సాక్షి, అమరావతి: తమ సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అంగన్‌వాడీల్లో అభిమానం ఉప్పొంగింది. సమ్మెకు స్వస్తి పలికి విధుల్లో చేరిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వానికి అభినందన కార్యక్రమాలు నిర్వహించారు. స్వచ్ఛందంగా సభలు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లలో 10 ఆమోదించి తక్షణం అమలు చేస్తున్నందుకు సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. సమస్యలన్నీ పరిష్కరించినందుకు ‘థ్యాంక్యూ సీఎం సార్’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కొనియాడారు. ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలని కోరుకుంటున్నామని, వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించి పేద వర్గాల సేవలకు అవాంతరాలు తొలగించడం పట్ల కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యక్రమాలు యథావిధిగా సాగుతుండటంపై సంతోషం వ్యక్తం చేశారు.
గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పట్ల, అలాగే వర్కర్లు, హెల్పర్ల పట్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలి నుంచి సానుకూల వైఖరితోనే వ్యవహరిస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునీకరించడంతో పాటు వర్కర్లు, హెల్పర్లకు మెరుగైన వేతనాలు సీఎం వైఎస్ జగన్ పాలనలోనే అందిస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంగన్‌వాడీ వర్కర్ల సగటు నెల వేతనం రూ.6,100 ఉంటే సీఎం జగన్ నాలుగున్నరేళ్లుగా వర్కర్లకు రూ. 11,500 చొప్పున అందిస్తున్నారు.
విశాఖలో సంబరాలు
సీతమ్మధార (విశాఖ ఉత్తర): తమ సమస్యల పరిష్కారం కావడంతో మంగళవారం విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద భీమిలి, పెందుర్తి, విశాఖ అర్బన్ ప్రాజెక్టులకు చెందిన అంగన్‌వాడీల కార్యకర్తలు, హెల్పర్లు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని ఆనందం పంచుకున్నారు.
సీఎం వైఎస్ జగన్ చిత్రపటాన్ని పట్టుకుని ‘జై జగన్’ అంటూ నృత్యాలు చేశారు. బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ యూనియన్ గౌరవ సలహాదారులు బృందావతి, అధ్యక్షురాలు వై.తులసీ, కార్యదర్శి ఎల్.దేవి, వర్కింగ్ ప్రెసిడెంట్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ ప్రభుత్వం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం
గతంలో అంగన్‌వాడీలు ఉద్యమాలు చేస్తే అణచివేసేందుకే ప్రయత్నాలు జరిగేవి. ఇప్పుడు వైఎస్సార్ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా వ్యవహరించడంతో శాంతియుతంగానే మా సమస్యలు పరిష్కారమయ్యాయి. సీఎం వైఎస్ జగన్ మా 11 డిమాండ్లలో పది ఆమోదించి అమలు చేయడం పట్ల ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం. – మహాలక్ష్మి, చాగల్లు అంగన్‌వాడీ వర్కర్, తూర్పుగోదావరి జిల్లా
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంగళవారం నర్సీపట్నంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ‘థ్యాంక్యూ సీఎం సార్’ కార్యక్రమాన్ని నిర్వహించాం. ప్రభుత్వం మాకు అండగా ఉందనే భరోసా దక్కడంతో సమ్మె విరమించి విధుల్లో చేరాం. – రావాడ వెంకట సత్యవేణి, గొలుగొండపేట–1 అంగన్‌వాడీ వర్కర్, అనకాపల్లి జిల్లా
చంద్రబాబు గుర్రాలతో తొక్కించింది మరవలేం
సమస్యల పరిష్కారానికి ఆందోళన చేసిన అంగన్వాడీలను చంద్రబాబు హయాంలో గుర్రాలతో తొక్కించి, బాష్పవాయువును ప్రయోగించిన చేదు ఘటనను ఎప్పటికీ మరిచిపోలేం. సీఎం జగన్ మాత్రం మమ్మల్ని అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన తీరుతో ఉద్యోగ భద్రత లభించింది. మళ్లీ జగన్ ప్రభుత్వం రావడానికి సహకరిస్తాం. – పి.విజయకుమారి, చాగల్లు అంగన్‌వాడీ వర్కర్, తూర్పుగోదావరి జిల్లా
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
అంగన్‌వాడీల 11 డిమాండ్లలో 10 ఆమోదించి తక్షణం అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటాం. రిటైర్మెంట్ బెనిఫిట్ పెంచడం, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచడం, చనిపోతే మట్టి ఖర్చులు రూ. 20 వేలు ఇవ్వడం వంటి అనేక నిర్ణయాలతో మాకు చాలా మేలు జరుగుతుంది. – అమిడెల సోములమ్మ, చిత్రకాయ పుట్టు అంగన్‌వాడీ వర్కర్, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
మా కోర్కెలు తీర్చిన ఏకైక ప్రభుత్వం ఇది
రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు తీర్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. ఏవో కొన్ని డిమాండ్లు ఆమోదించి, మిగిలినవి తర్వాత చూద్దాం అని ప్రభుత్వం అంటుందని అనుకున్నాం. కానీ, మేము అడిగిన ప్రతీ డిమాండ్‌ను ఆమోదించి మనసున్న ముఖ్యమంత్రి అని వైఎస్ జగన్ మరోమారు నిరూపించారు. – కొర్ర కన్యాకుమారి, వెళ్లపాలెం అంగన్‌వాడీ హెల్పర్, పెదబయలు మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment