సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ కార్యకలాపాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన అవార్డును ఏపీ తరఫున కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ అందుకున్నారు. గృహాల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రమంత్రి అభినందించారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మూడ్రోజుల పాటు జరిగే జాతీయ పట్టణ గృహ నిర్మాణ సమ్మేళనం శుక్రవారం ప్రారంభమైంది. ఏపీలో జగనన్న కాలనీల పేరిట నిర్మిస్తున్న ఇళ్లలో విద్యుత్ ఆదాకు చేపడుతున్న చర్యలను ఈ సమ్మేళనంలో అజయ్‌జైన్ వివరించారు.
అత్యాధునిక సాంకేతికత..
తొలిదశలో 15.6 లక్షల ఇళ్లకు ఏపీ ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీసీడ్కో), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సాయంతో ఒక్కో ఇంటికీ నాలుగు ఎల్‌ఈడీ బల్బులు, రెండు ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లను అందజేయనున్నట్లు తెలిపారు. వీటి ద్వారా ఒక్కో ఇంటికి ఏడాదికి 734 యూనిట్ల విద్యుత్ చొప్పున మొత్తం 1,145 మిలియన్ యూనిట్ల కరెంటు ఆదా అవుతుందని చెప్పారు. నిర్మాణంలో ఇండో–స్విస్ బిల్డింగ్ టెక్నాలజీతో పాటు రీఇన్ఫోర్డ్స్ కాంక్రీట్ (ఆర్సీసీ) ప్రీకాస్ట్ టెక్నాలజీ, షియర్‌వాల్ టెక్నాలజీ, ఈపీఎస్ టెక్నాలజీ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ టెక్నాలజీవల్ల ఇంటి లోపల కనీసం రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గడంతోపాటు 20 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అజయ్‌జైన్ వివరించారు.
కాలనీలు కాదు.. అధునాతన గ్రామాలు
ఇక అల్పాదాయ వర్గాలు, పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడంతో పాటు అత్యాధునిక సౌకర్యాలతో తయారవుతున్న ఇళ్లలో వారు సగౌరవంగా జీవించేలా చూడడమే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ లక్ష్యమని అజయ్‌జైన్ స్పష్టంచేశారు. అందుకు అనుగుణంగానే కాలనీలకు బదులు అధునాతన గ్రామాలను సృష్టిస్తున్నామని, 17,005 లే అవుట్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం దేశంలో ఏపీ మాత్రమేనన్నారు.
రూ.56 వేల కోట్ల విలువైన 71,811 ఎకరాల స్థలాన్ని పేదలకు పంపిణీ చేసినట్లు వివరించారు. లేఅవుట్ అభివృద్ధికి రూ.3,525 కోట్లు, ఆధునిక మౌలిక సదుపాయాలకు రూ.32,909 కోట్లు వెచ్చించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 6.20 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తిచేశామని, మరో 18.9 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, నిర్వహణ అంశాలను మొబైల్ యాప్‌లు, జియో ట్యాగింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. హౌసింగ్ జేఎండీ ఎం. శివప్రసాద్, చీఫ్ ఇంజనీర్ జీవీ ప్రసాద్ ఈ సదస్సులో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment