సాక్షి, అమరావతి: కర్నూలులో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటు తమ ముందున్న వ్యాజ్యాల్లో ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సీఆర్‌డీఏ కమిషనర్, లోకాయుక్త చైర్మన్, హెచ్‌ఆర్‌సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది.
పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ముఖ్యమంత్రి, మంత్రులకు నోటీసులు ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. అమరావతి జేఏసీ నాయకురాలు మద్దిపాటి శైలజ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయగా.. సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది.
కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైంది
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. కర్నూలులో లోకాయుక్త ఏర్పాటైందన్నారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ అయిందని చెప్పారు. హెచ్‌ఆర్‌సీ సైతం బుధవారం నుంచి కార్యకలాపాలను ప్రారంభించనుందని తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఈ సంస్థల విభజన పూర్తి కాలేదని, 2017లో హెచ్‌ఆర్‌సీని అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారని వివరించారు. అయితే అది ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే కొనసాగిందని, అప్పుడు పిటిషనర్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మన రాష్ట్ర భూభాగంపై హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త ఏర్పాటు చేస్తుంటే అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు.
సీఎం, మంత్రులను ఎలా ప్రతివాదులుగా చేరుస్తారు..?
ఈ వ్యాజ్యంలో ముఖ్యమంత్రి, మంత్రులందరినీ ప్రతివాదులగా చేర్చడంపై ఏజీ అభ్యంతరం తెలిపారు. 2020 నుంచి ఇదో ట్రెండ్‌గా మారిపోయిందని, ఏ పిటిషన్ వేసినా అందులో ముఖ్యమంత్రినో, మంత్రులనో ప్రతివాదులుగా చేరుస్తున్నారని, ఇలాంటి వాటికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు ప్రతివాదులుగా చేర్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబును ప్రశ్నించింది. మంత్రి మండలి నిర్ణయం కాబట్టి, అందరినీ చేర్చారని చెప్పగా.. పాలన వికేంద్రీకరణ చట్టాన్ని శాసన సభ చేసింది కాబట్టి మొత్తం సభ్యులందరినీ ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారా? అని ప్రశ్నించింది.
కేసుకు ఏది అవసరమో అదే చేయాలంది. ఏజీ తన వాదనలను కొనసాగిస్తూ.. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలను కర్నూలులో ఏర్పాటు చేయడానికి ప్రత్యేక కారణాలున్నాయన్నారు. పాలన వికేంద్రీకరణ చట్టానికీ కర్నూలులో ఏర్పాటు చేయడానికి సంబంధం లేదన్నారు. కర్నూలు ప్రధాన కేంద్రంగా ఉంటుందని, ఈ రెండు సంస్థలు రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లయినా కూడా ఫిర్యాదులు స్వీకరించవచ్చని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కర్నూలులో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాలయాల ఏర్పాటు అంశం తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
హెచ్‌ఆర్‌సీ ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ
Published Wed, Sep 1 2021 4:24 AM | Last Updated on Wed, Sep 1 2021 4:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment