యానాం: యూకో బ్యాంకు మేనేజర్ విస్సాప్రగడ సాయిరత్న శ్రీకాంత్(33) ఆత్మహత్య ఘటన నేపథ్యంలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్‌లో బ్యాలెన్స్ షీట్‌లో రూ.29 లక్షలు తక్కువగా వుందని, ఆ సొమ్మును ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీకాంత్ అనధికారికంగా తీసుకున్నారని పేర్కొంటూ బుధవారం యానాం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై బడుగు కనకారావుకు అసిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలాజ్యోతి ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్రాంచ్ తెరిచేటప్పటికి కంప్యూటర్ నగదు తక్కువగా చూపిందని పేర్కొన్నారు. ఆ కోణంలో బ్యాంకు ఉన్నతాధికారులు సైతం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. బ్రాంచ్‌లో ఉన్న రికార్డుల తనిఖీ, ఆడిటింగ్ సైతం చేసినట్లు తెలిసింది.
మచిలీపట్నంలో రుణ గ్రహీతల అప్పులు తీర్చేందుకు..
మచిలీపట్నం బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసేటప్పుడు ఇచ్చిన రుణాలను సంబంధిత రుణగ్రహీతలు తీర్చకపోవడంతో తానే బ్యాంకు నిబంధనల ప్రకారం తీర్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పలువురి దగ్గర మేనేజర్ శ్రీకాంత్ అప్పులు చేసినట్టు, వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో యానాం బ్రాంచ్‌లో ఘటన చోటు చేసుకుంది.
మా ఒత్తిడి లేదు
యానాం యూకో బ్రాంచ్ మేనేజర్‌పై రుణాల రికవరీ కోసం బ్యాంకు యాజమాన్యం ఒత్తిడి తెచ్చిందన్న వార్తల్లో వాస్తవం లేదని, పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోనల్ మేనేజర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్ మృతికి చింతిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ బ్యాంకు లావాదేవీలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment