సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లలో వేగం పెరిగింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈవో) ఏర్పాట్లలో నిమగ్నమైంది. రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు అధికారులు, సిబ్బందిని ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఈవో రజత్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సెప్టెంబర్ 11న కేంద్ర ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్ వస్తోందని.. ఆ బృందానికి ఇచ్చే నివేదికకు అవసరమైన అంశాలు పంపాలని ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలన్నారు.
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారు సొంత జిల్లాలో ఉండొద్దని.. ఆ ప్రకారం జాబితా రూపొందించాలని సూచించారు. ఒకే జిల్లాలో వరుసగా మూడేళ్ళుగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయాల్సి ఉంటుందని.. ఈ కేటగిరిలోని అధికారులు, సిబ్బంది వివరాలు సేకరించాలన్నారు. 2018 డిసెంబర్ 31 వరకు వరుసగా మూడేళ్లు పూర్తయ్యే వారికి ఈ నిబంధన వర్తిస్తుందని.. పదోన్నతితో అదే జిల్లాల్లో ఉన్నా బదిలీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సీఈవో ఆదేశాల మేరకు బదిలీ చేయాల్సిన అధికారులు, సిబ్బంది జాబితాను కలెక్టర్లు సిద్ధం చేస్తున్నారు.
2.50 లక్షల మంది సిబ్బంది అవసరం
2014 ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెరిగింది. దీంతో ఎన్నికల నిర్వహణకు 2.50 లక్షల మంది సిబ్బంది, వారి విధుల పర్యవేక్షణకు మరో 25 వేల మంది అధికారులు అవసరమవుతారని జిల్లాల నుంచి సీఈవోకు ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని మరోసారి పరిశీలించి కచ్చితమైన వివరాలు సిద్ధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 32,573 పోలింగ్ కేంద్రాలు అవసరమని ఈసీ ఐకి టీఎస్‌సీఈవో కార్యాలయం ప్రతిపాదనలు పంపింది. దీనికి ఈసీఐ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఐదుగురు చొప్పున 1.62 లక్షల మంది సిబ్బంది.. ఈవీఎంల నిర్వహణ, ఓట్ల లెక్కింపు కోసం మరో 1.90 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని అంచనా వేశారు.
‘ముందస్తు’కు ఏర్పాట్లు షురూ!
Published Sun, Sep 9 2018 1:18 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment