభుత్వ యత్నాలను అడ్డుకోవాలన్న రఘురామకృష్ణరాజు అభ్యర్థనను తోసిపుచ్చింది.
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ నిలదీసింది. అసలు ఈ వ్యాజ్యం నిరర్థకమైందని, ఈ వ్యాజ్యాన్ని తామెందుకు విచారించాలని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని రఘురామకృష్ణరాజును ఉద్దేశించి.. ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందని మండిపడింది.
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని పునరుద్ఘాటించింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో చూసేందుకు తామేమీ కంపెనీ సెక్రటరీలం కాదని, హైకోర్టు జడ్జీలమని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులుగా తామేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పిందని, దాని ప్రకారమే నడుచుకుంటామని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలను తాము నడపడం లేదని, ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదని పేర్కొంది.
ఈ వ్యాజ్యంలో ప్రభుత్వం నుంచి కనీస వివరణ కూడా కోరబోమని స్పష్టం చేసిన ధర్మాసనం దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాము జారీ చేయబోయే ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని ధర్మాసనం ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజుకు తేల్చి చెప్పింది.
చట్ట సవరణలపై పిల్...
ఏపీ (విదేశీ మద్యం, దేశీయ తయారీ విదేశీ మద్యం వ్యాపార నియంత్రణ) చట్టానికి సవరణలు చేస్తూ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన రెండు చట్టాలను సవాలు చేస్తూ రఘురామకష్ణరాజు హైకోర్టులో పిల్ దాఖలు చేయడం తెలిసిందే. కొత్త సవరణ చట్టాల ద్వారా సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఆదాయంగా చూపి రుణాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని, స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎలాంటి రుణం పొందకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గత వారం విచారణ జరిపిన సీజే ధర్మాసనం తాజాగా మరోసారి విచారించింది.
రుణాలపై మీరెలా నిర్దేశిస్తారు..?
పిటిషనర్ తరఫు న్యాయవాది అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఆదాయంగా చూపుతూ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతోందన్నారు. స్పెషల్ మార్జిన్ మనీని తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటుందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను మీరెలా శాసిస్తారంటూ రఘురామకృష్ణరాజును ప్రశ్నించింది. ప్రభుత్వం రుణాలు ఎలా తీసుకోవాలో మీరు నిర్దేశిస్తారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది.
ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు అసలు మీరెవరంటూ నిలదీసింది. తన ఆర్థిక వ్యవహారాలను ఎలా చక్కబెట్టుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో సుధాకరరావు స్పందిస్తూ రాష్ట్ర సంచిత నిధికి చెందిన మొత్తాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా వాడేస్తోందని, ఈ నిధిపై ఆర్బీఐకి మాత్రమే నియంత్రణ ఉంటుందని చెప్పారు. సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలను ఏపీ బెవరేజ్ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
సంక్షేమ కార్యక్రమాలు వద్దంటారా?
దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయవద్దంటారా? అంటూ ప్రశ్నించింది. పేదలు, సామాన్యులకు రాజ్యాంగం అర్థం కాదని, వారికి కావాల్సింది సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం మాత్రమేనని ధర్మాసనం తెలిపింది. అసలు పిటిషనర్ ఎవరంటూ ధర్మాసనం ఆరా తీసింది. పిటిషనర్ ఎంపీ అంటూ సుధాకరరావు వాదనలు కొనసాగించారు.
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు జారీ చేసి ప్రభుత్వం పెద్ద మొత్తంలో రుణం పొందిందని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలతో పిటిషనర్‌కు ఏం పని? అని ప్రశ్నించింది. దీనిపై సుధాకరరావు స్పందిస్తూ సంచిత నిధికి వెళ్లాల్సిన మొత్తాలో కాదో కావాలంటే ప్రభుత్వాన్నే అడగాలన్నారు. దీంతో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
మేమెందుకు ప్రభుత్వాన్ని వివరణ కోరాలి..?
ప్రభుత్వాన్ని ఏం ఎందుకు వివరణ అడగాలి? మేం ఎలాంటి వివరణ అడిగేది లేదు. ప్రభుత్వం నుంచి అఫిడవిట్ కూడా కోరం. ఇదో నిరర్థక వ్యాజ్యం. ఇందులో ఎలాంటి ప్రజా ప్రయోజనాలు లేవు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యంలో మేం ఉత్తర్వులు జారీ చేస్తాం. కావాలంటే మేం ఇచ్చే ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకెళ్లొచ్చు.
ఆర్థిక సంస్థలు సంతృప్తి చెందితేనే రుణం ఇస్తాయి. లేకుంటే లేదు. ఆర్థిక సంస్థలకు లేని ఇబ్బంది మీకెందుకు? మీరు, నేను ఓ ఆర్థిక సంస్థ వద్దకు అప్పు కోసం వెళితే ముందుగా మనకు అప్పు చెల్లించే స్థోమత ఉందా? లేదా? అనేది చూస్తారు. దాన్ని బట్టి రుణం ఇస్తారు. ఇది పూర్తిగా అప్పు ఇచ్చే వ్యక్తి, తీసుకునే వ్యక్తికి సంబంధించిన వ్యవహారం.
ఇందులో మూడో వ్యక్తి జోక్యానికి ఆస్కారం ఎక్కడుంది? రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు (ఈ సందర్భంగా ధర్మాసనం రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌లోని ఓ పేరాను చదివి వినిపించింది). ప్రభుత్వాన్ని తన వ్యవహారాలను తాను చక్కబెట్టుకోనివ్వండి. ప్రభుత్వాలను మేం నడపడం లేదు. మేమేం చేయాలో రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది.
మీ తీరు చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లను కూడా సవాలు చేసేలా ఉన్నారు. ప్రభుత్వం రుణాలు తీసుకుంటే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎవరు దాఖలు చేస్తారో మీకు తెలుసు కదా. అణగారిన వర్గాలు, కోర్టుకు రాలేని స్థితిలో ఉన్న వ్యక్తులు పిల్ వేయాలి. మరి మీరెందుకు ఈ వ్యాజ్యం వేశారు? సంక్షేమ పథకాలను ఆపేందుకు ఈ వ్యాజ్యం దాఖలు చేసినట్లుగా ఉంది.
ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు చాలా చేస్తున్నాయి. ప్రతీ దాంట్లోనూ జోక్యం చేసుకోవడం కోర్టుల పని కాదు. ఈ వ్యాజ్యాన్ని అసలు మేమెందుకు విచారించాలి? ఈ వ్యాజ్యంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం’ అంటూ ధర్మాసనం రఘురామకృష్ణరాజును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో సుధాకరరావు జోక్యం చేసుకుంటూ ఏదో చెప్పబోగా.. ‘మేమేం కంపెనీ సెక్రటరీలం కాదు. హైకోర్టు జడ్జీలం. మీకు మరోసారి చెబుతున్నాం మేం ప్రభుత్వాలను నడపడం లేదు’ అని ధర్మాసనం తేల్చి చెప్పింది.
శాసించేందుకు మీరెవరు?
‘‘తన ఆర్థిక వ్యవహారాలు ఎలా నిర్వహించుకోవాలో ప్రభుత్వానికి బాగా తెలుసు. సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం రుణాలు తెస్తే ప్రజలు ఎలా ప్రభావితం అవుతారు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరు? ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు ఎలా సాగాలో మీరెలా చెబుతారు? ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేందుకే మీరు ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినట్లుంది.
ప్రభుత్వానికి రుణం ఇచ్చే వారికి లేని ఇబ్బంది మీకెందుకు? ఈ వ్యవహారంలో మేం ప్రభుత్వం నుంచి వివరణ కూడా కోరబోం. ఈ వ్యాజ్యంలో మేం తగిన ఉత్తర్వులు వెలువరిస్తాం. ఆ ఉత్తర్వులపై మీరు కావాలనుకుంటే సుప్రీంకోర్టు కూడా వెళ్లొచ్చు’’
– ఎంపీ రఘురామకృష్ణరాజునుద్దేశించి హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment