సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 13 జిల్లాల పరిధిలో 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 51 రెవెన్యూ డివిజన్లు, 670 మండలాలు ఉన్నాయి. వాటిని 26 జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్విభజించింది. పునర్వ్యస్థీకరణ తర్వాత 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రకాశం అతి పెద్ద జిల్లాగా అవతరించనుంది. 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో విశాఖపట్నం అతి చిన్న జిల్లాగా ఉండనుంది. జనాభా పరంగా కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా అవుతుంది. అతి తక్కువగా 9.54 లక్షల జనాభాతో అరకు చిన్న జిల్లాగా ఉంది. రెండు గిరిజన జిల్లాలు అల్లూరి, మన్యం.. ఏర్పాటు కానున్నాయి. అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు ఉన్నాయి.
రెండు పార్లమెంటు స్థానాల్లో విస్తరించిన మండలాలు..
► రెండు జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలు 5 ఉన్నాయి.
► అనంతపురం రూరల్ మండలం అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
► విజయనగరం జిల్లా జామి మండలం విశాఖపట్నం, విజయనగరం లోక్‌సభ స్థానాల్లో ఉంది.
► విజయవాడ రూరల్ మండలం మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ స్థానాల్లో ఉంది.
► తిరుపతి రూరల్ మండలం చిత్తూరు, తిరుపతి లోక్‌సభ స్థానాల పరిధిలో ఉంది.
► పెదగంట్యాండ మండలం అనకాపల్లి, విశాఖ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంది.
ఈ మండలాలను ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానం ఉన్న జిల్లా పరిధిలోనే ఉంచనున్నారు. దీని ప్రకారం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లాలో, జామి మండలం విజయనగరంలో, విజయవాడ రూరల్ విజయవాడలో, తిరుపతి రూరల్ మండలం తిరుపతిలో, పెదగంట్యాడ విశాఖ జిల్లాలో ఉంటాయి. దీంతో ఏ మండలమూ రెండు జిల్లాల పరిధిలో ఉండదు.
11 జిల్లాలు ఆంగ్లేయుల హయాంలోనే..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల్లో 11 ఆంగ్లేయుల హయాంలో ఏర్పాటైనవే. స్వాతంత్య్రం వచ్చాక పరిపాలన సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో ఒంగోలు కేంద్రంగా 1970 ఫిబ్రవరి 2న ప్రకాశం జిల్లా ఆవిర్భవించింది. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం కేంద్రంగా 1979 జూన్ 1న చివరిగా విజయనగరం జిల్లా ఏర్పాటైంది.
రెవెన్యూ డివిజన్లూ పునర్ వ్యవస్థీకరణ..
రాష్ట్రంలో ప్రస్తుతం 51 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవెన్యూ డివిజన్ అతి పెద్దది. 33 మండలాలు ఇందులో ఉంటాయి. పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా పది నుంచి 12 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ ప్రతిపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment