సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సేవ నిమిత్తం 14 ఏళ్ల క్రితమే ఆర్జిత సేవల టికెట్లు బుక్ చేసుకుని, కోవిడ్ వల్ల ఆ సేవలు పొందలేకపోయిన భక్తులకు మరో అవకాశం కల్పించకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఉభయ పక్షాలకు అనువైన తేదీన భక్తులు ఎంచుకున్న ఆర్జిత సేవల భాగ్యాన్ని కల్పించాలని, ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని టీటీడీని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. విశాఖపట్నానికి చెందిన ఆర్.ప్రభాకరరావు శ్రీవారి ‘మేల్‌చాట్’ వస్త్రం సేవకు 2007లో టికెట్ బుక్ చేసుకున్నారు. ఆయనకు 2021 డిసెంబరు 17న ఈ సేవ పొందే అవకాశం దక్కింది. అయితే కోవిడ్ వల్ల ఈ సేవను టీటీడీ రద్దు చేసింది. దీని స్థానంలో బ్రేక్ దర్శనం కల్పిస్తామని లేదా డబ్బు వాపసు ఇస్తామని తెలిపింది.
మరికొందరు భక్తులు కూడా పూరాభిషేకం, వస్త్రాలంకరణ తదితర సేవలకు టికెట్లు బుక్ చేసుకోగా, టీటీడీ వాటిని కోవిడ్ కారణంగా రద్దు చేసింది. దీంతో వారంతా హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సీహెచ్ ధనుంజయ్, ఎం.విద్యాసాగర్ తదితరులు వాదనలు వినిపించగా, టీటీడీ తరపున న్యాయవాది ఎ.సుమంత్ వాదనలు వినిపించారు.
ఈ వ్యాజ్యాలన్నింటిపై ఉమ్మడిగా విచారణ జరిపిన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు తీర్పు వెలువరించారు. పిటిషనర్ల ఆర్జిత సేవల రద్దుకు టీటీడీ చెబుతున్న కారణాల్లో నిజాయితీ, సదుద్దేశం కనిపించడం లేదని న్యాయమూర్తి ఆ తీర్పులో పేర్కొన్నారు. గతంలో బుక్ చేసుకున్న టికెట్లను రద్దు చేసి వారికి ఆర్జిత సేవల అవకాశాన్ని తిరస్కరించిన టీటీడీ, మరోవైపు కొత్తగా భక్తులకు ఆర్జిత సేవా టికెట్లను విక్రయిస్తోందని, ఇది పిటిషనర్ల చట్టబద్ధమైన నిరీక్షణ హక్కును హరించడమే అవుతుందని తెలిపారు. పిటిషనర్ల ఆర్జిత సేవల టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు.
వారిని ఆర్జిత సేవలకు అనుమతించండి
Published Sun, Sep 25 2022 6:06 AM | Last Updated on Sun, Sep 25 2022 7:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment