► ప్రీ–స్కూల్ కార్యకలాపాలకు అవసరమైన అంశాలను అభివృద్ధి చేయడానికి అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ విడుదల చేసింది. ఆటలు, చదువుకు సంబంధించిన సామగ్రితో ప్రీ–స్కూల్ కిట్‌ను అంగన్‌వాడీ కేంద్రాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
► ఈ కిట్‌లో అన్ని రకాల పుస్తకాలు, వివిధ వస్తువులు ఉంటాయి. కిట్ విలువ రూ.5 వేలు ఉంటుంది. ప్రతి స్కూలుకు ఒక కిట్‌ను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ స్కూళ్లలో సమూల మార్పులు రాబోతున్నాయి. ఆట పాటల ద్వారా చిన్నారులను అలరిస్తూ విద్యా బుద్ధులు నేర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రీ స్కూల్ సిలబస్‌ను రూపొందించింది. ఇకపై రాష్ట్రంలో అంగన్‌వాడీ స్కూళ్లన్నీ వైఎస్సార్ ప్రీ ప్రైమరీ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లుగా మార్పు చెందుతాయి. ప్రీ–స్కూల్ సిలబస్‌కు అనుగుణంగా అన్ని ప్రాజెక్టుల చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ పూర్తయింది. అంగన్‌వాడీ కార్యకర్త హోదాను అంగన్‌వాడీ టీచర్‌గా మారుస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్లకు జనవరి 18 నుంచి 22 మధ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీరిలో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి కూడా చర్యలు తీసుకుంటోంది. యూ ట్యూబ్ లింక్ ద్వారా భాగస్వామ్యం చేసి, వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని ప్రీ–స్కూల్ పిల్లలు సమర్థవంతంగా విద్య నేర్చుకోవటానికి 25 ముఖ్య కార్యకలాపాల కోసం గుర్తించిన, అభివృద్ధి చేసిన వీడియోలపై అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సహాయంతో ఈ వీడియోలను అభివృద్ధి చేశారు.
25 కొత్త కార్యకలాపాలు ఇలా..
క్రమబద్దీకరణ, తోలు బొమ్మలు – కర్రతోలు బొమ్మలు, ఇసుక పేపర్ సంఖ్యలు వర్ణమాలలు – అక్షరమాల, ఫ్లాష్ కార్డుల ద్వారా కథలు, సంఖ్యలు – అక్షరాలు, బిబ్స్ వర్ణమాలలు – సంఖ్యలు – అక్షరమాల (ఒక చిన్నారి మెడలో రంగు రంగుల అక్షరమాల వేసి, ఇతర పిల్లలతో వాటిని చెప్పించడం), వేలు తోలు బొమ్మలు, సౌండ్ బాక్స్‌లు, నంబర్ – వర్డ్ డిస్క్, నంబర్ పిక్చర్ మ్యాచింగ్, రేఖాగణిత ఆకార పెట్టె, సంఖ్య డొమినోస్ (వివిధ రంగుల్లో ఉన్న చుక్కలను గుర్తించి లెక్కపెట్టడం), సంభాషణ కార్డులు, స్టీరియో గ్నోస్టిక్ క్లాత్ బ్యాగ్ (కొన్ని వస్తువులను చూపుతూ ఒక సంచిలో వేశాక, అవి ఏమిటో చెప్పమనడం) ఎన్‌ఎస్సీ (సంఖ్య, ఆకారం, రంగు) బ్లైండ్ ఫోల్డ్ (కళ్లకు గంతలు కట్టాక, వస్తువులను గుర్తించడం), సీవీసీ వర్డ్ బుక్స్, బెల్స్ మోగించడం, ఉడెన్ బోర్డులను ఉపయోగించడం, దువ్వెన కార్యాచరణతో అద్దం (అద్దంలో చూసి చేయడం), మట్టితో కార్యకలాపాలు, తోలు బొమ్మ థియేటర్, సంఖ్య అసోసియేషన్ స్టాండ్ (వివిధ రంగుల్లో ఉన్న నంబర్లపై రింగ్ విసరడం), వ్యతిరేక పదాలు, ఏకవచనం– బహువచన పదాలు, సరదాగా సరిపోల్చండి అనే 25 రకాల యాక్టివిటీలతో ప్రీ స్కూళ్లలో పిల్లల మెదళ్లకు పదును పెట్టనున్నారు.
వినూత్న విధానంలో బోధన కోసం ఓ అంగన్‌వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన వస్తువులు
వచ్చే నెల నుంచి అంగన్‌వాడీ స్కూళ్లు
– ఫిబ్రవరి 1 నుంచి అంగన్‌వాడీ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 55,600 అంగన్‌వాడీ స్కూళ్లలో సుమారు 8.50 లక్షల మంది పిల్లలు చదువుతో పాటు పౌష్టికాహారాన్ని అందుకుంటున్నారు.
– తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు 66.6 శాతం మంది తల్లులు సమ్మతించారు. పట్టణాల్లో కాస్త తక్కువ సుముఖత ఉంది. పల్లెల్లో పూర్తి స్థాయిలో పిల్లను పంపించేందుకు తల్లులు అంగీకరించారు.
– కరోనా సమయాన్ని అధికారులు ఉపయోగించుకున్నారు. స్కూళ్లు మూసి వేయడం వల్ల పిల్లల రేషన్, గుడ్లు, పాలు వంటివి ఇంటి వద్దకు సరఫరా చేయడం వల్ల ఆ సమయంలో మూడేళ్ల వయసున్న (వెయ్యి రోజులు) పిల్లల సంరక్షణపై ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేశారు. ఇప్పుడు ఈ ప్రణాళికను ఉపయోగించాలని నిర్ణయించారు. పిల్లల పౌష్టికాహారానికి ప్రాధాన్యత ఇస్తూనే సైన్స్ పరంగా పిల్లలు ఆడుకుంటూ నేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
యూ ట్యూబ్ చానల్ ఏర్పాటు
– స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిల్లల కోసం యూ ట్యూబ్ చానల్‌ను రూపొందించింది. ఛానల్‌లో టీచర్లకు అవసరమైన ఇంటర్వ్యూలు, పిల్లలకు అవసరమైన కార్యకలాపాలు ఉంటాయి.
ఎర్లీ ఎడ్యుకేషన్‌లో మంచి మార్పులు
పిల్లల్లో నూతన ఆలోచనలు తీసుకురావడంతో పాటు ఆడుకుంటూ అన్ని అంశాలను శాస్త్రీయ పద్ధతిలో నేర్చుకునే విధంగా అంగన్‌వాడీలలో కార్యకలాపాలు రూపొందించాము. ఎర్లీ ఎడ్యుకేషన్‌లో 25 రకాల నూతన పద్ధతులతో బోధన ఉంటుంది. ఇందుకు అనుగుణంగా సిలబస్ రూపొందించాము. స్కూళ్లు మొదలు కాగానే పుస్తకాలు సరఫరా చేస్తాము. పిల్లల్లో పౌష్టికాహార లోపాలను నివారించడంతో పాటు మంచి విద్యను ప్రాథమిక దశలో నేర్చుకునేందుకు ఈ కార్యకలాపాలు ఉపయోగపడతాయి.
– డాక్టర్ కృతిక శుక్ల, డైరెక్టర్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ.
Comments
Please login to add a commentAdd a comment