46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ | Live web casting of the 46 centers | Sakshi
Sakshi News home page

46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్

Published Tue, Apr 22 2014 12:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ - Sakshi

46 వేల కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్

సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి
 
డబ్బు, మద్యం పంపిణీ చేస్తే 8790499899 కు సమాచారమివ్వాలి
సీమాంధ్రలో రేపటి నుంచి ఓటర్ స్లిప్‌ల పంపిణీ
తెలంగాణలో  25 కల్లా స్లిప్‌లు పంపిణీ పూర్తి
ఎక్కువ  అభ్యర్థులు ఉన్న చోట అదనంగా ఈవీఎంలు
90 శాతం పోలింగ్ జరగాలని కమిషన్ టార్గెట్
ఓటును అమ్ముకోవద్దు. బ్రహ్మాస్త్రం ఓటు
ఫిర్యాదు చేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం

 
హైదరాబాద్: రాష్ర్టంలోని 79 వేల పోలింగ్ కేంద్రాలకు గాను 46 వేల పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. ఇందులో రవాణా సౌకర్యం లేని మారు మూల ప్రాంతాల్లోని 156 పోలింగ్ కేంద్రాల్లో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుందని ఆయన చెప్పారు. బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సోమవారం సమావేశమైన ఆయన లైవ్ వెబ్ కాస్టింగ్‌ను ఖరారు చేశారు. డెరైక్ట్ శాటిలైట్ టెలిఫోన్ స్టేషన్ ద్వారా ఈ పోలింగ్ కేంద్రాల లోపల జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను కెమెరాల్లో బంధించనున్నారు. సీమాంధ్రలో ఓటర్ల స్లిప్‌ల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ జిల్లాల్లో ఈ నెల 25వ తేదీ కల్లా ఓటర్ల స్లిప్‌ల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. సోమవారం భన్వర్‌లాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన చెప్పిన వివరాలు..

 సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన పూర్తి అయింది. చాలా స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఆ రోజున వాస్తవంగా ఏ నియోజకవర్గంలో ఎంత మంది అభ్యర్థులున్నారో తేలుతుంది. అప్పుడు 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో ఈవీఎంలు అధికంగా కావాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేస్తాం.
 
తెలంగాణ జిల్లాల్లోని 17 పార్లమెంట్, 119 అసెంబ్లీ స్థానాల్లో 8 పార్లమెంట్, 31 అసెంబ్లీ స్థానాల్లో 15 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందుకోసం అదనంగా 16,200 ఈవీఎంలను సిద్ధం చేశాం. ఏ స్థానంలోనైనా 64 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులుంటేనే ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పత్రాలను వినియోగించాల్సి వస్తుంది.

 కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదు చేయాలని టార్గెట్ పెట్టింది. ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. స్వేచ్ఛగా ప్రశాంతంగా ఓటు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. కమిషన్ పెట్టిన టార్గెట్‌ను అందరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఓటుకు నోటు తీసుకోవద్దు. ఐదేళ్లకోసారి వచ్చే బ్రహ్మాస్త్రం ఓటు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నందున డబ్బు, మద్యం ప్రభావాన్ని అరికట్టడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను పెంచుతున్నాం. ఇప్పటి వరకు 108 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నాం. 13,300 మందిని అరెస్టు చేశారు. 8043 బెల్ట్‌షాపులను మూయించాం.
 
ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో 400 కంపెనీలు కేంద్ర సాయుధ బలగాలు వినియోగిస్తున్నాం. ఇప్పటికే సగం పైగా కంపెనీలు వచ్చాయి. వీరిని కూడా డబ్బు, మద్యం నిరోధించేందుకు వినియోగిస్తాం.మద్యం, డబ్బు పంపిణీపై ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలి. నియోజకవర్గం నంబర్ వేసి సమాచారాన్ని 8790499899 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ చేయాలి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంటుంది. సమాచారం వచ్చిన వెంటనే నిమిషాల్లో ఆ ప్రాంతానికి ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్తుంది. అఫిడవిట్స్‌లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేస్తాం. ఆ కేసు న్యాయస్థానంలో తేలాల్సి ఉంటుంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి ఆ కేసు ఎటువంటి ఆటకం కలగదు.

 తెలంగాణలో 28వ తేదీ సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. సీమాంధ్ర జిల్లాల్లో మే 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసి ఎన్నికలయ్యే వరకూ సీమాంధ్ర రాజకీయ పార్టీలు ఎన్నికల గుర్తులు లేకుండా సీమాంధ్ర అభ్యర్థుల పేరున టీవీల్లో ప్రచారం చేసుకోవచ్చు. ఆ ఎన్నికల సమయంలో సీమాంధ్ర అభ్యర్థుల పేరుతో చేసిన ప్రసారాల వ్యయాన్ని అభ్యర్థుల ఖాతాలో జమ చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement