సాక్షి, నెట్‌వర్క్: ఉన్నత విద్య కోసం ఏపీ నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉక్రెయిన్‌కు వెళ్లారు. కానీ, ప్రస్తుతం ఆ దేశంపై రష్యా దాడుల ఘటనలతో ఇక్కడ దాదాపు అన్ని జిల్లాల్లోని వారి తల్లిదండ్రులు తమ పిల్లల బాగోగుల గురించి కలత చెందుతున్నారు. విద్యార్థులు కూడా అక్కడి పరిస్థితుల వీడియోలను తమ కుటుంబ సభ్యులకు పంపుతుండడంతో అవి చూసి వారు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉదా.. ఉక్రెయిన్‌లో తామెంత భయోందోళనతో ఉన్నామో వివరిస్తూ తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన 18 మంది విద్యార్థులు పంపిస్తున్న వీడియో క్లిప్పింగ్స్ చూసి వారి తల్లిదండ్రులు ఇక్కడ భయకంపితులవుతున్నారు.
ఉక్రెయిన్‌లోని జాపొరొజెయి స్టేట్ వర్సిటీలో వీరంతా వైద్య కోర్సులు చదువుతున్నారు. అక్కడ నుంచి ఎలాగోలా వచ్చేద్దామంటే విమాన టికెట్ ధరలు అమాంతం పెరిగిపోయాయని వీరు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అమలాపురం ఆర్డీఓని కలిసి తమ పిల్లల్ని క్షేమంగా వచ్చేలా చేయాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వీరిలాగే పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన టి.జయకుమార్ కుమార్తె అభిజ్ఞ కూడా ఉక్రెయిన్‌లోని పరిస్థితులను తన తల్లిదండ్రులకు, ‘సాక్షి’కి వివరించింది. బాంబు దాడుల కారణంగా విమానాలను రద్దుచేశారని, బంకర్లలోకి వెళ్లి దాక్కోమని అధికారులు చెబుతుండడంతో భయంగా ఉందంటూ వాట్సాప్‌లో అక్కడి దృశ్యాలను చూపుతూ ఆవేదన వ్యక్తంచేసింది.
ఇప్పటివరకు ఎంబసీ సిబ్బంది గాని, ఉక్రెయిన్ అధికారులుగాని అందుబాటులో లేరని చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో ఏ క్షణంలో ఏమి జరుగుతుందో అని కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ఎంబీబీఎస్ చదువు కోసం అద్దంకి పట్టణం, పరిసర ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ పోతురాజు, నల్లమోతు పవన్, తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన అల్లంనేని విజయరాఘవ ఉక్రెయిన్ వెళ్లారు. తామంతా ఇక్కడ క్షేమంగానే ఉన్నామని ఆందోళన చెందవద్దని వారు తల్లిదండ్రులతో చెబుతున్నారు. విమానాల రాకపోకలు లేకపోవడంతో తాము స్వదేశానికి రాలేకపోతున్నామని విజయరాఘవ ‘సాక్షి’కి తెలిపారు.
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పురుషోత్తం సాయి హరీష్, బత్తల వెంకటసాయి, వసీం అక్రమ్, శ్రీయపురెడ్డి పల్లవి, మహమ్మద్ సుహేల్, శ్రీకరన్, యుగంధర్, గణేష్ కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకున్నారు. వారందరూ ఎంబీబీఎస్ చదివేందుకు వెళ్లారు. గురువారం వారి వివరాలను సేకరించిన జిల్లా అధికారులు ఆ విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారి యోగక్షేమాలపై ఆరా తీశారు. ప్రస్తుతానికి ఆ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులు అధికారులకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని కలెక్టర్ హరినారాయణన్ వారికి భరోసా ఇచ్చారు. మరోవైపు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన 10 మంది వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది.
జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పి. వెంకటలక్ష్మి నరసింహ సాయితేజ, సూర్తినేని విషాల్, షేక్ మహ్మద్ అబుబకర్ సిద్ధిక్, షేక్ మహ్మద్ షర్రా తాబస్సుమ్, శ్రీహరికోట వరలక్ష్మి, శ్రీచైతన్య తేజ, వల్లూరు సాయిసుధాకర్‌రెడ్డి, ధన్యాసి శ్యామంత్, గంగినేని జస్వంత్, భానుమతి తదితరులు అక్కడుంటూ మెడిసిన్ చేస్తున్నారని తెలిసింది. వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే, వీరి గురించి తమకెలాంటి సమాచారం లేదని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇక తమ కుమారుడు నెల్సన్ కేరిని తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ పట్టణానికి చెందిన కాటి కమల్ సుధాకర్ కూడా వేడుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితుల దృష్ట్యా స్వస్థలానికి తిరిగి రావాలనున్నా విమానాశ్రయం మూసివేయడంతో తమ కుమారుడు అక్కడే ఉండిపోయాడన్నారు.
ఆ వీడియోలు చూస్తూ విలవిల..
Published Fri, Feb 25 2022 3:44 AM | Last Updated on Fri, Feb 25 2022 3:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment