కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే మూలపాడు, త్రిలోచనపురం జంట గ్రామాల జనాభా దాదాపు 7 వేలు. సమీపంలోని కేతనపల్లిలో మరో 5 వేల జనాభా ఉంది. రెండేళ్ల క్రితం వరకు మూలపాడులో ఓ మద్యం దుకాణం ఉండేది. సాయంత్రం 4 గంటలు అయితే చాలు పరిస్థితి అదుపు తప్పేది. గొడవలు, కొట్లాటలు నిత్యకృత్యం. దీనికి అనుబంధంగా నాలుగైదు బెల్ట్ దుకాణాలు ఉండేవి. జాతీయ రహదారి నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో ఏర్పాటైన మద్యం దుకాణం పక్క నుంచి నడవాలంటే మహిళలు హడలిపోయేవారు. శుభకార్యాలు జరిగినా మనశ్శాంతి ఉండేది కాదు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీ మద్య నియంత్రణలో భాగంగామూలపాడులోని మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మూడు గ్రామాల్లో పరిస్థితులు చక్కబడ్డాయి. ఇప్పుడు సాయంత్రం వేళ ఏ గొడవలు, కొట్లాటలూ లేవు. అల్లరిమూకల ఆగడాలు లేవు. మహిళలు ధైర్యంగా రోడ్డుపై నడవగలుగుతున్నారు.
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ మద్యపానాన్ని నిరుత్సాహ పరచడంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానం రాష్ట్రంలోని పల్లెల్లో తెచ్చిన సానుకూల మార్పులు ఇవీ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను తొలగించారు. దీంతో ప్రతి పల్లెలో మళ్లీ ప్రశాంత వాతావరణం పరిఢవిల్లుతోంది. బెల్ట్ దుకాణాల రద్దు... మద్యం దుకాణాల సంఖ్య తగ్గింపు... మద్యం షాపుల వేళల కుదింపు... షాక్ కొట్టేలా మద్యం ధరలు పెంపు... ఇలా మద్యం విక్రయాలను తగ్గించేందుకు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. మద్యం అమ్మకాలు రెండేళ్లలో గణనీయంగా తగ్గడమే ఇందుకు నిదర్శనం.
దశలవారీగా కట్టడి ఇలా..
► రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగుగా బెల్ట్ దుకాణాలను తొలగించింది. టీడీపీ హయాంలో ఒక్కో మద్యం దుకాణానికి అనుబంధంగా విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాల వ్యవస్థ కొనసాగింది. ఎటుచూసినా మద్యం లభ్యం కావడంతో విచ్చలవిడిగా విక్రయాలు సాగాయి. పాన్ షాపులు, కాకా హోటళ్లు కూడా బెల్ట్ దుకాణాలుగా రూపాంతరం చెందాయి. గ్రామాల్లో మద్యం ఏరులైపారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 43 వేలకు పైగా బెల్ట్ దుకాణాలను పూర్తిగా నిర్మూలించింది.
► రెండో అడుగుగా టెండర్ల ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలను కేటాయించే విధానాన్ని పూర్తిగా తొలగించింది. ప్రభుత్వమే పరిమితంగా మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. ప్రైవేట్ వ్యక్తులైతే ధనార్జనే లక్ష్యంగా విచ్చలవిడిగా అమ్మకాలు కొనసాగిస్తారు. అందువల్ల ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాల కేటాయింపు విధానాన్ని తొలగించి ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు లేకుండా చేసింది.
► మద్యం దుకాణాలను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా తగ్గిస్తోంది. 2019 మే నాటికి రాష్ట్రంలో 4,408 మద్యం దుకాణాలు ఉండగా రెండేళ్లలో ప్రభుత్వం 1,433 దుకాణాలను తగ్గించింది. 2019–20లో 836 దుకాణాలు, 2020–21లో 597 దుకాణాలను రద్దు చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,975 దుకాణాలే ఉన్నాయి. అంటే రెండేళ్లలో 33 శాతం మద్యం దుకాణాలను ప్రభుత్వం రద్దు చేసింది.
► మద్యం దుకాణాల వేళలను కూడా ప్రభుత్వం కుదించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది.
రెండేళ్లలో గణనీయంగా తగ్గిన విక్రయాలు
ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మద్యం విక్రయాలను నిరుత్సాహపరుస్తోంది. దశలవారీగా మద్య నియంత్రణ కోసం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్రంలో రెండేళ్లలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. 2019 మేతో పోలిస్తే 2021 ఆగస్టు నాటికి రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గగా బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం పడిపోవడం గమనార్హం.
40 శాతం పడిపోయిన లిక్కర్ అమ్మకాలు
రాష్ట్రంలో లిక్కర్(ఐఎంఎల్) అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. 2018 అక్టోబర్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు 3,12,43,860 లిక్కర్ కేసులు అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు 1,88,81,430 లిక్కర్ కేసులు మాత్రమే విక్రయాలు జరిగాయి. ఇక 2020 అక్టోబర్ నుంచి 2021 జూలై ఆఖరు వరకు 1,72,33,528 లిక్కర్ కేసులు విక్రయించారు. అంటే లిక్కర్ అమ్మకాలు 40 శాతం తగ్గాయి.
బీరు అమ్మకాలు 78 శాతం డౌన్
రాష్ట్రంలో బీరు విక్రయాలు భారీగా తగ్గాయి. 2018 అక్టోబరు నుంచి 2019 సెప్టెంబరు వరకు 2,44,07,717 బీరు కేసులు విక్రయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం తరువాత 2019 అక్టోబరు నుంచి 2020 సెప్టెంబరు వరకు కేవలం 52,26,185 బీరు కేసులు మాత్రమే విక్రయించడం గమనార్హం. 2020 అక్టోబరు నుంచి 2021 జూలై 31 నాటికి 52,00,915 బీరు కేసులే విక్రయించారు. రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏకంగా 78 శాతం తగ్గాయి.
అశాంతి నుంచి శాంతివైపు
మాది మత్స్యకార గ్రామం. రెండేళ్ల క్రితం వరకు మద్యం దుకాణం ఉండేది. సాయంత్రమైతే చాలు మందుబాబుల అరుపులు, కేకలు, గొడవలతో భయం వేసేది. ఆడవాళ్లు, పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయేవారు. చీకటి పడితే ఇతర ప్రాంతాల నుంచి మా ఊరికి రావడానికి జంకేవారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామంలో మద్యం దుకాణాన్ని తొలగించారు. దీంతో మా ఊరిలో శాంతి నెలకొంది. కాయకష్టం చేసుకునే వాళ్లు పొదుపు చేయడం ప్రారంభించడం సంతోషం కలిగిస్తోంది.
– పినపోతు దుర్గ, పీబీవీపాలెం, కోరంగి, తూర్పు గోదావరి జిల్లా
ఊర్లో ప్రశాంతత..
సాయంత్రమైతే చాలు మా ఊరిలో మద్యం మత్తులో గొడవలు, కొట్లాటలు జరిగేవి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత మద్యం దుకాణాన్ని తొలగించడంతో ప్రశాంతంగా ఉంది. సాయంత్రమైనా రాత్రి అయినా సరే ఆడవాళ్లు ధైర్యంగా గ్రామంలోకి రాగలుగుతున్నారు.
– దేవరకొండ నాగరాణి, మూలపాడు, కృష్ణా జిల్లా
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
మద్యం మత్తులో ఈ ప్రాంతంలో ఎంతోమంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల క్రితం మద్యం దుకాణం తొలగించడంతో మా గ్రామంలో రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– గొట్టిముక్కల పోతురాజు, మూలపాడు, కృష్ణా జిల్లా.
బెల్టు రద్దుతో మనశ్శాంతి
టీడీపీ హయాంలో మా ఊర్లో నాలుగు బెల్టు దుకాణాలు ఉండేవి. సాయంత్రమైతే చాలు మందుబాబుల చిందులతో బయటకు రావాలంటేనే భయపడేవాళ్లం. రెండేళ్ల క్రితం బెల్టు దుకాణాలను తొలగించడంతో ఊరు ప్రశాంతంగా ఉంది. కుటుంబాల్లో మనశ్శాంతి నెలకొంది.
– బండి వెంకటలక్ష్మి, కె సముద్రపుగట్టు, అత్తిలి మండలం, పశ్చిమ గోదావరి జిల్లా
పేద కుటుంబాలు బాగుపడుతున్నాయి
గత ప్రభుత్వ హయాంలో మా గ్రామంలో మద్యం దుకాణం ఉండేది. ఎంతోమంది మద్యానికి బానిసలుగా మారి ఆరోగ్యం పాడుచేసుకోవడంతో పాటు కష్టార్జితాన్ని మద్యం దుకాణాలకే ధారపోసేవారు. ఇప్పుడు మద్యం దుకాణాన్ని తొలగించారు. ఊర్లో మందు దొరకడంలేదు. మద్యం ధరలు కూడా బాగా పెంచడం మంచిదైంది. పేదలు మరో ఊరు వెళ్లి అంత డబ్బు పెట్టి కొనేందుకు సాహసించడం లేదు. దీంతో కుటుంబాలు బాగు పడ్డాయి.
– సాకే గౌతమి, సర్పంచ్, సనప గ్రామం, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment