సాక్షి, అమరావతి: విద్యారంగంలో నాడు- నేడుపై మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో విద్యావవస్థ వేగంగా మారుతోందన్నారు. గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు ఉండేవని, డ్రాప్ ఔట్ రేట్ పెరుగుతున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే తాము అధికారంలో వచ్చాక విద్యారంగంలో అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు.
‘కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నాం. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ స్కూళ్లను పట్టించుకోలేదు. కుప్పంలో స్కూళ్లు దీనావస్థలో ఉండేవి. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ స్కూళ్లను గాలికొదిలేశారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశాం. మనబడి నాడు-నేడు ద్వారా 57వేల స్కూళ్లు, హాస్టళ్లు అభివృద్ధికి రూ.16వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఉన్నత విద్యను హక్కుగా మార్చాం.
మొదటి దశలో 15717 స్కూళ్లలో నాడు-నేడు పూర్తయింది. రెండో దశలో భాగంగా 22వేల స్కూళ్లలో అభివృద్ధి చేస్తున్నాం. నిర్మాణంపైనే కాదు నిర్వహణపైనా దృష్టి పెట్టాం. టాయిలెట్లు, స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఫండ్‌ను ఏర్పాటు చేశాం. విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా పిల్లలకు అండగా నిలుస్తున్నాం. గతంలో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ అట్టడుగున ఉన్న పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడులకు పునర్ వైభవం కల్పించాం. అమ్మ ఒడి పథకం ఓ విప్లవాత్మక ముందడుగు. దేశంలో ఇలాంటి పథకం ఎక్కడా కూడా లేదు. అమ్మ ఒడితో మూడేళ్లలో 84లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరింది. అమ్మ ఒడి పథకానికి రూ.17వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టాం.
జగనన్న గోరుముద్ద పథకంతో పౌష్టికాహారం అందిస్తున్నాం. గోరుముద్ద పథకానికి ఏడాదికి రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యాకానుక కింద రూ.886 కోట్లు ఖర్చు చేస్తున్నాం. విద్యాకానుకలో భాగంగా విద్యార్థులకు ట్యాబ్‌లు అందిస్తున్నాం. 8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లు ఇస్తున్నాం. సరుకుల బిల్లులను కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. మన ప్రభుత్వం వచ్చాక ఆయాల గౌరవ వేతనం వెయ్యి నుంచి 3వేలకు పెంచాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment