
టోల్ ఫ్రీ నెంబరును ప్రారంభిస్తున్న దానకిశోర్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకై అన్ని పోలింగ్ లొకేషన్లలో ఈ నెల 3న ఆదివారం మరోసారి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ తెలిపారు. అలాగే సలహాలు, సూచనలు ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు డయల్ చేయవచ్చని సూచించారు. హైదరాబాద్ జిల్లాలోని అన్ని పోలింగ్ లొకేషన్లలో బూత్‌లెవల్ అధికారులు ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణపై హైదరాబాద్ జిల్లా ఓటర్ల నమోదు పర్యవేక్షక అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సంయుక్త ఎన్నికల నిర్వహణ అధికారి అమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు ముషారఫ్ అలీ, జయరాజ్ కెనడిలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2018 డిసెంబర్ 26వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని, ఈ జాబితాలో సవరణలు, చిరునామా మార్పిడి, 18 ఏళ్లు నిండినవారికి ఓటరు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 3వ తేదీన బిఎల్‌ఓలు ఫారం–6, 7, 8, 8ఏ ఫారాలతో పాటు ఓటర్ల జాబితాను కలిగి ఉంటారని అన్నారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ స్థాయి ఏజెంట్‌లు కూడా హాజరు కావాలని సూచించారు.
క్షేత్రస్థాయి పరిశీలన అవసరం
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఎన్నికల కమిషన్ నిబంధనలను అనుసరించి ప్రతి ఇంటికి వ్యక్తిగతంగా వెళ్లి విచారణ జరపాలని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. అందిన ప్రతి క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు సంబంధించి పత్రాలను విచారణ జరిపినట్లు బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఏఇఆర్‌ఓలు, ఇఆర్‌ఓలు ధృవీకరించాల్సి ఉంటుందని అన్నారు.
కాల్స్ స్వీకరించిన కమిషనర్
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితాకు సంబంధించి సలహాలు, సూచనలు, సమాచారానికి సంబంధించి టోల్ ఫ్రీ నెం.1950కు ఫోన్ చేయాలని హైదరాబాద్ జిల్లా ఓటర్లకు కమిషనర్ దానకిషోర్ విజ్ఞప్తి చేశారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 1950 టోల్ ఫ్రీ నెంబర్‌లను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా 1950కు వచ్చిన కాల్స్‌ను స్వీకరించి వారితో మాట్లాడారు.