సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం సాధించింది. గత ఏడాది (2021) 9.32 కోట్లకు పైగా దేశీయ పర్యాటకులు రాష్ట్రాన్ని సందర్శించినట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో తమిళనాడు రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. 2021లో 11.53 కోట్ల మంది తమిళనాడును సందర్శించినట్లు ఆ శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్ రెండో ర్యాంకులో ఉండగా, కర్ణాటక నాలుగో ర్యాంకు, మహారాష్ట్ర ఐదో ర్యాంకులో ఉన్నాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల సందర్శనలో దాదాపు 65.41 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. దేశీయ పర్యాటకుల్లో తమిళనాడును 17.02 శాతం, ఉత్తరప్రదేశ్‌ను 16.19 శాతం, ఆంధ్రప్రదేశ్‌ను 13.77 శాతం, కర్ణాటకను 12 శాతం, మహారాష్ట్రను 6.43 శాతం మంది సందర్శించినట్లు తెలిపాయి.
2021లో దేశీయ పర్యాటకుల వృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో 31.69 శాతంగా గణాంకాలు వెల్లడించాయి. దేశం మొత్తం మీద దేశీయ పర్యాటకుల వృద్ధి 11.05 శాతమే ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన వారి సంఖ్య క్షీణించినట్లు నివేదిక స్పష్టం చేసింది. తెలంగాణలో 2021లో దేశీయ పర్యాటకుల్లో వృద్ధి –19.99 శాతంగా ఉందని నివేదిక పేర్కొంది.
దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2019లో కూడా మూడో ర్యాంకులో ఉంది. అయితే 2020లో కోవిడ్ మహమ్మారి కారణంగా నాలుగో ర్యాంకు పొందింది. 2021లో మళ్లీ పుంజుకొని మూడో ర్యాంకులోకి వచ్చింది. 2019 నుంచి 2021 వరకు టాప్ ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటోంది. 2019లో ఆంధ్రప్రదేశ్‌ను 23.70 కోట్ల మంది దేశీయ పర్యాటకులు సందర్శించారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా 2020లో 7.08 కోట్ల మందే వచ్చారు.
కోవిడ్ ఆంక్షల కారణంగా దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకుల సంఖ్య 2021లో గణనీయంగా తగ్గిపోయినట్లు పర్యాటక శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కలిపి మొత్తం విదేశీ పర్యాటకుల సంఖ్య 7.17 మిలియన్లు ఉండగా 2021లో 1.05 మిలియన్లకు తగ్గిపోయింది. 2020తో పోల్చి చూస్తే 2021లో దేశం మొత్తం మీద విదేశీ పర్యాటకుల సంఖ్య 85.29 శాతం క్షీణించింది. 2019లో ఏపీలో విదేశీ పర్యాటకుల సంఖ్య 0.89 శాతం వృద్ధి ఉండగా కోవిడ్ కారణంగా 2020లో ఏపీలో 70.12 శాతం మేర, 2021లో 59.24 శాతం మేర క్షీణించింది.
పర్యాటక ఏపీ.. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంకు
Published Sun, Dec 4 2022 5:29 AM | Last Updated on Sun, Dec 4 2022 9:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment