సాక్షి, విశాఖపట్నం: ఏపీలో ఒంటరి పోరుకు బీజేపీ మానసికంగా సిద్ధమవుతోందా?. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేస్తున్న వ్యాఖ్యలను పరిశీలిస్తే.. ఆ విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో జనసేన పొత్తుకు సైతం దూరంగా జరిగేలా ఆయన ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం.
ఇటీవల జగిత్యాల కొండగట్టు పర్యటనలో ‘బీజేపీతోనే ఉన్నా’ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. బీజేపీ మాత్రం ఏపీలో పవన్‌తో పొత్తు విషయంలో డైలమా ప్రదర్శిస్తోంది. ఒకప్పుడు జనసేనతోనే పొత్తు అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చిన సోము వీర్రాజు వాయిస్‌లో ఒక్కసారిగా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా..
గత మూడు రోజులుగా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బీజేపీ ఏపీ చీఫ్.. ‘‘కలిసి వస్తేనే జనసేనతో పొత్తు.. లేదంటే జనంతోనే మా పొత్తు’’ అంటూ ప్రకటించడం గమనార్హం. పైగా ప్రజలను రోడ్లపై వదిలేసే పార్టీలతో పొత్తు ఉండదంటూ వ్యాఖ్యల ద్వారా పొత్తు విషయంలో ఊగిసలాట ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇందుకు టీడీపీనే ప్రధాన కారణమని చెప్పనక్కర్లేదు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ ప్రసంగాలు చేస్తున్న పవన్ కల్యాణ్, కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతోనే చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ-బీజేపీలను ఒకచోట చేర్చేందుకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ తీరుపైనే బీజేపీలో అనుమానాలు మొదలైనట్లు స్పష్టమవుతోంది.
పైగా టీడీపీతో కలిసి ఏమాత్రం ముందుకు వెళ్లడం ఇష్టంలేని బీజేపీ అవసరమైతే జనసేనాని కూడా దూరం పెట్టేందుకు సిద్ధమైంది!. ఈ క్రమంలో జనసేన కలిసి రాకపోయినా.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామనే రీతిలో సోము వీర్రాజు వ్యాఖ్యలు చేశారన్నది స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment