Chief Electoral Officer of the state
-
నామినేషన్ల గడువుకు 10 రోజుల ముందువరకు ఓటర్ల నమోదు
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. ఎన్నికలు జరగనున్న మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీలతో ఆయన సోమవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ ప్రతినిధులకు తుది ఓటర్ల జాబితా అందచేశారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ అర్హత ఉండి తుది జాబితాలో పేరులేని ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. నామినేష్ల దాఖలు గడువుకు పదిరోజుల ముందువరకు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తుది ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శ్రీకాకుళం–విజయనగరం–విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ గోపాలరెడ్డి వెన్నపూస పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పదవీకాలం కూడా మార్చి 29తో ముగుస్తోంది. దీంతో ఈ ఐదుస్థానాలకు ఎన్నికలు నిర్వహిచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది. ఇదీ చదవండి: విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులకు సీఎం అభినందనలు -
తెలంగాణలో ఓటర్లు ఎంత మందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,52,56,474 మంది పురుషులు, 1,50,98,685 మంది మహిళలు, 1,735 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,03,56,894 మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2022లో రూపొందిం చిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,03,56,665 మంది ఓటర్లుండగా, సవరణలో భాగంగా 2,27,226 మంది పేర్లను కొత్తగా చేర్చారు. వివిధ కారణాలతో మరో 2,26,997 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. 18–19 ఏళ్ల వయసున్న 1,36,496 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటర్ల జాబితాలో స్థానం పొందారు. మరో 14,661 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. -
ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండండి
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం సర్వసన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ జిల్లాల యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈవీఎంలు, వీవీప్యాట్లు తదితర యంత్ర పరికరాలను సన్నద్ధం చేసుకోవాలని, సాంకేతిక అంశాలపై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలన్నారు. శనివారం సచివాలయం నుంచి 13 జిల్లాల అధికారులతో ఈవీఎం, వీవీప్యాట్, న్యూ సువిధా, 1950 కాల్ సెంటర్ అంశాలపై అదనపు సీఈవోలు సుజాతా శర్మ, వివేక్ యాదవ్‌లతో కలిసి ద్వివేదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికపరమైన అంశాలపై జిల్లా యంత్రాంగం స్పందించి ఈ రోజే నివేదికను సమర్పించాలన్నారు. ఎఫ్‌ఎల్‌సిపై నివేదికను సత్వరమే అందజేయాలన్నారు. డిఫెక్టివ్ పరికరాలను ఫ్యాక్టరీకి తిప్పి పంపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయ పరికరాలు కేటాయిస్తారని తెలిపారు. 1950 కి సంబంధించి జిల్లా స్థాయిలో నిర్వహించే డిస్ట్రిక్ కాల్ సెంటర్లకు ఇక నుంచి జిల్లా రెవెన్యూ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని ఆదేశించారు.1950 జిల్లా కాల్ సెంటర్లు శనివారం, ఆదివారం కూడా పనిచేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఒక్కో షిఫ్టులో ఇద్దరు పనిచేస్తున్నారని, మరో ముగ్గురిని తీసుకుని ఐదుగురితో పనిచేసేలా ఏర్పాటు చేయాలని ద్వివేదీ ఆదేశించారు. 1950 కి వచ్చే ప్రతి కాల్కి స్పందన ఉండాలని, ప్రజలు అడిగిన ప్రశ్నలపై నిర్ణీత కాలవ్యవధిలో జిల్లా యంత్రాంగం పరిష్కరించాలని ఆయన సూచించారు. అదనపు సీఈవో వివేక్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల నిరంతర పర్యవేక్షణలో భాగంగా న్యూ సువిధ అప్లికేషన్‌ను రూపొందించినట్లు చెప్పారు. నామినేషన్ వివరాలతో పాటు మీడియా మానిటరింగ్ సర్టిఫికెట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ తదితర శాఖలకు చెందిన ప్రతి ఒక్క అనుమతులను ఆన్లైన్లో ఇచ్చే వెసులుబాటు కల్పించి మరింత సులభతరం చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో భాగంగా ప్రతి అనుమతిని న్యూ సువిధా ద్వారా ఇవ్వాలని ఆయన సూచించారు. ఆయా అనుమతుల కోసం 48 గంటలు ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. న్యూ సువిధా యాప్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో గ్రూప్–1 అధికారిని నియమించాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్ధులు న్యూ సువిధా మొబైల్ యాప్ ద్వారా అనుమతులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. దరఖాస్తు స్టేటస్‌ను మొబైల్లో తెలుసుకోవచ్చునని ఆయన చెప్పారు. -
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గోపాలకృష్ణ ద్వివేదీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియాను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారిని బదిలీ చేయాలని నిర్ణయించడానికి ఓటర్ల జాబితాల్లో అవకతవకలు, బోగస్ ఓటర్లను తొలగించడంలో అలసత్వం తదితరాలే కారణమని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు లక్షల సంఖ్యలో బోగస్ ఓటర్లను చేర్పించడం, ప్రతిపక్షానికి మద్దతుదారులైన ఓటర్లను జాబితాల నుంచి తొలగించడం వంటి అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసోడియాను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం స్వయంగా నిర్ణయం తీసుకుంది. ఆయన స్థానంలో నియమించడానికి ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా పంపాలని కోరింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జాబితా పంపింది. వచ్చే ఎన్నికలను నిష్పక్షపాతంగా, సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా 1993 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల ఏర్పాట్లును ప్రారంభించిన ఈసీ రాష్ట్ర శాసన సభతోపాటు లోక్‌సభ సాధారణ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు ప్రారంభించింది. ఇందులో భాగంగా సొంత జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడి నుంచి బదిలీ చేయాలని, అలాగే నాలుగేళ్లలో మూడేళ్లు ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. ఈ మేరకు బదిలీల మార్గదర్శకాలను గురువారం పంపించింది. ఈ బదిలీల ప్రక్రియను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలని, సంబంధిత నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలని పేర్కొంది. సొంత జిల్లాలో లేదా సొంత నియోజవర్గాల్లో పనిచేస్తున్న జిల్లా ఎన్నికల అధికారి(కలెక్టర్) రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, ఐజీ, డీఐజీ, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరూ నాలుగేళ్లలో మూడేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తుంటే, వారిని కూడా అక్కడ నుంచి బదిలీ చేయాలని వెల్లడించింది. గతంలో ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఈసారి ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులు నమోదైన అధికారులను ఎన్నికల విధులకు వినియోగించరాదని తెలిపింది. ఓటర్ల జాబితా సవరణల్లో పాల్గొంటున్న అధికారులను కూడా జాబితాను ప్రకటించిన వెంటనే బదిలీ చేయాలని పేర్కొంది. ఆరు నెలల్లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది. పదవీ విరమణ చేసిన వారిని మళ్లీ సర్వీసులోకి తీసుకుంటే వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తేల్చిచెప్పింది. మార్గదర్శకాల మేరకు బదిలీలు చేసినట్లుగా ఎన్నికల అధికారులందరూ జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ప్రధాన అధికారికి డిక్లరేషన్ సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం సాయంత్రమే ద్వివేదీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ కేడర్‌కు చెందిన ద్వివేదీ కేంద్ర ప్రభుత్వంలో గత ఏడాది వరకూ సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అలాగే సాధారణ పరిపాలన(సర్వీసెస్) శాఖ ముఖ్య కార్యదర్శిగానూ(ఇన్చార్జి) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ద్వివేదీ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ అందరి సహకారంతో నిష్పక్షపాతంగా, సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలతోపాటు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలు ఉంటే సరిచేస్తామన్నారు. తప్పులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎప్పటికప్పుడు తమ పేరు ఓటర్ల జాబితాలో ఉందో లేదో తెలుసుకోవాలని సూచించారు. ఓటు విషయంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ నెంబర్ ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులతో శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై, తీసుకోవాల్సిన చర్యలపై గోపాలకృష్ణ ద్వివేదీ అఖిలపక్ష నాయకులతో చర్చించనున్నారు. -
చంద్రబాబుకు బాకా ‘పాంచజన్యం’
‘ఈనాడు’ అసత్య కథనాలపై సీఈవోకు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు ‘పాంచజన్యం’ కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని వినతి డిప్యూటీ సీఈవో దేవసేనకి ఫిర్యాదుపత్రం అందజేసిన వాసిరెడ్డి పద్మ హైదరాబాద్: టీడీపీకి కొమ్ముకాస్తూ ఈనాడు దినపత్రిక ‘పాంచజన్యం’ పేరుతో చంద్రబాబుకు బాకా ఊదుతూ ప్రచురిస్తున్న అసత్య కథనాలను ‘చెల్లింపు వార్తలు’ (పెయిడ్ ఆర్టికల్స్)గా పరిగణించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి ఫిర్యాదు చేసింది. ఈమేరకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ పేరిట ఉన్న ఫిర్యాదుపత్రాన్ని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిప్యూటీ సీఈవో దేవసేనకు అందజేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడా రు. ఈనాడు ఎన్నికల కథనాల పేరుతో పేజీలకు పేజీలుగా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం కక్కడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘ప్రత్యేకించి ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ రోజున దురుద్దేశంతో, కుట్ర పూరి తంగా జగన్‌పై విషం కక్కుతూ ఈనా డు ప్రచురించిన కథనంపై సీఈవోకు పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం. చంద్రబాబును, జగన్‌తో పోల్చుతూ పేజీ అంతా అబద్ధపు రాతలతో నింపేశారు. జగన్‌ను కించపరిచేలా, ప్రజల్లో పలుచన చేయాలనే దురుద్దేశంతోనే అలా ప్రచురించారు. బాబును అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఎజెండాతోనే ఆ పత్రిక పనిచేస్తోంది. కనీసం రాష్ట్ర విభజన సమయంలో ప్రజల తరఫున మాట్లాడిన పాపానపోని ఆ పత్రిక.. ప్రజల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతపై విషం కక్కడానికి మాత్రం అక్షరాలను తాకట్టు పెట్టి బాబుకు ఊడిగం చేస్తోంది. టీడీపీకి బాకాలాగా ‘పాంచజన్యం’ వస్తోంది. ఈ ఎన్నికల స్పెషల్‌ను చెల్లింపు కథనాలుగా పరిగణించి టీడీపీ ఎన్నికల ఖర్చు లో చూపాలని కోరాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక టీడీపీకి అధికార పత్రికగా, కరపత్రంగా మారింది. ఇది మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మా ఫిర్యాదును కచ్చితంగా ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది..’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. సీఈవో భన్వర్‌లాల్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సీఈవో దేవసేనకి ఫిర్యాదు అందించామని వెల్లడించారు. ‘సాక్షి’ వాస్తవాలే రాస్తోంది..: ‘సాక్షి’ ప్రత్యేకించి వ్యక్తులకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేయడంలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. గణాంకాల ప్రకారమే చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? అనే అంశాలపై ఆధార సహితంగా సాక్షిలో కథనాలు వస్తున్నాయని వివరించారు. ‘ఏది నిజం’ గురించి విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘అబద్ధపు రాతలకు సమాధానంగా నిజాలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నందున ఆ శీర్షికతో వాస్తవాలే రాస్తున్నారు. ఎవరిమీదో విషం కక్కాలనో, దుష్ర్పచారం కోసమో చేయడంలేదు. కానీ ఈనాడు దినపత్రిక వాస్తవాలను దాచి, బాబు పాలనను రంగుల ప్రపంచంగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన టీడీపీకి ప్రాణం ఊదే పని రామోజీ పత్రిక చేస్తోంది’’ అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. -
శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం
* ఆమె మరణించినందు వల్ల ఉప ఎన్నిక నిర్వహిస్తాం * ఆళ్లగడ్డ ఎన్నికపై అనుమానాలు నివృత్తి చేసిన ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం ఎన్నికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరగనుండగా, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో పేర్కొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26వ తేదీన లేఖ రాశారు. దీనిపై ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎఫ్.విల్ఫ్రెడ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభానాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యాలట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు. చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించినవారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు కనుక పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు. -
46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్
సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి డబ్బు, మద్యం పంపిణీ చేస్తే 8790499899 కు సమాచారమివ్వాలి సీమాంధ్రలో రేపటి నుంచి ఓటర్ స్లిప్‌ల పంపిణీ తెలంగాణలో 25 కల్లా స్లిప్‌లు పంపిణీ పూర్తి ఎక్కువ అభ్యర్థులు ఉన్న చోట అదనంగా ఈవీఎంలు 90 శాతం పోలింగ్ జరగాలని కమిషన్ టార్గెట్ ఓటును అమ్ముకోవద్దు. బ్రహ్మాస్త్రం ఓటు ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం హైదరాబాద్: రాష్ర్టంలోని 79 వేల పోలింగ్ కేంద్రాలకు గాను 46 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇందులో రవాణా సౌకర్యం లేని మారు మూల ప్రాంతాల్లోని 156 పోలింగ్ కేంద్రాల్లో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. బీఎస్ఎన్ఎల్ అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన లైవ్ వెబ్ కాస్టింగ్‌ను ఖరారు చేశారు. డెరైక్ట్ శాటిలైట్ టెలిఫోన్ స్టేషన్ ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల లోపల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కెమెరాల్లో బంధించనున్నారు. సీమాంధ్రలో ఓటర్ల స్లిప్‌ల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 25వ తేదీ కల్లా ఓటర్ల స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సోమవారం భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు.. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. చాలా స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ రోజున వాస్తవంగా ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులున్నారో తేలుతుంది. అప్పుడు 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఈవీఎంలు అధికంగా కావాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేస్తాం. తెలంగాణ జిల్లాల్లోని 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాల్లో 8 పార్లమెంట్, 31 అసెంబ్లీ స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందుకోసం అదనంగా 16,200 ఈవీఎంలను సిద్ధం చేశాం. ఏ స్థానంలోనైనా 64 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులుంటేనే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను వినియోగించాల్సి వస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు చేయాలని టార్గెట్ పెట్టింది. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కమిషన్ పెట్టిన టార్గెట్‌ను అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఓటుకు నోటు తీసుకోవద్దు. ఐదేళ్లకోసారి వచ్చే బ్రహ్మాస్త్రం ఓటు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నందున డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను పెంచుతున్నాం. ఇప్పటి వరకు 108 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నాం. 13,300 మందిని అరెస్టు చేశారు. 8043 బెల్ట్‌షాపులను మూయించాం. ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో 400 కంపెనీలు కేంద్ర సాయుధ బలగాలు వినియోగిస్తున్నాం. ఇప్పటికే సగం పైగా కంపెనీలు వచ్చాయి. వీరిని కూడా డబ్బు, మద్యం నిరోధించేందుకు వినియోగిస్తాం.మద్యం, డబ్బు పంపిణీపై ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలి. నియోజకవర్గం నంబర్ వేసి సమాచారాన్ని 8790499899 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే నిమిషాల్లో ఆ ప్రాంతానికి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది. అఫిడవిట్స్‌లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ఆ కేసు న్యాయస్థానంలో తేలాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి ఆ కేసు ఎటువంటి ఆటకం కలగదు. తెలంగాణలో 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్ర జిల్లాల్లో మే 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసి ఎన్నికలయ్యే వరకూ సీమాంధ్ర రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులు లేకుండా సీమాంధ్ర అభ్యర్థుల పేరున టీవీల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో సీమాంధ్ర అభ్యర్థుల పేరుతో చేసిన ప్రసారాల వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు. -
డబ్బు తీసుకునే ఓటర్లపైనా కేసులు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరిక హైదరాబాద్: ఓట్లు వేసేందుకు డబ్బు తీసుకునే వారిపైనా కేసులు పెడతామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్ హెచ్చరించారు. డబ్బు పంచడానికి వచ్చే వారి ముఖాన్నే దానిని కొట్టాలని, మంచి వారికే ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించాలని ప్రజల ను కోరారు. తద్వారా దేశంలో రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఆకాంక్షించారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు - ఓటరు చైతన్య కార్యక్రమాలపై ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం (ఏపీజేఎఫ్) ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్రంలోనే అత్యధికంగా డబ్బు, మద్యం పట్టుబడటానికి బహుశా ఇక్కడ పలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్) ఎన్నికలు ఉండటం కారణం కావచ్చునని భన్వర్‌లాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలనే చైతన్యం ప్రజల్లో బాగా వచ్చిందని, గతంలో 30-35 లక్షల కొత్త ఓట్లు నమోదు కాగా ఈ పర్యాయం ఏకంగా 90 లక్షల ఓట్లు నమోదు కావడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈసారి రాష్ట్రంలో 85 నుంచి 90 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని ఆశిస్తున్నామని అన్నారు. -
ఏ పార్టీ కోసం పనిచేసినా కఠిన చర్యలు
ఉద్యోగులకు భన్వర్‌లాల్ హెచ్చరిక పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు పెంపు ఈ నెల 12 నుంచి సీమాంధ్రలో నామినేషన్లు ప్రారంభం సమాంధ్రల లో నామినేషన్లకు ఐదు రోజులే, మిగతా మూడు రోజులు సెలవులే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కుడి చేతి చూపుడు వేలుకు ఇంక్ కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా పరోక్షంగా పనిచేసినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ, అలాగే మే 7వ తేదీన పోలింగ్ జరిగే సీమాంధ్రలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలను వేస్తామన్నారు. ఎండకు ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపిన మరికొన్ని వివరాలు... ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీరు, విద్యుత్, టాయిలెట్, ర్యాంపు సౌకర్యాలతో పాటు ఓటర్లు ఎండబారిన పడకుండా షామియానాలు ఏర్పాటు. పోలింగ్ సమయం కూడా గతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంది. ఇప్పటి ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే 19వ తేదీ వరకు నామినేషన్లను సమయం ఉన్నప్పటికీ మధ్యలో మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో సీమాంధ్రలో నామినేషన్ల స్వీకరణ ఐదు రోజులే ఉంటుంది. 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్కర్ జయంతి, 18వ తేదీ గుడ్‌ఫ్రైడే సెలవులు వచ్చాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు కుడి చేతి చూపుడు వేలుపై ఇంక్ మార్క్ వేస్తారు. ఈ ఇంక్ మార్క్ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేవరకు చెరిపేయకుండా చూస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1800 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.90 కోట్ల నగదు, 70 కేజీలు బంగారం, 290 కేజీల వెండి, 3,11,764 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాయి. తెలంగాణలో మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సీమాంధ్రలో ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోలింగ్ తేదీలకు ముందే ఓటర్ స్లిప్‌లతో పాటు, గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. పోలింగ్ రోజు ఓటర్లు గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లతో పాటు కమిషన్ పేర్కొన్న మరో 16 రకాల కార్డులను చూపించి ఓటు వేయవచ్చు.