నేటితో రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలకు తెర!
- సోమవారం సాయంత్రం నుంచి అమలు
- అన్ని టీవీ చానళ్లకూ నోటీసులు
- వీడియో కాన్ఫరెన్స్‌లో భన్వర్‌లాల్ ఆదేశం
- ఆచరణ సాధ్యం కాదంటున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్:ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా సోమవారం సాయంత్రంతో తెలంగాణలో ప్రచార గడువు ముగుస్తున్న నేపథ్యంలో సీమాంధ్రలో జరిగే రాజకీయ నాయకుల ప్రచారాన్ని వార్తా చానళ్లు(టీవీలు) ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ) భన్వర్‌లాల్ ఆదివారం ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన విసృ్తతస్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో పోలీసు, రెవెన్యూ అధికారులకు భన్వర్‌లాల్ ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు.
నిబంధనల ప్రకారం పోలింగ్ జరగడానికి 48 గంటల ముందు నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రచార ఘట్టానికి తెరపడుతుంది. దీన్ని పక్కాగా అమలు చేయడంతో పాటు బల్క్ ఎస్సెమ్మెస్‌లు, వాయిస్ కాల్స్‌ను నియంత్రించడానికి పోలీసు, రెవెన్యూ విభాగాలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ మేరకు ఆయా సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లకు లేఖలు రాస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటి సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యక్ష ప్రసారాల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు భన్వర్‌లాల్ పైవిధంగా ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణలో ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగుస్తున్నప్పటికీ.. సీమాంధ్రలో మే 4వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువుంది.
మరోపక్క తెలంగాణలో ఎన్నికలు జరిగే 30వ తేదీనే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తిరుపతిలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటున్నారు. అదేవిధంగా ఇతర పార్టీల కీలక నేతలు సైతం అదేరోజు అక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయా నేతలు గుప్పించే హామీలు, లేవనెత్తే అంశాలు తెలంగాణలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని సీఈఓ అభిప్రాయపడ్డారు. దీనిని కట్టడి చేయడం కోసం ఎన్నికల కోడ్‌తో పాటు సంబంధిత చట్టాల్లోని అంశాలను ప్రస్తావిస్తూ వార్తా చానళ్ల యాజమాన్యాలకు సోమవారం నోటీసులు జారీ చేయాలని స్పష్టం చేశారు.ప్రాంతీయ చానళ్ల ప్రధాన కార్యాలయాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నందున నగర పోలీసులకు ఈ బాధ్యతలను అప్పగించారు.
అయితే, ఈ విధానం ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలు కాలేదని పోలీసులు తెలిపారు. ఈ రకంగా నోటీసులు ఇచ్చినా ఫలితం ఉండదని వారు అంటున్నారు. దీన్ని అమలు చేయాలంటే దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో పోలింగ్ జరిగిన ప్రతిసారీ జాతీయ చానళ్ల ప్రసారాలను ఆపాల్సి ఉంటుందని, మరోపక్క ఇంత తక్కువ సమయంలో కేవలం పోలీసు విభాగం నోటీసులు ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు ఆపడమనేది ఆచరణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు.
అయితే, అమలు సాధ్యాసాధ్యాలను పక్కనబెట్టి.. సీఈఓ ఇచ్చిన ఆదేశాలను అన్ని వార్తా చానళ్ల యాజమాన్యాలకు తప్పనిసరిగా తెలియజేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఎన్నికల సంఘం నుంచి మరోసారి స్పష్టత తీసుకోవడంతో పాటు రాజకీయ ప్రత్యక్ష ప్రసారాలపై సీఈఓ ఇచ్చిన ఆదేశాలను సంబంధిత సెక్షన్ల సహితంగా చానళ్ల దృష్టికి తీసుకెళ్లి, లిఖిత పూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలింగ్ ఏర్పాట్లపై నగర కమిషనర్ అనురాగ్ శర్మ సోమవారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.