సాక్షి, విజయవాడ: సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ప్రచురించిన 'ఆంధ్ర సంపాదక శిఖరాలు' పుస్తకాన్ని నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ రాజశేఖర్,ఏపీ అధికార భాష సంఘం అధ్యక్షుడు పి.విజయబాబు సోమవారం ఆవిష్కరించారు. నాగార్జున యూనివర్సిటీ(ఎన్‌యూ)లో జరిగిన "తెలుగు భాష సేవా రత్న" అవార్డుల ప్రదానోత్సవ సభలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా సి.ఆర్. మీడియా అకాడమీ మాజీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పత్రికా రంగాన్ని ఉర్రూతలూగించిన తొలి తరం సంపాదకుల సంక్షిప్త జీవిత చరిత్రలను ప్రస్తుత తరానికి అందించాలన్న తలంపుతో మీడియా అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించిందన్నారు. ఆయా సంపాదకుల వివరాలు సేకరించి మా శర్మ ఈ పుస్తకాన్ని అద్భుతంగా రచించారని తెలిపారు.
నాగార్జున యూనివర్సిటీతో మీడియా అకాడమీకి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా కొమ్మినేని గుర్తుచేసుకున్నారు. వర్కింగ్ జర్నలిస్టులకోసం తాను ఛైర్మన్‌గా పనిచేసిన కాలంలో ప్రారంభించిన జర్నలిజం డిప్లమో కోర్సుకు సహకరించిన వైస్ ఛాన్సిలర్, ప్రొ. రాజశేఖర్‌కు, జర్నలిజం హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్ డా. జి. అనితకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రచయిత మా శర్మను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సిలర్ ప్రొ. కొలకలూరి ఇనాక్ సి.ఆర్. మీడియా అకాడమీ తరపున శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస ఆంధ్రుల కమిటీ చైర్మన్, మేడపాటి వెంకట్, తెలుగు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ప్రముఖ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నాగార్జున యూనివర్సిటీ రెక్టార్ వాసుదేవరావు, జర్నలిజం హెచ్‌వోడీ డా. జి. అనిత, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ మామిడిపల్లి బాల గంగాధర తిలక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment