సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ యూనిట్లను ఆకర్షించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రత్యేక ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)ను ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లాలో మరో ఈఎంసీ వడమాల పేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద సుమారు 500 ఎకరాల్లో అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో ఈఎంసీ–1, ఈఎంసీ–2, శ్రీసిటీ ఈఎంసీలను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈఎంసీ–2 స్కీంలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా కొప్పర్తిలో రూ.730 కోట్ల పెట్టుబడి అంచనాతో 530 ఎకరాల్లో ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, రెండోది పాదిరేడు అరణ్యం వద్ద ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఈఎంసీల సంఖ్య 5కి చేరనుంది.
పీఎల్‌ఐ స్కీంలో మెజార్టీ కంపెనీల ఆకర్షణే లక్ష్యం
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిని తగ్గించి దేశీయంగా తయారీని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉత్పత్తి ఆధారిత రాయితీలు (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్–పీఎల్‌ఐ) పథకం కింద కేంద్రం భారీ రాయితీలను ప్రకటించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 23 కంపెనీలు యూనిట్లు ఏర్పాటు చేయడానికి దరఖాస్తు చేయగా వారం రోజుల క్రితం తొలి దశలో 16 కంపెనీలకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో మెజార్టీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకు వచ్చే విధంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో మరో ఈఎంసీ
Published Tue, Oct 13 2020 3:45 AM | Last Updated on Tue, Oct 13 2020 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment