సాక్షి, అమరావతి: కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిలబస్‌ని పూర్తిగా మార్చింది. రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ నూతన సిలబస్ మార్పులపై భారీ కసరత్తే చేసింది. దాదాపు పది దేశాల ప్రాధమిక విద్యావిధానాలని పూర్తిగా పరిశీలించారు. దీంతో పాటు దేశంలోని 15 రాష్ట్రాలకి చెందిన ఎస్‌సీఈఆర్‌టీ సిలబస్‌లని కూడా పరిశీలించి కొత్త సిలబస్‌ని రూపొందించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ కమీషనర్ చినవీరభద్రుడు మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనలమేరకు నూతన సిలబస్ రూపొందించడంలో రాష్ట్ర విద్యా పరిశోధనా సంస్ధ కీలక పాత్ర పోషించింది. ఇందుకు గాను వివిధ రాష్ట్రాలలో అమలవుతున్న విద్యావిధానం....అమెరికా, ఆస్డ్రేలియా లాంటి పలు దేశాల విద్యా విధానాలని పరిశీలించింది. ఈ విధంగా ఒకటి నుంచి ఆరవ తరగతి వరకు దాదాపు 84 రకాల పాఠ్య పుస్తకాలు, 63 వర్క్ బుక్‌లు రూపొందించింది. దాంతోపాటు తమిళం, ఒరియా, కన్నడ, ఉర్ధూ మీడియంలలో కూడా పాఠ్య పుస్తకాలు ముద్రించింది’’ అని తెలిపారు.
అంతేకాక ‘మారిన సిలబస్ ప్రకారం ఒకటి, రెండు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, లెక్కలు.. మూడు, నాలుగు, అయిదు తరగతులకి తెలుగు, ఇంగ్లీష్, మేథ్స్, సైన్స్ పాఠ్య పుస్తకాలు.. ఇక ఆరవ తరగతి విధ్యార్ధులకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ పాఠ్యాంశాలగా ఉంటాయి. మరోవైపు దేశంలోనే తొలిసారిగా ఒకటో తరగతి నుంచే సెమిస్టర్ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీలో ప్రవేశపెడుతున్నారు. ఇందుకు తగినట్లుగానే పాఠ్య పుస్తకాలని మూడు సెమిస్టర్‌లలాగా విభజించారు. అలాగే ఒక పేజిలో తెలుగులో... మరో పేజీలో ఇంగ్లీష్‌లో ముద్రించడం ద్వారా ఇంగ్లీష్ బోధన అర్దమయ్యే రీతిలో పుస్తకాలు రూపొందించింది. దీంతో పాటు తెలుగుకి అత్యధిక ప్రదాన్యతనిచ్చాము. ఇందుకుగాను పాఠ్యాంశాలలో 116 మంది కవులని పరిచయం చేశాము. అలాగే తొలిసారిగా విధ్యార్ధులకి వర్క్ బుక్స్ ని అందుబాటులోకి తీసుకువచ్చాము. దీంతోపాటు టీచర్స్ కి, తల్లితండ్రులకి కూడా హేండ్ బుక్స్ ఇవ్వనున్నాము’ అని తెలపారు. అంతేకాక విధ్యార్దులని ఆకర్షించే విధంగా రంగురంగుల బొమ్మలతో పాఠ్య పుస్తకాల రూపకల్పన చేశామన్నారు చిన వీరభద్రుడు. (చదవండి: ఒకే వేదికపైకి వంద విదేశీ వర్సిటీలు )
పాఠ్య పుస్తకాల రూపకల్పన నుంచి ప్రింటింగ్ వరకు విద్యా శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుందన్నారు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరక్టర్ మధుసూదనరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత అక్టోబర్ నాటికే టెండర్లు ఖరారు చేయడమే కాకుండా రాష్ట్ర స్ధాయిలో 55 ప్రింటింగ్ ప్రెస్‌లని గుర్తించి వాటి ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ సకాలంలో పూర్తి అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాము. దీంతో పాటు వీటి పర్యవేక్షణకి అయిదు ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి స్వయంగా పర్యవేక్షించాము. రికార్డు స్ధాయిలో మార్చి నెలాఖరునాటుకి హైస్కూళ్లకి.. జూన్ నాటికి ప్రాదమిక పాఠశాలలకి పాఠ్యపుస్తకాలని పంపిణీ చేశాము’ అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకి అనుగుణంగా విద్యా శాఖలో అనేక సంస్కరణలు చేపడుతున్నామని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంతర్జాతీయ స్ధాయిలో మన విద్యార్ధులు పోటీపడే విధంగా సిలబస్ రూపొందించడం ఒక ఎత్తైతే వాటిని సకాలంలో ప్రింట్ చేసి విద్యార్ధుల వరకు చేరవేయగలగటం మరో ఎత్తు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ చరిత్ర సృష్టించిందనడంలో సందేహం లేదు. ఇప్పటికే స్కూళ్లకి చేరుకున్న ఆ పాఠ్యపుస్తకాలని ఈ నెల 8 న ప్రారంభం కానున్న జగనన్న విద్యాకానుక కిట్‌తో పాటుపాటు విద్యార్ధులకి అందించనున్నాము’ అని తెలిపారు. (చదవండి: 3,5,8,10 తరగతులకే పరీక్షలు)
Comments
Please login to add a commentAdd a comment