అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కోసం నా ప్రాణాలైనా ఇస్తానని అంగన్‌వాడీ కార్యకర్త గుడివాడ పద్మావతి పేర్కొన్నారు. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం ఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ఆమె నిందితుడిని పక్కకు లాగి వెనుకకు పడిన మంత్రి పేర్ని నానిని పద్మావతి లేవదీసే ప్రయత్నం చేశారు. ఘటన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రి పేర్ని నాని కోసం అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానని ఉద్వేగంగా పేర్కొంది.
నియోజకవర్గంలో ఎస్కార్ట్ లేకుండా..
వర్దమాన రాజకీయ నాయకులకు భిన్నంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని ఉంటారు. మంత్రి హోదా ఎక్కడా చూపరు. ఒక్కోసారి గన్‌మెన్‌లను కూడా దగ్గర ఉండనీయరు. నియోజకవర్గంలో ఎక్కడా ఎస్కార్ట్ వాహనం సౌండ్ విన్పించదు. ఎక్కడకు వెళ్లినా నాయకులు, కార్యకర్తలతోనే ఏ వాహనం అందుబాటులో ఉంటే ఆ వాహనంలోనే వెళ్లి పోతుంటారు. ఇంటివద్ద రోజూ వందలాది మందిని నేరుగా కలుస్తుంటారు. మధ్యలో ఎవరికి చాన్స్ ఇవ్వరు. నేరుగా వారి సమస్యలు వినడం అక్కడికక్కడే పరిష్కారం చూపడం నాని శైలి. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న నాని కుల మతాల కతీతంగా తండ్రిని మించిన తనయుడిగా నియోజకవర్గంపై పట్టు సాధించారు. గడిచిన ఏడాదిలో బందరు పోర్టు, మెడికల్ కళాశాల, ఫిషింగ్ హార్బర్ ఇలా వేలకోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. మరొక పక్క గతంలో ఎన్నడూ లేని విధంగా వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. ఇవి గిట్టని ప్రత్యర్థులు పథకం ప్రకారమే ఆయన్ని బలహీన పర్చేందుకే ఆయన ప్రధాన అనుచరుడైన మోకాను అంతమొందించారు. ఇప్పుడు తాజాగా ఆయనపైనే హత్యాయత్నానికి ఒడిగట్టారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం)
భద్రతా వైఫల్యం !
ఘటన జరిగే సమయంలో ఇంటి వెలుపల సుమారు 30 మందికి పైగా కార్యకర్తలున్నారు. పక్కనే ఉన్న పార్టీ కార్యాలయం వద్ద కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులున్నారు. కార్యకర్తల మధ్యలో ఉన్న నాగేశ్వరరావు ఘటన జరిగిన సమయంలో మంత్రి ఇంటి వద్ద కేవలం ఇద్దరే.. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారని చెబుతున్నారు. మార్కెట్ పనులు పరిశీలిస్తున్న సమయంలో మోకాపై ఊహించనిరీతిలో దాడిచేసి హత మార్చారని, ఇప్పుడు తనపై కూడా అదే రీతిలో అటాక్ జరిగిందని మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగేశ్వరరావు టీడీపీ కార్యకర్త కావడంతో వెనుక ఏదైనా దురుద్దేశం ఉండిఉండవచ్చునన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏదేమైనప్పటికీ సమగ్ర విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగు చూడవని ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
హత్యయత్నంపై ఖండన
మచిలీపట్నం టౌన్: రాష్ట్ర రవాణా, సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని)పై ఆదివారం జరిగిన హత్యాయత్నం ఘటనను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్రంగా ఖండించారు. దాడి నుంచి బయటపడిన మంత్రి పేర్ని నాని కలిసిన ఆయన పరామర్శించారు. అనంతరం ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మంత్రి పేర్ని నాని పై హత్యాయత్నం సమాచారం తెలిసిన వెంటనే ఏలూరు నుంచి హుటాహుటిన బయలుదేరి ఆయన మచిలీపట్నం చేరుకున్నారు. వివాద రహితుడిగా, సౌమ్యుడిగా ఉన్న పేర్ని నాని పై హత్యాయత్నంకు పాల్పడటం దుర్మార్గమన్నారు.
ఈ ఘటనలో నిందితుడి వెనుక ఎవరు ఉన్నదీ బయటకు తీసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. పేర్ని నానిపై హత్యాయత్నాన్ని పలు సంఘాలు, పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అంబటి ఆంజనేయులు, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, ఏపీ ఐఅండ్‌పీఆర్ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బి.సత్యనారాయణసింగ్, ఆంధ్రప్రదేశ్ ముస్లిం సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఎండీ సద్‌రుద్దీన్ ఖురేషి, కాపునాడు ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు అనుమకొండ కృష్ణ, పలు దళిత సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment