చంద్రబాబుకు బాకా ‘పాంచజన్యం’
‘ఈనాడు’ అసత్య కథనాలపై సీఈవోకు వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
‘పాంచజన్యం’ కథనాలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని వినతి
డిప్యూటీ సీఈవో దేవసేనకి ఫిర్యాదుపత్రం అందజేసిన వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: టీడీపీకి కొమ్ముకాస్తూ ఈనాడు దినపత్రిక ‘పాంచజన్యం’ పేరుతో చంద్రబాబుకు బాకా ఊదుతూ ప్రచురిస్తున్న అసత్య కథనాలను ‘చెల్లింపు వార్తలు’ (పెయిడ్ ఆర్టికల్స్)గా పరిగణించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)కి ఫిర్యాదు చేసింది. ఈమేరకు వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ పేరిట ఉన్న ఫిర్యాదుపత్రాన్ని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిప్యూటీ సీఈవో దేవసేనకు అందజేశారు. తరువాత ఆమె మీడియాతో మాట్లాడా రు. ఈనాడు ఎన్నికల కథనాల పేరుతో పేజీలకు పేజీలుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం కక్కడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. ‘‘ప్రత్యేకించి ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ రోజున దురుద్దేశంతో, కుట్ర పూరి తంగా జగన్‌పై విషం కక్కుతూ ఈనా డు ప్రచురించిన కథనంపై సీఈవోకు పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం. చంద్రబాబును, జగన్‌తో పోల్చుతూ పేజీ అంతా అబద్ధపు రాతలతో నింపేశారు. జగన్‌ను కించపరిచేలా, ప్రజల్లో పలుచన చేయాలనే దురుద్దేశంతోనే అలా ప్రచురించారు. బాబును అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక ఎజెండాతోనే ఆ పత్రిక పనిచేస్తోంది. కనీసం రాష్ట్ర విభజన సమయంలో ప్రజల తరఫున మాట్లాడిన పాపానపోని ఆ పత్రిక.. ప్రజల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతపై విషం కక్కడానికి మాత్రం అక్షరాలను తాకట్టు పెట్టి బాబుకు ఊడిగం చేస్తోంది. టీడీపీకి బాకాలాగా ‘పాంచజన్యం’ వస్తోంది. ఈ ఎన్నికల స్పెషల్‌ను చెల్లింపు కథనాలుగా పరిగణించి టీడీపీ ఎన్నికల ఖర్చు లో చూపాలని కోరాం. జర్నలిజం ముసుగులో ఈనాడు పత్రిక టీడీపీకి అధికార పత్రికగా, కరపత్రంగా మారింది. ఇది మేం మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మా ఫిర్యాదును కచ్చితంగా ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది..’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. సీఈవో భన్వర్‌లాల్ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ సీఈవో దేవసేనకి ఫిర్యాదు అందించామని వెల్లడించారు.
‘సాక్షి’ వాస్తవాలే రాస్తోంది..: ‘సాక్షి’ ప్రత్యేకించి వ్యక్తులకు గానీ, రాజకీయ పార్టీలకు గానీ దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేయడంలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. గణాంకాల ప్రకారమే చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? వైఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? అనే అంశాలపై ఆధార సహితంగా సాక్షిలో కథనాలు వస్తున్నాయని వివరించారు. ‘ఏది నిజం’ గురించి విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ, ‘‘అబద్ధపు రాతలకు సమాధానంగా నిజాలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నందున ఆ శీర్షికతో వాస్తవాలే రాస్తున్నారు. ఎవరిమీదో విషం కక్కాలనో, దుష్ర్పచారం కోసమో చేయడంలేదు. కానీ ఈనాడు దినపత్రిక వాస్తవాలను దాచి, బాబు పాలనను రంగుల ప్రపంచంగా చూపే ప్రయత్నం చేస్తోంది. ఉపఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన టీడీపీకి ప్రాణం ఊదే పని రామోజీ పత్రిక చేస్తోంది’’ అని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.