సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం పోషణ్ అభియాన్‌ను సమగ్రంగా అమలు చేయడంలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ పెద్ద రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది. ఇక చిన్న రాష్ట్రాల్లో సిక్కిం అత్యుత్తమ పనితీరు కనబరిచినట్లు తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో దాద్రానగర్ హవేలీ, డామన్ –డయ్యూ అగ్రస్థానంలో ఉన్నాయని పేర్కొంది.
పథకాన్ని సమగ్రంగా అమలు చేయడంలో అత్యల్ప పనితీరును కనబరిచిన పెద్ద రాష్ట్రాల్లో పంజాబ్, బిహార్ ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 19 పెద్ద రాష్ట్రాల్లో 12 రాష్ట్రాలు పోషణ్ అభియాన్ అమల్లో 70 శాతానికి పైగా స్కోర్‌ను సాధించినట్లు వివరించింది. దేశంలో పిల్లలు, మహిళలకు పోషకాహారం అందించడంలో పురోగతిని, కరోనా సమయంలో పథకం అమలు తీరును నీతి ఆయోగ్ నివేదిక విశ్లేషించింది.
75 శాతం పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంపు
17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 12–23 నెలల వయసు గల పిల్లల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది పూర్తిగా రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని నీతి అయోగ్ నివేదిక వివరించింది. అలాగే 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తిగా రోగనిరోధక శక్తిని కలిగిన పిల్లలు 25 శాతం కంటే తక్కువ మంది ఉన్నారని ఎత్తిచూపింది. అలాగే బిహార్‌లో (65 శాతం గర్భిణులు, 62 శాతం బాలింతలు, 52 శాతం పిల్లలు), పంజాబ్‌లో (78 శాతం గర్భిణులు, 76 శాతం బాలింతలు, 65 శాతం పిల్లలు) రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని పేర్కొంది.
నివేదిక ప్రకారం.. 16 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 75 శాతం కంటే ఎక్కువ మంది పిల్లలు (0–59 నెలలు) ఓఆర్‌ఎస్‌తో చికిత్స పొందుతున్నారని వివరించింది. ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25 శాతం మంది పిల్లలు డయేరియాకు ఓఆర్‌ఎస్‌తో చికిత్స పొందినట్లు తెలిపింది.
నిధుల వినియోగంలో పలు రాష్ట్రాలు వెనుకంజ..
పోషణ్ అభియాన్ కింద కేంద్రం ఇచ్చే మొత్తం నిధులను వినియోగించడంలో పలు రాష్ట్రాలు వెనుకపడ్డాయని నివేదిక పేర్కొంది. 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతం కంటే తక్కువ నిధులను ఖర్చు చేశారని నివేదిక వెల్లడించింది. పోషణ్ అభియాన్ కోసం విడుదల చేసిన నిధులు పూర్తిగా ఖర్చయ్యేలా చూడాలని సూచించింది.
తగినంతగా ఆరోగ్య సదుపాయాలు, సామగ్రి ఉండేలా చూడాల్సి ఉందని పేర్కొంది. అలాగే సమీకృత శిశు అభివృద్ధి పథకం, ఆరోగ్య కార్యక్రమాలను బలోపేతం చేయాలని నిర్దేశించింది. కన్వర్జెన్స్ యాక్షన్ ప్లాన్‌లను (సీఏపీ) అమలు చేయాలని సూచించింది. కార్యక్రమాల అమలుకు గృహ ఆధారిత కౌన్సెలింగ్‌ను బలోపేతం చేయాలని తెలిపింది.
చదవండి: చెప్పాడంటే చేస్తాడంతే.. సీఎం జగన్ సక్సెస్ మంత్రా ఇదే..
Comments
Please login to add a commentAdd a comment