ఆళ్లగడ్డ ఎన్నికపై ఈసీ నుంచి స్పష్టత కోరాం: భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీలో ఉన్న అభ్యర్థి శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ నియోజకవర్గం ఎన్నికపై తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత కోరినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి మృతి చెందితే ఎన్నిక వాయిదా వేయాలని చట్టంలో ఉందని, అయితే గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి మృతి చెందితే ఎన్నిక నిర్వహణ విషయమై స్పష్టత లేదని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఇప్పటివరకు తనకు ఎదురుకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎన్నికపై వాస్తవ నివేదికను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పంపించానని చెప్పారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపినట్లు ఆయన గురువారం విలేకరులకు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులందరికీ గుర్తులు కేటాయించడంతో పాటు బ్యాలెట్ పత్రాల ముద్రణ కూడా పూర్తయిందని, ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రం మార్చాలా? లేదా ఎన్నికలను వాయిదా వేస్తూ నోటిఫై చేయాలా? అనే అంశంపై కమిషన్ నుంచి స్పష్టత కోరినట్లు వివరించారు. శోభా నాగిరెడ్డి గుర్తింపు పొందని పార్టీ అభ్యర్థి అయినప్పటికీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారని, ప్రస్తుతం పాపులర్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారని, ఇదే విషయాలను నివేదికలో కమిషన్‌కు వివరించామని ఆయన తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో తనకు అవగాహన లేదని చెప్పారు. కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేస్తామని.. కమిషన్ నుంచి శనివారం స్పష్టత వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఆళ్లగడ్డ ఎన్నిక యథాతథం: కలెక్టర్
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శోభా నాగిరెడ్డి మరణించినా ఎన్నికలు యథాతథంగా జరుగుతాయని కర్నూలు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన గురువారం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను కూడా ప్రకటించినందున మే 7న జరిగే ఎన్నికలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్‌లో శోభానాగిరెడ్డి పేరు, ఎన్నికల గుర్తు ఉంటాయని చెప్పారు. ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి గెలిస్తే ఆమె మరణించినందున ఆ నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎన్నిక వాయిదా నిర్ణయం ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
సీఈసీదే తుది నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల 7వ తేదీన జరగనున్న విషయం విదితమే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి మరణం నేపథ్యంలో ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక నిర్వహణ, లేక వాయిదా విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 52 ప్రకారం చూస్తే.. గుర్తింపు ఉన్న పార్టీ అభ్యర్థి మరణించిన సందర్భంలోనే ఎన్నికల వాయిదాకు అవకాశం ఉంటుంది.
ఎన్నికల సంఘం గుర్తింపు లేని వైఎస్సార్ సీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణించిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీల గుర్తింపును ఎలక్షన్ సింబల్ (రిజర్వేషన్ అండ్ అలాట్‌మెంట్) ఉత్తర్వుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం నిర్ణయిస్తారు. వైఎస్సార్ సీపీకి ప్రస్తుతం కామన్ సింబల్ (ఫ్యాను గుర్తు)ను కేటాయించిన విషయం విదితమే. కామన్ సింబల్ కేటాయింపులో ఎన్నికల సంఘానికి విశేషాధికారం ఉన్నట్లే.. ప్రస్తుతం ఎన్నికల వాయిదా విషయంలోనూ నిర్ణయం తీసుకునే విశేషాధికారం ఉందని ఈసీ వర్గాలు చెప్తున్నాయి. శోభా నాగిరెడ్డి మృతిపై నివేదిక, ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నిక విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నుంచి నివేదిక వచ్చాక.. వాటిని పరిశీలించి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని విధివిధానాలు, న్యాయనిపుణుల సలహాలను తీసుకుని ఈసీ ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం.