సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. ఎన్నికలు జరగనున్న మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఆయన సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సీపీఐ, సీపీఎం, వైఎస్సార్‌సీపీ ప్రతినిధులకు తుది ఓటర్ల జాబితా అందచేశారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ అర్హత ఉండి తుది జాబితాలో పేరులేని ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నామినేష్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి వెన్నపూస పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ ఐదుస్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది.
ఇదీ చదవండి: విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు
Comments
Please login to add a commentAdd a comment