
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 1,52,56,474 మంది పురుషులు, 1,50,98,685 మంది మహిళలు, 1,735 మంది ట్రాన్స్‌జెండర్లు కలిపి మొత్తం 3,03,56,894 మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2022లో రూపొందిం చిన తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) శశాంక్ గోయల్ బుధవారం ప్రకటించారు.
ముసాయిదా ఓటర్ల జాబితాలో 3,03,56,665 మంది ఓటర్లుండగా, సవరణలో భాగంగా 2,27,226 మంది పేర్లను కొత్తగా చేర్చారు. వివిధ కారణాలతో మరో 2,26,997 మంది ఓటర్ల పేర్లను తొలగించారు. 18–19 ఏళ్ల వయసున్న 1,36,496 మంది యువ ఓటర్లు తొలిసారిగా ఓటర్ల జాబితాలో స్థానం పొందారు. మరో 14,661 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు.