మృతుడు అప్పారావు ఇంటి వద్ద కుటుంబసభ్యుల నుంచి సమాచారం సేకరిస్తున్న అధికారులు
ఉండి: పశ్చిమ గోదావరి జిల్లాలో సహజ మరణాలను నాటు సారా మరణాలంటూ తెలుగుదేశం పార్టీ, పచ్చ మీడియా చేస్తున్న ప్రచారం అవాస్తవమని మరోసారి రూఢి అయింది. మొన్న జంగారెడ్డిగూడెంలో పైడేటి సత్యనారాయణ మరణాన్ని సారా మరణంగా చిత్రీకరించి టీడీపీ నానా హంగామా చేసింది. అయితే, తమ తండ్రికి అసలు మద్యం అలవాటే లేదంటూ సత్యనారాయణ కుమారుడు, కుమార్తె స్పష్టంగా చెప్పడంతో పచ్చ బ్యాచ్ ఖంగుతింది. ఇప్పుడు ఉండి మండలం ఉణుదుర్రుకు చెందిన బొంతు అప్పారావు మరణాన్ని కూడా టీడీపీ రాజకీయం చేసే ప్రయత్నం చేసింది. అప్పారావు నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.
కొన్ని పత్రికల్లో వచ్చిన ఈ కథనాలపై రెవెన్యూ అధికారులు అప్పారావు కుటుంబీకులను విచారించగా, అదంతా ఉత్తి అబద్ధమేనని తేలింది. అప్పారావు అనారోగ్యంతో చనిపోయాడని తేటతెల్లమైంది. గురువారం ఉణుదుర్రుకు వెళ్లి అప్పారావు భార్య పర్లమ్మ, కుమారుడు అప్పన్నతో మాట్లాడినట్లు డిప్యూటీ తహసీల్దార్ వీరాస్వామినాయుడు చెప్పారు. ఈ నెల 2న అప్పారావు, మరికొందరు మినప కోతలకు గుడివాడ వద్దనున్న పతిపర్రు వెళ్లారన్నారు. 11న అప్పారావు కడుపునొప్పితో గుడివాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారని, అయినా తగ్గకపోవడంతో 12వ తేదీ ఉదయానికి ఉణుదుర్రుకు వచ్చాడని తెలిపారు.
అదేరోజు అప్పారావును తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఏలూరుకు తరలించారన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించినా అప్పటికే అప్పారావు ఆరోగ్యం విషమించడంతో రాత్రి 10 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారని డిప్యూటీ తహసీల్దార్ చెప్పారు. కుటుంబీకుల వద్ద తీసుకున్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
నా తండ్రి అనారోగ్యంతో మరణించాడు
బొంతు అప్పారావు అనారోగ్యంతోనే చనిపోయాడని ఆయన కుమారుడు అప్పన్న చెప్పారు. తన తండ్రి నాటుసారా తాగి మరణించాడంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడం చాలా బాధాకరమని అన్నారు. ‘నా తండ్రి మినప కోతలకు వెళ్ళి అనారోగ్యం పాలయ్యాడే తప్ప నాటుసారా తాగి కాదు. ఆయన, గ్రామానికి చెందిన మరికొందరు ఈ నెల 2న గుడివాడ వద్ద గల పతిపర్రుకు మినప కోతలకు వెళ్ళారు. ఈ నెల 11న నాన్నకు యూరిన్ బ్లాడర్ సమస్యతో కడుపునొప్పి వచ్చిందని అక్కడ వైద్యం చేయించారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మా గ్రామస్తుని సహకారంతో 11వ తేదీ రాత్రి బయల్దేరి 12వ తేదీ ఉదయానికి ఇంటికి వచ్చారు. ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాం. యూరిన్ పూర్తిగా బంద్ కావడంతో అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం ఏలూరు తీసుకువెళ్లాం. అయితే చికిత్స పొందుతూ వెళ్లిన కొద్దిసేపటికే మా నాన్న చనిపోయారు. ఆయన మరణాన్ని ఇలా రాజకీయం చేసి మమ్మల్ని అల్లరిపాలు చేయడం చాలా బాధగా ఉంది’ అని అప్పన్న చెప్పారు.
– బొంతు అప్పారావు కుమారుడు అప్పన్న
Comments
Please login to add a commentAdd a comment