శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం | Shobha Nagi Reddy will get majority votes, declared as Winner | Sakshi
Sakshi News home page

శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం

Published Tue, Apr 29 2014 8:48 PM | Last Updated on Mon, Oct 22 2018 5:46 PM

శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం - Sakshi

శోభకు ఎక్కువ ఓట్లు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తాం

* ఆమె మరణించినందు వల్ల ఉప ఎన్నిక నిర్వహిస్తాం
* ఆళ్లగడ్డ ఎన్నికపై అనుమానాలు నివృత్తి చేసిన ఎన్నికల కమిషన్
 
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ శాసనసభా నియోజకవర్గం ఎన్నికపై ఏర్పడిన సందిగ్ధతకు తెరపడింది. ఈ నియోజకవర్గానికి యథావిధిగా ఎన్నిక జరగనుండగా, ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ పడిన దివంగత శోభా నాగిరెడ్డికి ఎక్కువ ఓట్లు పోలైతే ఆమెను గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే ఆమె మరణించినందు వల్ల  ఆ స్థానానికి తిరిగి ఉపఎన్నిక నిర్వహిస్తామని తెలిపింది. నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణించిన తర్వాత జరిగే పోలింగ్‌లో ఆ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు పోలైతే గెలిచినట్టుగా ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వివరణ ఇస్తూ పంపిన సమాచారంలో  పేర్కొంది.

ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఆమె పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బ్యాలట్ పత్రాల్లో ముద్రించామని, అందువల్ల మరణించిన అభ్యర్థికి ఓట్లేస్తే అవి ’నోటా’ ఓట్లు (ఎవరికీ చెందని ఓట్లు)గా పరిగణించబోమని కమిషన్ స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన శోభా నాగిరెడ్డి ఈ నెల 24న మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటినుంచీ ఈ ఎన్నిక తీరుపై ప్రజల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ కోశాధికారి పి.కృష్ణమోహన్‌రెడ్డి ఈ అంశంపై  కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ ఈ నెల 26వ తేదీన లేఖ రాశారు.

దీనిపై ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎఫ్.విల్‌ఫ్రెడ్ వైఎస్సార్ కాంగ్రెస్‌కు రాసిన లేఖలో... ‘మృతి చెందిన శోభానాగిరెడ్డి పేరును ఇప్పటికే అభ్యర్థుల జాబితాలో పొందుపరిచాం. బ్యాలట్ పత్రాల్లోనూ ఈవీఎంపై ఉన్న బ్యాలట్ పత్రంపై కూడా ఆమె పేరును చేర్చాం. ఎన్నికల ఫలితాల ప్రకటన అనేది 1961 సంవత్సరపు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనల్లోని 64వ నిబంధన ప్రకారం బ్యాలట్ పత్రంపై ఉన్న ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఇక్కడ ‘అభ్యర్థి’ అంటే పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్న వారు అని అర్థం. అందువల్ల మరణించిన వ్యక్తి కూడా 64వ నిబంధన కింద అభ్యర్థే అవుతారు.

చనిపోయిన వ్యక్తికి వేసిన ఓట్లు ‘నోటా’ ఓట్లుగా పరిగణించడానికి గాని, మిగతా అభ్యర్థుల  కన్నా మృతి చెందిన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చినపుడు మరణించినవారిని గెలిచినట్లుగా ప్రకటించకపోవడానికి ఎలాంటి అవకాశం లేదు. ఈ సందర్భంలో మరణించిన ఆమె ఎక్కువ ఓట్లు కనుక పొందితే వారినే ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు. ఎన్నికైన తరువాత ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని 150, 151-ఏ, నిబంధనల ప్రకారం ఆ స్థానంలో ఉప ఎన్నికను నిర్వహిస్తారు’ అని వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement